నేను.. మీ దియా!

18 Apr, 2015 23:20 IST|Sakshi
నేను.. మీ దియా!

సెలబ్‌డబ్
సెలబ్రిటీస్ హార్ట్ బీట్

దియామీర్జా
 
మోడల్‌గా మెరిశారు. సినీనటిగా వెలిగారు. నిర్మాతగా మారారు. వీటన్నింటికంటే మించి చిన్న వయసులోనే సందేశాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తోటి నటీనటులకు భిన్నంగా నిలిచారు. దియామీర్జా మన హైదరాబాదీ అని సగర్వంగా చెప్పుకొనేలా తన జీవనయానాన్ని మలచుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తన మనసులో మాటల్ని ఇలా
 పంచుకున్నారు.    ..:: ఎస్.సత్యబాబు
 
నేనెప్పుడూ మోడల్‌ని కావాలనుకోలేదు. అయ్యాను. నటిని అనే ఆలోచనే చేయలేదు. కాని సినిమాల్లో నటించాను. అదే క్రమంలో నిర్మాత అయ్యాను. డబ్బు కోసం సినిమాలు తీయడం లేదు. నా ఆలోచనలు, ఆశయాలను వీలైనంతగా ప్రతిఫలించే సినిమాలనే చేస్తున్నాను. ఇటీవల నేను తీసిన బాబీజసూస్ సినిమా అలాంటిదే.
 
నేను.. మోడల్.. నటి..

‘నువ్వు అందంగా ఉంటావన్న భావన తలకెక్కనీయవద్దు’ అని అమ్మ ఎప్పుడు హెచ్చరించేది. నేనెంచుకున్న కెరీర్ అందంతో ముడిపడి ఉన్నా.. కేవలం దాన్నే ఆధారంగా నేనెన్నడూ భావించలేదు. అందాలపోటీలను కనీసం చూడని నేను.. అనుకోకుండా ఓ రోజు బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నాను. మా అమ్మ ఆకాంక్షలకు వ్యతిరేకంగా అందులో పార్టిసిపేట్ చేశాను. కిరీటం గెలుచుకున్నా.. ఒంటరి అయిపోయాను. సంతోషం అనేది ఇతరులతో పంచుకున్నప్పుడే కలుగుతుందని నాకు ఆనాడే తెలిసింది. ఇక సినిమాలు కూడా నేను ప్లాన్ చేసుకున్న రంగం కాదు. స్కూల్‌డేస్‌లో థియేటర్ అనుభవం ఉంది. బ్యూటీ కాంటెస్ట్‌లో విజయం నన్ను అమాంతంగా నటిని చేసేసింది.
 
నేను...నా చిన్నతనం...

మానసికంగా నా పరిణతికి నా స్కూల్‌డేసే కారణం. మా ఇంట్లోగానీ, స్కూల్‌లో గానీ.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా చూపేవారు కాదు. మా పేరెంట్స్‌ది ప్రేమ వివాహం. ఇద్దరి మతాలు వేరు. దీంతో చిన్నప్పుడు మన మతమేదని అమ్మను ప్రశ్నించేదాన్ని. ‘మానవత్వమే మన మతమ’ని అమ్మ చెప్పేది. అయితే ఆ సమాధానంతో అందరినీ కన్విన్స్ చేయలేకపోయేదాన్ని. దీంతో ఇండియన్ అని చెప్పమన్న అమ్మ సూచనను అమల్లోపెట్టాను. నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు నాన్న పోయారు. తర్వాత నాకు స్టెప్ ఫాదర్‌గా అహ్మద్ అలీ మీర్జా వచ్చారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. నా సర్‌నేమ్ ఆయన అందించిందే.
 
నేను.. సేవ..

మొదటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువే. అందుకే మంచి ఉద్దేశాలతో వచ్చే ఎన్జీవోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. మహిళలపై దాడుల నుంచి గ్రామీణ విద్య వరకు మన జీవితాలపై ప్రభావం చూపే ఏ అంశమైనా నా అవసరం ఉందంటే తప్పకుండా ముందుంటాను. ఎన్డీటీవీ గ్రీన్‌థాన్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అందులో భాగంగా ఉన్నాను. కేన్సర్, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే సొసైటీలు, స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పెటా, క్రై.. ఇలా పలు సంస్థలతో కలసి కదులుతున్నాను. ప్రజాప్రయోజన కార్యక్రమాల ప్రచారం కోసం ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను సంప్రదిస్తే వెంటనే ఓకే చెబుతున్నాను.
 
నేను.. ఆయన..

పెళ్లి నా జీవితానికి మరింత ఆనందాన్ని జత చేసింది. సాహిల్.. ఓ అద్భుతమైన భాగస్వామి. ఆయన మనస్తత్వం, ఆలోచనలు బాగుంటాయి. ఇంకో మాట.. నాపై భాగ్యనగరం ప్రభావం ఎంతో ఉంది. చిన్నప్పుడు నేను చదువుకున్న విద్యారణ్య స్కూల్‌లో అవలంబించిన జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ నుంచి.. ఇక్కడ ఉండగా నా జీవితంలో ఎదురైన ప్రతి పరిణామం నా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించాయి.
 

మరిన్ని వార్తలు