సమ్‌థింగ్ స్పెషల్ కావాలి: ఉదయభాను

12 Jul, 2014 00:45 IST|Sakshi
సమ్‌థింగ్ స్పెషల్ కావాలి: ఉదయభాను

మీ..  ఉదయభాను
కడలికి పొంగు నేర్పింది ఆటుపోట్లు. జీవితానికి దిశానిర్దేశం చేసేది ఒడిదుడుకులు. ఒక్క ఘటన చాలు.. గుండెల్లో ప్రతిఘట న శక్తిని నింపడానికి. బలమైన సంఘటన చాలు బలీయమైన దారి వేయడానికి. అందుకే.. పట్నం వచ్చిన పల్లెటూరి పిల్ల మౌనానికి సూటిపోటి మాటలు.. మాటలు నేర్పాయి. ఆమె అమాయకత్వానికి ఎగతాళి గడుసుతనం నేర్పింది. యాంకర్‌గా తాను చెప్పే మాటలు కావివి.. ఉదయభానుగా తన సందేశమిదని సందేహాలూ వద్దు! అనుభవాలు నేర్పిన పాఠాలివి.. అంటోంది మీ ఉదయభాను.
 
 కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ నా ఊరు. ఓ పల్లెటూరు. అమ్మ... స్కూల్లో ఫ్రెండ్స్. చుట్టపక్కల వాళ్ళు. ఇదే ప్రపంచం. అల్లరిగా ఆడుకోవడం. పెంకిగా గోలచేయడం. చిలిపిగా ఊరంతా తిరగడం. ఇంతే.. పదేళ్ల దాకా నాకు తెలిసిన లైఫ్. అమ్మకు మాత్రం నేనంటే ప్రాణం. ఆమె దృష్టిలో నేనే అందగత్తెను. ఆమెకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ వేసేది. మూడు నెలల వయసులోనే డిఫరెంట్ ఫ్రాక్స్ కుట్టించి వేసేదట.
 
 కసి పెంచింది
  చిలిపిగా ఎగిరే ఈ సీతాకొక చిలకను సిటీకి పరిచయం చేసింది మా అమ్మే. వసంతం వస్తే మురిసిపోయే కోయిలమ్మ గ్రీష్మ తాపం భరించగలదా..? పల్లెటూరులో పిల్లవాగులా ప్రవహించిన నేను సిటీలైఫ్‌లో పరిగెత్తగలనా..? ఇక్కడి వ్యక్తిత్వాలు కొత్త.. ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అసలే తెలియదు. ‘పైకి రావాలంటే పదిమందితో కలసిపోవాలి’ అన్న మాటలు బాగానే తోచాయి. ఊళ్ళో ఇలాగే ఉండేదాన్నే... సిటీలో ఇలా ఉండకూడదా...? ఎలా ఉంటే పైకొస్తాం? ఆలోచించాను. ఎన్నో రాత్రులు. ఒక్కోసారి బుర్ర హీటెక్కేది. ఎదుటివారి చులకన భావం నాలో కసి పెంచింది. అతి చిన్న వయసులో బుల్లితెరపై కన్పించే అవకాశం కల్పించింది. దూరదర్శన్‌లో హిట్ అయిన వసంత సమీరం ఫస్ట్ బ్రేక్ అనే చెప్పాలి.
 
 మాటల గోదారి..
 మీరు బాగా మాట్లాడుతున్నారు.. ఓ టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్  చెప్పడం ఆశ్చర్యం అన్పించింది. ఇదెలా సాధ్యమైంది? అన్న ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుంది. జనాలు ఏం కోరుకుంటున్నారో తొందరగా అర్థం చేసుకున్నాను. ఇంగ్లిష్ నేర్చుకున్నాను. ఎప్పుడో మరచిపోయిన అక్షరాలను గుర్తు చేసుకున్నాను. రామ్మూర్తి అనే లెక్చరర్ వద్దకు ట్యూషన్‌కి వెళ్లాను. పట్టుదలగా ప్రయత్నించాను. ఆయన నన్ను తన కూతురు కన్నా ఎక్కువగా అభిమానించారు. ఫ్యాషన్‌గా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్నాను. ఇంగ్లిష్ ఒకటేనా.. ఎన్నో పుస్తకాలు చదివాను. సాహిత్య పరమైన జ్ఞానాన్ని పెంచుకున్నాను. పట్టుదలే సోపానాలుగా మలచుకున్నాను. అప్పటి వరకు నన్ను డామినేట్ చేసిన బిడియం ఆమడ దూరం పారిపోయింది. యాంకర్‌గా నా కెరీర్ మంచి మలుపు తిరిగింది.
 
  పదిమంది కోసం..
 ఏ భావమూ తెలియని ఈ పల్లెటూరి పిల్లను అప్పుడప్పుడూ మూగబోయిన గొంతులు పలకరిస్తాయి. వేదనామయ హృదయాలు ఆలోచింపజేస్తాయి. ఉదయభాను.. నాటోన్లీ యాంకర్.. సంథింగ్ స్పెషల్ కావాలి. దానికి వేదిక సోషల్ యాక్టివిటీ. సమాజ సేవ. చేయాలనుంది. చేసేందుకు దాదాపు మార్గం సిద్ధం చేసుకున్నాను. త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తాను.
 
 గప్‌చుప్ తినాలనిపిస్తే..
 లవ్ మ్యారేజ్ నాది. బిజీ లైఫ్ సరేసరి. ఖాళీ ఉన్నప్పుడు మావారితో సరదాగా కాలక్షేపం చేస్తాను. అప్పుడు చిన్నపిల్లలా అలా బయటకు వెళ్లాలనిపిస్తుంది. వీధి చివరలో ఉండే గప్‌చుప్ బండి దగ్గర ఆగాలన్పిస్తుంది. అప్పుడప్పుడు అలా చేస్తూంటాను. ఇంతడైనమిక్‌గా కన్పించే నేను ఎప్పుడూ పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లలేదు. నాకు నచ్చదు. అయితే బయటకు వెళ్తే మాత్రం నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త తీసుకుంటాను.  ఒక రకంగా బురఖా వేసుకుంటాననుకోండి.
-  వనం దుర్గాప్రసాద్

మరిన్ని వార్తలు