హైద్రాచల నగరం మనదీ!

21 Mar, 2015 23:19 IST|Sakshi
హైద్రాచల నగరం మనదీ!

‘చెట్టులెక్కగలవా... ఓ నరహరి గుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా’ అంటూ తనను కోరుకుంటున్న యువకుడిని ప్రశ్నించింది చెంచిత. అంటే... తన చెలికాడు మనువయ్యాక తనను సమర్థంగా చూసుకోగలడా లేదా అని పెట్టిన ఎంట్రెన్స్ టెస్టులో ఆమె అడిగిన ప్రశ్నలివి. అంటే... పెళ్లాన్ని చక్కగా పోషించుకోగలగాలంటే చెట్టులెక్కి చిటారుకొమ్మన చిగురు కోయాలి... దాంతో పాటు గుట్టలెక్కాలి అని నిర్ద్వంద్వంగా తేలిపోయింది కదా.
 
తమ తమ చెంచితలు తమకు పెట్టే ఎంట్రెన్సు పరీక్షల్లో పాసవ్వడానికి వీలుగా హైదరాబాద్‌కు చెందిన నరహరులంతా చిగురు కోయడానికి చింతచెట్లు విపరీతంగా పెరిగే చింతల్, చింతల్‌బస్తీ, చింతల్‌కుంట, ఇమ్లీబన్... వంటి అనేక బస్తీలూ, కాలనీలలో నివసిస్తూ, చిగుర్లు కోయడంలో తమ ప్రావీణ్యాన్ని చూపేవారన్న విషయాన్ని గతంలోనే చెప్పుకున్నాం.
 
ఇక ఆ తర్వాత రెండో అర్హత గుట్టలెక్కడం. ఈ పరీక్షలోనూ తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలి కదా. అందుకే వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు గుట్టల వద్దకు చేరి వాటిని ఎక్కుతూ తమ శక్తియుక్తులను ప్రదర్శించి చూపేవారు. ఆధునిక కాలంలోని మౌంటెనీరింగు విద్య హైదరాబాదులోనే పుట్టి... అలా అలా హిమాలయాలకూ, యాండీసూ, రాకీసూ, అపలేచియన్, ఉరల్ పర్వతాలకు చేరిందని హైదరాబాదీయుల నమ్మిక.

అంతెందుకు... తన సామర్థ్యాన్ని నిరూపించుకొమ్మంటూ షాజహాన్ చక్రవర్తి కాస్తా ఔరంగజేబును దక్కన్‌కు పంపితే... గోల్కొండను తన జేబులో వేసుకోడానికి వివిధ పన్నాగాలు పన్నుతూ ఉండేవాడట. ఇందులో భాగంగా ఔరంగజేబు రోజూ నౌబత్‌పహాడ్ అని పిలిచే నేటి బిర్లామందిర్ ఉన్న గుట్టను అదేపనిగా ఎక్కుతుండేవాడట. ఇక్కడ ఔరంగజేబు నరహరి అయితే అతడి చెంచిత గోల్కొండకోట అన్నమాట. ఔరంగజేబంటే నౌబత్‌పహాడు ఎక్కాడు.. కానీ మరి ఆ ఒక్క గుట్టే నగరనరహరులందరికీ సరిపోదు కదా.. అందుకే ఇక్కడ జగద్గిరిగుట్ట, చాంద్రాయణగుట్ట, ఫార్సీగుట్ట, అడ్డగుట్టలాంటి అనేక ఇతర గుట్టలనూ ఏర్పాటు చేసింది ప్రకృతి.

ఇలాంటి తెలుగు పేర్ల గుట్టలతో పాటు... పహాడీ షరీఫ్, నౌబత్ పహాడ్ లాంటి ఉర్దూ పేర్లున్న గుట్టలూ అనేకం ఉన్నాయి. ఇక ఆంగ్లేయ ప్రభువులూ, ఇంగ్లాండు రెసిడెంట్లు హైదరాబాద్‌ను తమ పరోక్ష ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇంగ్లీషు పేర్లున్న గుట్టలైన బంజారాహిల్స్, జూబిలీహిల్స్ ప్రాధాన్యమూ పెరిగింది. దాంతో ఈ ఆధునికకాలంలో అత్యంత సమర్థులూ, అత్యధిక ఆదాయ సంపాదనాపరులూ ఈ హిల్స్‌లో నివాసం ఉండసాగారు. మరి పంజగుట్టలాంటి సమతల ప్రదేశంలో కొందరికి ఎంత వెదికినా గుట్ట కనబడటం లేదట.

కానీ దానికి పంజగుట్ట అనే పేరెలా వచ్చిందంటూ కొందరు ఆశ్చర్యపడుతుంటారు. పంజగుట్ట తాలూకు గుట్టలనే నాగార్జున హిల్స్ అని పిలుస్తుంటారన్న విషయం వారెరగరు. ఇక హిల్‌ఫోర్టు రోడ్డూ, రెడ్‌హిల్స్ అనేలాంటి పేరున్న ఏరియాలు ఎన్నెన్నో. గతంలోనూ ప్రభువులూ, నవాబులూ, పైగాలూ, ప్రధానులూ అందరూ ఏ గుట్టమీదో, మిట్టమీదో ఇళ్లు కట్టుకుని దర్జా చూపించేవారు.

ఏతావాతా హైదరాబాద్ అన్నది సమర్థుల నివాసమన్నమాట నిక్కమని తెలియపరచడం కోసం, ఇక్కడ ఉండే వారంతా గుట్టలూ, మిట్టలూ ఎక్కగలరని లోకానికి తెలపడం కోసమే అడుగుకో గుట్ట, అంగుళానికో మిట్ట ఉండీ... అత్యంత ఎక్కువమంది సమర్థుల గూళ్లకు ఆవాసంగా పేరొందిందీ హైదరాబాద్ నగరం!

మరిన్ని వార్తలు