సమాజ సేవలో.. నేనున్నానని..

15 Jun, 2015 03:58 IST|Sakshi
సమాజ సేవలో.. నేనున్నానని..

 హీరో అంటే.. వందమందిని ఇరగదీయాలి. డ్యూయెట్లు పాడాలి. తనవారి కోసం విలన్‌ను ఎదిరించి నిలవాలి.. ఇది ‘రీల్ హీరో’ సంగతి. మరి నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవారు.. తనకన్నా సమాజం కోసం పాటుపడేవారు.. ‘రియల్ హీరో’ అవుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వేణు శ్రావణ్. వెండి తెరపై హీరో కావాలన్న కలతో సిటీకి వచ్చిన అతడు పేదల సాయంలో నిమగ్నమయ్యాడు. ఓ పక్క రేడియో జాకీగా, మరోపక్క బుల్లితెర నటుడిగా కొనసాగుతున్నాడు. తాను సేకరించిన పాత, కొత్త దుస్తులను ఆదివారం ధర్నా చౌక్‌లో పేదలకు పంచాడు. వారికి భోజనం సైతం పెట్టాడు. ఈ సందర్భంగా అతడిని ‘సాక్షి’ పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన మాటల్లోనే..  - సాక్షి,సిటీబ్యూరో
 
 అలా ‘చలో హైదరాబాద్’
 ‘మాది ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను. పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు వేశాను. అలా సినిమా హీరో కావాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీని ఇరగదీయాలని చలో హైదరాబాద్ అన్నా. భాగ్యనగరంలో కొన్నాళ్లు టీచరుగా పనిచేశాను. తర్వాత  రెయిన్‌బో ఎఫ్‌ఎంలో ఆర్‌జేగా మారాను. మరో పక్క ‘విధి, రాధా-మధు, చక్రవాకం, ఆమె, శుభలగ్నం’ వంటి సీరియల్స్‌లో నటించాను. ఇదే సమయంలో యాంకర్ గానూ చేస్తున్నా. తర్వాత సమాజంలో ఒక్కో ఘటనతో ఒక్కో అనుభవం. దీంతో ఆశయం ముందు హీరో కావలన్న ఆశ చిన్నదైపోయింది.

 అలా పుట్టుకొచ్చింది ‘కలర్స్’
 ‘కొన్నాళ్ల క్రితం వృద్ధుల దినోత్సవం రోజు నిజాంపేట్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఈవెంట్ కోసం యాంకర్‌గా వెళ్లాను. ఆరోజు ఉదయం నుంచి తమ బిడ్డల కోసం వృద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంత సేపటికీ వారు రాలేదు. నా వాక్ చాతుర్యంతో వారిని ఆడించి మెప్పించాను. వారు నన్ను నిజమైన బిడ్డవంటూ ముద్దాడారు. ఒకసారి చిన్న బాబుకి లివర్ ఆపరేషన్ చేయాలి. ఖమ్మంకు చెందిన దంపతులిద్దరూ నా రూములో 15 రోజులు ఉన్నారు.

‘సాక్షి చానెల్’ వారిని సంప్రదిస్తే బాబు సమస్యను టీవీలో టెలికాస్ట్ చేశారు. దీంతో రూ.14 లక్షలు పోగయ్యాయి. ఆ డబ్బుతో ఆ బాబు బతికాడు. సమయానికి సరైన సాయం అందక చాలామంది పేదలు కష్టాలు పాలవుతున్నారు. చర్లపల్లి జైల్లో కార్యక్రమాలు చేశా. క్షణికావేశంతో చేసిన తప్పులకు నేరస్తులు జైల్లో ఉంటే వారి కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో తెలుసుకున్నా.  ఇలాంటి వారికి సాయం చేయాలనుకున్నా. ఇందుకోసం డబ్బు కావాలి.

ఇందుకు 2013లో ‘కలర్స్ సర్వీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో సంస్థను స్థాపించా. దీనిద్వారా లైవ్ షోలు చేసి విరాళాలు సేకరిస్తున్నా. ఫేస్‌బుక్ స్నేహితులతో మాట్లాడి ఆదివారాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నా. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే నాకు ముఖ్యం’.. అని ముగించాడు.

మరిన్ని వార్తలు