కలిసిన హృదయాలు

14 Feb, 2015 00:40 IST|Sakshi
కలిసిన హృదయాలు

రీల్ లైఫ్‌లో రొమాన్స్‌లతో కెపైక్కించే తారలు రియల్ లైఫ్‌లోనూ వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు కలసి చేస్తే... హిట్ పెయిర్ అవుతుందో లేదో గానీ.. వారి మధ్య పండిన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ఆపై పర్సనల్‌గానూ వర్కవుటయిపోతోంది. ఒకటా రెండా... వందేళ్లు పైబడిన బాలీవుడ్‌లో ఇలాంటి కథలు లెక్కకు మించి! ఆనాటి నుంచి ఈనాటి వరకు లవ్... లైఫ్‌లో రొటీనైపోయింది. షూటింగ్‌ల్లో చిగురించిన ప్రేమ కొందరిని భార్యాభర్తలను చేసింది. ఇంకొందరిని ప్రేమికులుగానే వదిలేసింది. మరికొందరిని విరహంలో ముంచెత్తింది. మరి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ ‘హాట్’ సీట్‌లో ఉన్న బాలీవుడ్ జంటలపై ఓ లుక్కేద్దాం!
 
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే స్టార్ జంట కత్రినా కైఫ్, రణబీర్‌కపూర్. దాదాపు ఏడాదికి పైగా ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. షూటింగ్‌ల్లో ఎవరికి వారు బిజీగా ఉన్నా... వెసులుబాటు చేసుకుని మరీ కలుస్తున్నారు. న్యూ ఇయర్ రోజు లండన్‌లోని కత్రినా ఫ్యామిలీని రణబీర్ కలిశాడన్నది పెద్ద వార్త. అక్కడ పెళ్లి ముచ్చట్లు కూడా జరిగిపోయాయని ఇండస్ట్రీ అప్పట్లో టాకేసింది. మరికొందరు ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందన్నారు. కానీ.. రణబీర్ వీటన్నింటినీ ఖండించాడు.  
 
ఇక రణబీర్ మాజీ ప్రియురాలు, సూపర్ హీరోయిన్ దీపిక పడుకొనే తాజాగా మరొకరితో లవ్‌లో పడింది. ధోనీ, యువరాజ్‌లతో కొంతకాలం డేటింగ్ చేసిన ఈ అమ్మడు తాజాగా కుర్ర హీరో రణవీర్‌సింగ్‌తో కలసి తెగ తిరిగేస్తోంది. ఆ మధ్య దీపిక బర్త్‌డే బెంగళూరులో జరుపుకుంటే... మనోడు అటెండయ్యాడు. అంతటితో ఆగలేదు.. తన ప్రేమను చాటుకోవడానికి పొడుగు కాళ్ల సుందరిని వెంట పెట్టుకుని షాపింగ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కాస్ట్‌లీ ఐటెమేదో కొనిపెట్టాడట కూడా. రీసెంట్‌గా ఈ చిన్నదాని బుగ్గపై పబ్లిక్‌గా ముద్దు పెట్టి వివాదాల్లో ఇరుక్కున్నాడు. అతికి అసలు అర్థం ఎవరంటే బాలీవుడ్ జనాలు రణవీర్ పేరు చెబుతారు. బహుశా అదే ఆమెకు అతిగా నచ్చేసిందేమో!
 
నాకెవరూ లేరు.. నేను ఒంటరినే అంటూ నిన్నమొన్నటి వరకూ చెప్పుకొచ్చిన సెక్సీ తార బిపాసాబసు తాజాగా తానూ జతగాడిని వెతుక్కుందట. రొమాంటిక్ హీరో జాన్ అబ్రహంతో చాన్నాళ్లు రొమాన్స్ చేసిన బిప్.. ఆ తరువాత కోస్టార్ హర్మాన్ బవేజాతో తిరిగింది. ఇప్పుడు మరో కుర్ర హీరో కరణ్‌సింగ్ గ్రోవర్‌తో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. మొత్తానికి లేదు లేదంటూనే డేటింగ్‌ల్లో గడిపేస్తూ ఎంజాయ్ చేస్తోంది బిప్!
 
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్‌ఖాన్ సీజన్‌కో గాళ్‌ఫ్రెండ్‌ను మారుస్తుంటాడు. అతగాడి లిస్ట్ చెప్పాలంటే బారెడు! ఐశ్వర్యా, కత్రినా, జాక్వెలిన్... ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల తన చెల్లి అర్పితాఖాన్ మ్యారేజ్‌లో రొమేనియన్ టీవీ హోస్ట్ లులియా వంతూర్‌ను ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసి షాకిచ్చాడు. ఇరువురూ డేటింగ్‌లో ఉన్నారనేది అసలు విషయం.
 
ఇటు సినిమా ఫీల్డ్... అటు క్రికెట్ గ్రౌండ్‌లో ఫేమస్ ఫిగర్లు అనుష్కాశర్మా, విరాట్ కొహ్లీల ప్రేమాయణం ఓ రేంజ్‌లో సాగుతోంది. జతగాడు ఆస్ట్రేలియా టూర్‌లో ఉంటే... న్యూఇయర్ పార్టీ కోసం అక్కడికి వెళ్లిపోయింది. అనుష్కా కొన్ని రోజులు విరాట్‌తో ఆసీస్ బీచ్‌లు, క్లబ్‌ల్లో షికార్లు కొట్టి వచ్చింది. నిజమెంతో తెలియదు గానీ... ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్.
 
సోగకళ్ల చిన్నది సోనాక్షి సిన్హా పెద్దగా వార్తల్లో ఉండదు గానీ... బోనీకపూర్ కొడుకు అర్జున్‌కపూర్‌తో సీక్రెట్‌గా డేటింగ్ సాగిస్తోందని బీటౌన్ టాక్. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు వెళ్లినట్టు సమాచారం. అయితే కలసి సినిమా చూసినంత మాత్రాన ఏదో జరిగిపోతున్నట్టేనా అంటూ ప్రశ్నించి కాస్త కన్‌ఫ్యూజన్‌లో పెట్టింది సోనాక్షి. వర్ధమాన తారల్లో శ్రద్ధాకపూర్ సహనటుడు ఆదిత్యారాయ్‌కపూర్‌తో అఫైర్ నడిపిస్తోందట. ఈ ప్రేమల్లో ఎన్ని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతాయో తెలుసుకోవాలంటే వచ్చే వాలెంటైన్ డే వరకు ఆగాల్సిందే!

మరిన్ని వార్తలు