సర్కారు బడుల్లో..ఇంగ్లిష్ విద్య

26 Jun, 2015 00:11 IST|Sakshi
సర్కారు బడుల్లో..ఇంగ్లిష్ విద్య

మంత్రి హరీష్‌రావు
ప్రభుత్వ స్కూళ్లకు ‘రోటరీ’ బెంచీల పంపిణీ
మాదాపూర్:
ప్రభుత్వం సర్కారుబడుల్లో ఇంగ్లిషు మాధ్యమం ప్రవేశపెట్టేందుకు యోచిస్తోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. రోటరీ ఫౌండేషన్‌ఆధ్వర్యంలో గురువారం 145 ప్రభుత్వ పాఠశాలకు 7,593 డ్యూయల్ డెస్క్‌లు పంపిణీ చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యలో నాణ్యత చాలా ముఖ్యమని, బోధనతో పాటు పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించాలన్నారు. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో ప్రతి విద్యార్థి 10 మొక్కలను నాటాలని సూచించారు. పోలియో నిర్మూలనకు రోటరీ ఫౌండేషన్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

రోటరీ ఇంటర్నేషనల్ డెరైక్టర్ మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ.. త్వరలో విన్స్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఇందులో పదేళ్లలో 10 వేల టాయిలెట్ల నిర్మాణం చేపడతామన్నారు. కాగా, కార్యక్రమం జరుగుతుండగా వీడియో క్రేన్ ప్రమాదవశాత్తు ఊడిపోయి టేబుల్‌పై పడి పక్కనే ఉన్న విద్యార్థినికి తగిలింది. దీంతో బాలికకు స్వల్ప గాయమైంది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రోటరీ ఫౌండేషన్ కౌన్సిలర్ మర్రి రవీంద్రారెడ్డి,సేవ్ అవర్ స్కూల్స్ చైర్మన్ రవి వడ్లమాని, ఎం.వి. ఫౌండేషన్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు