ఇండియా ఫొటోజెనిక్ కంట్రీ

29 Jul, 2013 03:35 IST|Sakshi
ఇండియా ఫొటోజెనిక్ కంట్రీ
 కుంభమేళా-2013... పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాలన్నిటికీ మిన్నగా దాదాపు 12 కోట్లమంది పవిత్రస్నానాలు ఆచరించారు. ఈ ప్రపంచ పండుగకు వివిధ దేశాల నుంచి  పర్యాటకులు, భక్తులు అలహాబాద్‌కు వచ్చారు.  హిమాలయాల నుంచి ఎడారి నుంచి సముద్రతీర అటవీ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు గంగ-యమున-అంతర్వాహినిగా సరస్వతి సంగమించే త్రివేణీ ప్రవాహంలో భక్తిపారవశ్యంతో మునకలే శారు. ఈ ఘనమైన వేడుకను భారతదేశంలో డిప్యూటీ జర్మన్ దౌత్యవేత్త కోర్డ్ మియర్ క్లోడ్, ఫ్రెంచ్ జాతీయుడు జీన్ పియరె ముల్లర్, భారతీయుడు లలిత్‌వర్మలు తమ తమ దృష్టికోణంలో ఫొటోలు తీశారు. ఈ ‘ముక్కంటి’ ప్రదర్శన హైద్రాబాద్‌లోని గోథెజంత్రమ్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్లోడ్, లలిత్ వర్మలతో ఇంటర్వ్యూ...
 
 మీ గురించి చెప్పండి?
 క్లోడ్: నన్ను నేను రెండుగా విభజించుకుంటాను. నాలో అధికారి-ఫొటోగ్రాఫర్ ఉన్నారు. దౌత్యవ్యవహారాలు చూసే క్రమంలో కూడా నేను పనిచేసే దేశపు సంస్కృతికి ప్రాధాన్యతనిస్తాను. కల్చరల్ డిప్లమసీ ఫ్యాన్‌ను. ఏభై ఏళ్లు దాటినవారే బిజినెస్ గురించి ఆలోచిస్తారు. యువత కల్చర్ గురించి ఆలోచిస్తుంది. ఫలానా దేశస్థులు ఎలాంటి వారు. వారి ఆహారం ఏమిటి? విహారం ఏమిటి? సాహిత్యం ఏమిటి? ఫైన్ ఆర్ట్స్‌లో ఎలా ఉన్నారు. పాపులర్ ఐకాన్స్ ఎవరు? అని ఆలోచిస్తారు. ఇదంతా కల్చరల్ డిప్లమసీలో భాగం.
 
 కుంభమేళాకు అధికారిగా వెళ్లారా? ఫొటోగ్రాఫర్‌గానా?
 లలిత్ వర్మ: ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. మేము ముగ్గురం కుంభమేళా నిర్వాహక అధికారుల దగ్గరకు వెళ్లాం. ఉత్సవాలకు ముందు దరఖాస్తు చేసిన మేరకు మాకు అఫీషియల్ పాస్‌లు ఇవ్వవలసినదిగా కోరాం. మూడు గంటలు వెయిట్ చేయించారు. ఏమీ చెప్పరు. అప్పుడు క్లోడ్ అన్నాడు... మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడం మంచిదని. క్రిక్కిరిసిన జనసముద్రంలో పడ్డాం. ఎటు వెళ్తున్నామో తెలీదు. చివరికి నీళ్లల్లోకి వెళ్లడం శ్రేయస్కరమని తీర్మానించుకున్నాం. ఆరుగంటల సేపు బొడు ్డలోతు నీళ్లల్లో నిల్చుని కెమెరాలతో భక్తులను చూస్తూ ఉద్వేగంగా గడిపాం. కొన్ని క్షణశకలాలను ఇలా శాశ్వతం చేశాం. 
 
