రివర్సే.. సిటీ పవర్సు!

22 Nov, 2014 00:07 IST|Sakshi
రివర్సే.. సిటీ పవర్సు!

హైదరాబాదీలు చాలా పనులు రివర్సులో చేస్తారు. ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చేస్తారు. భలే వైవిధ్యంగా చేస్తారు. కానీ చాలా గొప్పగా చేస్తారు.
 
సాధారణంగా మనం రోటీలు చేయాలనుకుంటే ఏం చేస్తాం. కలిపిన పిండిని రొట్టెల పీట మీద పెట్టి అప్పడాల కర్రతో చుట్టూ విస్తరిస్తూ పోయేలా రౌండ్‌గా చేస్తాం. కానీ హైదరాబాదీ రుమాలీ రోటీని విస్తరించడం ఎప్పుడైనా చూశారా? అలాగే నిలబడిపోయి మామూలు రోటీలు చేసేవాడి ఆ కళానైపుణ్యాన్ని అదేపనిగా చూడ బుద్ధేస్తుంది. కాస్తంత వెడల్పు చేసిన రోటీని మాటిమాటికీ గాలిలోకి చక్రంలా ఎగరేసి గిర్రున తిప్పుతూ అలా వెడల్పయ్యేలా చేస్తుంటాడు. పేరుకు రుమాలీ గానీ.. దాదాపు టవల్‌కూ, శాలువాకూ సెంటర్ సైజులో ఉండేలా విస్తరిస్తూ తిప్పి.. అంత పెద్ద రోటీని అప్పుడు పెనం మీద వేస్తాడు.

మళ్లీ ఇక్కడ పెనం విషయంలోనూ రివర్సే. సాధారణంగా రోటీలు చేసే పెనం మధ్యలో కాస్త గుంటలా ఉండి, అంచులు ఉబ్బెత్తుగా ఉంటాయి. కానీ రుమాలీ రోటీని కాల్చే పెనం పూర్తిగా రివర్సు. మూకుడును బోర్లా తిరగేసి, దాని కింద మంట పెట్టి రుమాలీ రోటీని కాలుస్తారు. అలా కాల్చాక రుమాలీ అని పేరు పెట్టినందుకో ఏమోగానీ... రుమాల్లాగా మడతలు వేస్తారు. జేబులో మాత్రం పెట్టరు. చుట్టలుగా చుట్టి నోట్లోకి పెట్టి రుచిని ఆస్వాదిస్తారు.

ఇలాంటి రివర్స్ కేసే మరోటి! సాధారణంగా రోటీని కాల్చాలంటే మనమంతా పెనాన్ని పొయ్యి మీద పెడతాం కదా! కానీ ఇక్కడా మరో తరహా రివర్సు కేసే! తందూరీ రోటీ అని పిలిచే ఈ రొట్టెను చేసే పాత్ర పొయ్యిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. పైన ఉండే రంధ్రం ద్వారా రోటీని పాత్ర అంచుకు అతుక్కుపోయేలా చేసి, రోటీనీ కాల్చి ముల్లుకర్రలాంటి దానితో బయటకు తీస్తారు. ఈ తందూరీని మన హైదరాబాదీలంతా ఎంతో ఇష్టంతో తింటుంటారు. రివర్సులు బాగా ఇష్టం కాబట్టి వేరే నగరాల్లో ఉన్న మరో సౌకర్యాన్ని మనమూ పొందాలని ఓ ప్రాజెక్టు చేపట్టాం.

సాధారణంగా ఇంటి ముందు కాళ్లు తుడుచుకోడానికి వేసే పట్టానైనా లేదా కాళ్లకు పెట్టుకునే పట్టా(గొలుసు)లైనా కిందే ఉంచుతాం. అంటే నేల మీదే ఉంచుతాం. కానీ మనకిష్టమైనదాన్ని నెత్తిన పెట్టుకునే స్కీము కింద ఈ పట్టాలను రివర్సులో గాల్లో పెట్టుకుంటున్నాం. అదే మెట్రో రైలు ‘పట్టా’లు! రోజూ తలెత్తి గాల్లోని ఆ పట్టాలను చూస్తున్నప్పుడల్లా... రుమాలీ, తందూరీ రోటీల రుచిని ఆస్వాదించినట్లే... ఆ మెట్రో రైడ్‌ను ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అనే ఓ కుతూహలం. ఎప్పుడెప్పుడు నేలపై కాకుండా రివర్సులో టవర్సు మీద గాల్లో పోయే ఆ ట్రైన్‌లో ఎంత త్వరగా ఎక్కుదామా అనే ఆత్రుత. ఇది నా ఒక్కడిదే కాదు... రోజూ తలెత్తి గర్వంగా చూసుకునే మన నగర ‘పట్టా’దారులందరికీ ఇష్టమైన సమష్టి కోరిక!

మరిన్ని వార్తలు