డయాబెటిస్‌వారికి ఫిట్‌నెస్ కోసం...

4 Jul, 2013 04:03 IST|Sakshi
డయాబెటిస్‌వారికి ఫిట్‌నెస్ కోసం...
 నేను గతంలో ఎక్సర్‌సైజ్ చేస్తూ... బాగా తినేవాణ్ణి. ఇప్పుడు నాకు డయాబెటిస్ వచ్చింది. మళ్లీ ఎక్సర్‌సైజ్ చేయాలనే ఉంది. నేను వ్యాయామం మొదలుపెట్టవచ్చా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
 - గిరిప్రసాద్, హైదరాబాద్ 
 
 డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... 
 పిండిపదార్థాలు : గోధుమ, వరి వంటి పిండిపదార్థాలు బాగా శక్తినిస్తాయి. ఒక గ్రాము పిండిపదార్థం దాదాపు 4 క్యాలరీల శక్తిని ఇస్తుంది. పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. పిండిపదార్థాలు తీసుకునే సమయంలో ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచుపదార్థాలు (ఫైబర్) శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలలో, బొప్పాయి, జామ వంటి పండ్లలో, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. 
 
 ప్రోటీన్లు : గ్లూకోజ్ పాళ్లు పెరగకుండా చూసే అమినో ఆసిడ్స్‌ను అందిచడంలో  ప్రోటీన్లు దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్ వంటి వాటిలో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం తీసుకునే సమయంలో వేటమాంసం, రెడ్ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి మంచిది. 
 
 కొవ్వులు: శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరం. కాబట్టి వాటిని పూర్తిగా మానేయడం సరికాదు. కొవ్వుపదార్థాల వల్ల ఎక్కువ క్యాలరీలు ఉత్పన్నం అవుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. డయాటెటిస్ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి, జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు. 
 
 ఇక వ్యాయామం విషయానికి వస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి  వ్యాయామం చాలా కీలకం. అయితే మీరు గతంలోలా మజిల్ బిల్డింగ్ వ్యాయామాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా శరీరంలోని క్యాలరీలు ఖర్చు అయ్యేలా ఇప్పుడు బ్రిస్క్ వాకింగ్, స్లో జాగింగ్ వంటి వ్యాయామాలు చేయండి. వ్యాయామం మొదలుపెట్టే ముందు ఒకసారి ఫిట్‌నెస్ ఫిజీషియన్‌ను సంప్రదిస్తే మంచిది.
మరిన్ని వార్తలు