 కుంభమేళా నుంచి మీరు గ్ర హించిందేమిటి?
 క్లోడ్: ఎక్‌స్టసీ. మహదానందం. సుదూర ప్రాంతాల నుంచి నడచి వచ్చిన నాగా భక్తులు, మహా వేగంతో పరుగులిడుతూ తీరాన్ని చేరడం, నదిలో నీరు తగలగానే వారు పొందిన ఆనందం మహత్తరమైనది. ఆ జలస్పర్శను ‘జల్ ఆనంద్’ను ప్రత్యక్షంగా చూడడం, ఫొటోలద్వారా చూపించడం మధురమైన అనుభవం. ఇండియా... ప్రపంచంలో అత్యుత్తమ ఫొటోజెనిక్ కంట్రీ. ఇంత వైవిధ్యం మరెక్కడా లేదు! 
 
లలిత్ వర్మ: భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కుంభమేళా! ఎవరు ఎవరిని పిలిచారు? తమంతట తాము ఇన్ని లక్షలు, కోట్లమంది  భారత-రామాయణ కాలానికి పూర్వంనుంచీ ఎవరో పిలిచినట్లుగా ఎందుకు వస్తున్నారు!  కింద నది... పైన ఆకాశం. ఇంకే తతంగం లేదు. నదికి హారతులివ్వడం, దీపాలను వదలడం అలలలో అవి ప్రయాణించడం వాటిని వీక్షించడం గొప్ప అనుభూతి. మనం అలలం. నదిలో పుట్టి నదిలో కలవాల్సిందే. అయితే ఏ అలకు ఆ అల ప్రత్యేకమైనది అని ‘జ్యోతులు వెలిగించారు’. మనలోని ఆత్మలను వెలిగించుకోవాలని సూచిస్తూ. ప్రస్తుతం విదేశాలలో ఉన్న మా సహచర ఫొటోగ్రాఫర్ జీన్ పియరె ముల్లర్ అభిప్రాయాన్ని కూడా చెప్పాలి. ‘శాస్త్రవేత్తనయిన నన్ను కుంభమేళా అన్వేషకునిగా (సీకర్) మార్చింది.’
 
 చిత్రమైన సంగతులు గమనించారా?
 క్లోడ్ - లలిత్ వర్మ:  ఇండియన్స్‌కు క్రమశిక్షణలేదనే వారికి కుంభమేళానే సరైన సమాధానం. కుంభమేళాలో అందరూ అందరికీ కొత్తే. అయినా ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయపడుతున్నారు. మిలియన్ల భక్తులు పాల్గొన్న కుంభమేళాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సంఘటన జరగలేదు.  ఇది చిత్రమై విషయం. మరో విచిత్రమైన విషయం చెబుతాం. ఫొటోలు తీసేందుకు భక్తులను దాటుకుని నదిలోకి వెళ్లాం కదా. మా వెనుక పోలీసులున్నారు. ప్రమాదాలు జరగకుండా, విధి నిర్వహణలో భాగంగా నీటిలో గస్తీ తిరిగారు. స్వేచ్ఛగా నీటిలో అటూ ఇటూ తిరిగారు, చక్కటి యూనిఫాంలో! బొడ్డు కింద ‘అర్ధనగ్నం’గా! పవిత్రస్నానాలు చేయాలనే వారి అభిలాషను బహుశా వారలా పూర్తి చేసుకున్నారు!
 
 మీరూ మునక వేశారా?
 క్లోడ్ - లలిత్ వర్మ: కుంభమేళాలో స్నానం చేస్తే, ఆ క్షణం నుంచి క్రితం జన్మల వరకూ చేసిన పాపాలన్నీ నశిస్తాయని భక్తుల నమ్మకం. మూడు నదులు ఒక్కటైన ‘త్రివేణి’ అనేక సంస్కృతులను ఒక్కటి చేస్తోంది. ఆ ‘ప్రవాహా’నికి నమస్కరిస్తూ ముగ్గురమూ మనస్ఫూర్తిగా మునకలేశాం!
 
 - పున్నా కృష్ణమూర్తి
 
మరిన్ని వార్తలు