ఇండో-చీనీ కళాత్మక బంధం!

28 Jun, 2013 02:51 IST|Sakshi
ఇండో-చీనీ కళాత్మక బంధం!
‘గంగానదీ తీరంలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో అందరు జ్ఞానులు నాకంటె ముందు వచ్చారు. తర్వాతా వస్తారు. ఇందరిలో అలావచ్చిన (తథా-ఆగత) నేనొకడిని. మీరు సత్యం అని నమ్మిన మార్గానికి నేను అడ్డువస్తే నా తల నరికి ముందుకు వెళ్లండి’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఆ మాటలను ఎలా అర్థం చేసుకున్నారో కొందరు పాలకులు బుద్ధవిగ్రహాల తలలను అక్షరాలా తొలగించారు! మన దేశంలోనే కాదు. చైనాలో కూడా. 
 
ఈ నేపథ్యంలో ఉత్తర చైనాలోని హెబీ పరగణా ‘ఏచెంగ్ ’ సమీపంలో ఇటీవలి జరిపిన పురావస్తు తవ్వకాలు కొత్త వెలుగులను ప్రసరిస్తున్నాయి.
 
కంచి కథే!
 
క్రీ.శ 3-6 శతాబ్దాల మధ్య ఆరు రాజవంశాలు పరిపాలించిన ప్రాంతానికి ఏచెంగ్ రాజధాని. ధన,ధాన్య సమృద్ధమైన ఈ ప్రాంతానికి దక్షిణ భారత దేశంలోని కంచి నగరంతో పోలిక ఉంది. కంచి వలె ఏచెంగ్ బౌద్ధ ధర్మానుయాయులకు కేంద్రంగా విలసిల్లింది. జౌ డైనాస్టీకి చెందిన యాంగ్ జియాన్ ఆరవ శతాబ్దిలో ఏచెంగ్‌ను జయించి ఆ ప్రాంతాన్ని బూడిద చేశాడు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ సాధనాలతో యాంగ్ జియాన్ కాలం నాటి చారిత్రక ఆధారాలను అన్వేషించే క్రమంలో ఉపరితలానికి ఐదు మీటర్ల లోతున రంగురంగుల బుద్ధుని శిల్పాలను గుర్తించారు. తెల్ల, నీలి పాలరాతితో ఈ విగ్రహాలను మలచారు.
 
రంగులీనుతున్నాయి!
 
ఈ మూడు వేల శిల్పాలు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. ఇరవై సెంటీమీటర్ల నుంచి లైఫ్ సైజ్ వరకూ. చైనాలో ఇది ఆరవ అతిపెద్ద పురావస్తు ఆవిష్కరణ. కాళ్లు, చేతులు విరిగి శిధిలమైనప్పటికీ వాటి రంగులు మాత్రం తాజాదనంతో తేజరిల్లుతున్నాయి. వాతావరణంలోని మార్పులను సమతూకం చేసే వరిధాన్యంతో తయారుచేసిన పేపర్ చుట్టి వీటిని భద్రపరిచారు. 
 
సమాధానాలను కోరుతోన్న ప్రశ్నలు
 
పూడ్చివేయబడిన బుద్ధుని విగ్రహాలు పలు ప్రశ్నలను సంధిస్తున్నాయి. ‘‘ఏ రాజుల కాలంలో, ఎవరు వీటిని పూడ్చారు? ఏ విశ్వాసాలు ఇందుకు పురిగొల్పాయి?’ అని తెలుసుకోవడానికి చైనీయులు ఆసక్తితో ఉన్నారని వాటికి సమాధానాలు చెప్పేందుకు కొంత వ్యవ ధి అవసరమని చైనీస్ అకాడెమీ ఆఫ్ సోషల్ సెన్సైస్ (సీఏఎస్‌ఎస్) డెరైక్టర్ వాంగ్-వీ అంటున్నారు. పగోడాలను (ఆరామాలు) నిర్మించే క్రమంలో పునాదుల్లో ధాతువులను వేసే రీతిలో ఈ విగ్రహాలను ఉంచారా? అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారని, అయితే అటువంటి వాటిని తగిన భద్రతతో అమరుస్తారని ‘వీ’ అంటున్నారు. 
 
జౌ-టాంగ్ రాజవంశాలు బౌద్ధధర్మాన్ని నిర్మూలించి ఆనందించేవని గుర్తుచేస్తూ మూడువేల బుద్ధుల పూడ్చివేత అందులో భాగం కావచ్చని పురావస్తు శాఖ ప్రొఫెసర్ యాంగ్ హాంగ్ అభిప్రాయపడుతున్నారు. ‘‘కారణాలు ఏమైనా మనం చేయాల్సింది కళాఖండాల పరిరక్షణే’’ అంటున్నారు ఆయన.
 
సాంస్కృతిక ఏకత్వం...
 
‘సాయుధుడైన ఒక్క వ్యక్తినీ పంపకుండా మీ దేశం మా దేశాన్ని సాంస్కృతికంగా రెండువేల సంవత్సరాలు పరిపాలించింది ’ అన్నారు ఒక చైనా దేశపు దౌత్యవేత్త. ఈ వ్యాఖ్య ఎంత నిజమో ఈ విగ్రహాలు నిరూపిస్తున్నాయి. మనదేశంతో, ముఖ్యంగా మన రాష్ట్రంతో చైనాకు గల కళాత్మక బాంధవ్యానికి ఇవి తిరుగులేని ఆధారాలు. క్రీ.పూ. 1-2 శతాబ్దాల అమరావతి, నాగార్జునకొండ శిల్పాలు, 5-6 శతాబ్దాలకు చెందిన అజంతా, ఎల్లోరా చిత్ర, శిల్పకళారీతులు ‘ఏచెంగ్’ శిల్పాలలో ప్రతిఫలిస్తున్నాయి! రాజకీయ అంశాలను అలా ఉంచితే తాత్విక, కళాత్మక రంగాల్లో ‘ఇండో-చీనీ భాయీ భాయీ’ కాదనగలమా? పోనీ, మైత్రేయ బుద్ధుని సాక్షిగా ఇండోచీనా ‘మైత్రేయీ’ అందాం!
 
- పున్నా కృష్ణమూర్తి
 
ఈ మూడు వేల శిల్పాలు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. కాళ్లువిరిగి, చేతులు విరిగి శిధిలమైనప్పటికీ వాటి రంగులు మాత్రం తాజాదనంతో తేజరిల్లుతున్నాయి!
 
మరిన్ని వార్తలు