ఆ తల్లి కళ్లలో కన్నీటిని చూసి ఏడ్చాను...

22 Jul, 2013 04:28 IST|Sakshi
ఆ తల్లి కళ్లలో కన్నీటిని చూసి ఏడ్చాను...
 ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందో ఉండదోనని ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ విద్యార్థులు, తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.  వారికి బాసటగా నిలవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ  ఈ నెల 18న రెండు రోజుల పాటు ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో ‘ఫీజు దీక్ష’ ప్రారంభించారు.  సాయంత్రం రామ్‌నగర్‌కు చెందిన కళాకారుడు ములకలపల్లి రవి విజయమ్మపై అభిమానంతో ‘అమ్మంటే నీలా ఉండాలి’ అంటూ ఓ పాట పాడారు. ఆ పాట విని విజయమ్మ భావోద్వేగంతో చలించిపోయారు . ‘అమ్మంటే ’ పాటతో పలువురిని కదిలించిన కవి, గాయకుడు రవి పరిచయమే నేటి ‘కళాత్మకం’
 
  మీ నేపథ్యం గురించి చెప్పండి...
 భద్రాచలం దగ్గరలోని గౌరిదేవిపేట గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మా నాన్న పౌరాణిక, జానపద గీతాలు పాడేవారు. ఆ ప్రభావం నాపై ఉంది. సినిమాలలో పాడాలని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ జానపద కళలపై పరిశోధన చేస్తున్నాను. 
 
 పాటలు రాయడానికి ప్రేరణ ఏమిటి?
 చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పాటలు రాయడం, బాణీలు కూర్చడం, పాడటం చేసేవాడిని. మా అన్నయ్య నన్ను ప్రోత్సహించేవారు. సినిమా పాటలు వింటున్నప్పుడు నేను కూడా పాటలు రాస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. మొదటిసారి 1995లో దూరదర్శన్‌లో ఒక కార్యక్రమానికి పాట రాసే అవకాశం వచ్చింది. జానపదాలలో సరళమైన భాషలో ఉండాలని చెప్పి నా చేత రాయించారు. అలా మొదలైంది నా ప్రస్థానం.
 
 మీకు ఇష్టమైన  కవులు, గాయకులు ఎవరు?
 శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సిరివెన్నెల, వేటూరి, గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జేసుదాసు.
 
 ఏ అంశాలపై పాటలు ఎక్కువగా రాస్తారు?
 హృదయ విదారక సంఘటనలపై రాస్తుంటాను. సినిమా పాటలు ఎక్కువగా రాయాలనేదే నా కోరిక. ప్రస్తుతం జగనన్నపై పాటల సీడీనీ సిద్ధం చేశాను.  
 
 గుర్తింపు తెచ్చిన పాట?
 జన్మభూమి కార్యక్రమంపై పాట రాశాను. బంగారు పతకం వచ్చింది. ఆ తర్వాత ‘ఆసేతు హిమాచలం...కన్యాకుమారి కాశ్మీరం’,‘మనస్ఫూర్తిగా ‘ప్రియా ప్రేమిస్తున్నానే’ లాంటి పాటలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
 
 మీ పాటలకు మీరే బాణీలు కట్టుకుంటారా? 
 అవును! నా పాటలకు నేనే స్వరకల్పన చేసుకుంటాను. ట్యూన్‌తో పాటుగా పదాలు వెంటనే పొందుపర్చుతూ పాట రాసుకుంటాను. సందర్భం గుర్తుంచుకుంటే, పదాలు, ట్యూన్ ఒకేసారి కుదురుతాయి.
 
 సంగీతం నేర్చుకున్నారా?
 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలతో పాటు ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేశాను. ‘ఫోక్’ ఆర్ట్స్‌లో పట్టా పొందాను. 
 
 అమ్మంటే నీలా ఉండాలని...పాట గురించి చెప్పండి
 వైఎస్సార్  మహానేత. 2004, 2005లలో సంవత్సరాలలో వైయస్ కోసం ‘శంఖారావం’ ‘రాజన్నా మళ్లీ మనదే విజయం’ ఆడియో చేసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో వైయస్ గొప్పతనం తెలిసింది. ఆయనపై అభిమానం ఏర్పడింది. వైఎస్సార్ మరణ వార్త విని మూడు రోజులు ఏడ్చాను. జగనన్నను జైలులో పెట్టి వేధిస్తున్నందుకు నా గుండెలో చెప్పలేనంత బాధ ఉంది. ఏనాడూ బయటికి రాని ఆ తల్లి విజయమ్మ జనం కోసం ఎండనక వాననక తిరుగుతూ ఉంటే నిజంగా నా గుండె పగులుతోంది.. ఆ సందర్భంలో హృదయాంతరాల్లోంచి వచ్చిందే- 
 ‘అమ్మంటే నీలా ఉండాలని ఆంధ్రదేశమనుకుంటుందమ్మా,
 తల్లంటే నీలా ఉండాలని 
 ప్రతీ తల్లి 
 అనుకుంటుందమ్మా, 
 అమ్మనే పదానికి 
 అర్థమే నీవమ్మా, 
 కమ్మని ప్రేమని పంచే 
 తల్లివి నీవమ్మా,
 కష్టాలు నష్టాలెన్నో 
 నీ గుండెను పిండేసినా, 
 అదరక బెదరక 
 అలుపే ఎరుగక,
 దైవమే తోడని ధైర్యంగా సాగుతున్నావు, 
 నమ్ముకున్న ప్రజలకై 
 నిత్యం పోరాడుతున్నావు, 
 మహానేత లేకపోయినా 
 మహాతల్లివి నీవున్నావమ్మా..!’ అనే పాట. 
 
 విజయమ్మ చలించి పోయినప్పుడు ఎలా అనిపించింది?
 నా పాటకి అమ్మ కంట త డిపెట్టి ఏడుస్తుందని నాకు తెలియదు. పాట మొత్తం పాడిన మరుక్షణం ఆమె ముఖంలోకి చూస్తూనే నా మనసు ఆర్ద్రమైంది. ఆ మహాతల్లి కళ్లలోని నీటిని చూసి నేను ఏడ్చాను. మరోసారి ఆ తల్లి వైపు చూసేసరికి అందరూ స్టేజీ మీదకు రమ్మన్నారు. ఆ పాట విన్న వాళ్లందరికీ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. కళాకారుడిగా నా జన్మ ధన్యమైందనుకున్నాను. 
 
 - కోన సుధాకర్ రెడ్డి, 
 ఫోటో:లావణ్య
 
మరిన్ని వార్తలు