చిహ్నాల వనం

24 Jun, 2015 02:53 IST|Sakshi
చిహ్నాల వనం

ఏదైనా సంస్థ ప్రజలకు చిరకాలం గుర్తుండాలంటే అందమైన ‘లోగో’ అవసరం. ఆ లోగోలోనే ఆ సంస్థ విధివిధానాలు కనిపిస్తాయి. ఇలాంటి లోగోలను తీర్చిదిద్దుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రామంతాపూర్ శారదానగర్‌కు చెందిన వనం జ్ఞానేశ్వర్. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలకు చిహ్నాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు.  - రామంతాపూర్  

- లోగోల  రూపశిల్పి జ్ఞానేశ్వర్
- జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు       

చిత్రకళపై జ్ఞానేశ్వర్‌కు చిన్నతనం నుంచి ఉన్న మక్కువే అతడిని కళాకారుడిగా తీర్చిదిద్దింది. బాల్యం నుంచే వివిధ లోగోలను రూపొందించి మురిసిపోయేవాడు. సైన్ బోర్డు ఆర్టిస్ట్ జీవితం ప్రారంభించిన జ్ఞానేశ్వర్ ఓ ప్రముఖ ప్రకటనల కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తన ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అత్యాధునిక పద్ధతుల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లోగోలను తయారు చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోగోలో స్పష్టత లేదని చెప్పడంతో సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్‌తో కలిసి అందులో మార్పులు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ లోగోను రూపొందించారు.

- నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ లోగోలను తయారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశంసలు అందుకున్నారు.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలకు ప్రచార సామగ్రి జ్ఞాపికలను, లోగోలను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు.
- అమెరికాలోని అట్లాంటాలో విజు చిలువేరు ఆధ్వర్యంలో నడుస్తున్న ‘గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ లోగోను తయారు చేశారు.
 
ఇంకా..
- ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మాధవ్ కటికనేని ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరానికి పోస్టర్లు, జ్ఞాపికలు..
- మెల్‌బోర్న్‌లో నూకల వెంకటరెడ్డి నిర్వహిస్తున్న మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరం లోగోలు, ప్రచార సామగ్రి..
- బ్రిస్‌బేన్ తెలంగాణ ఫోరం కోసం లోగోలు ప్రచార సామాగ్రిని రూపొందించారు.
- నూతనంగా ఏర్పడిన తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లోగోను రూపకర్త కూడా జ్ఞానేశ్వరే.

 
ఆశయం
తెలంగాణ రాష్ట్రంలో లోగోలను రూపొందించే విధంగా పలువురు యువతీయువకులకు శిక్షణ ఇచ్చి వారిని మంచి ఆర్టిస్ట్‌లుగా తీర్చిదిద్దడమే తన ఆశయమని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి అభినందనలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) లోగోలో బంగారు వర్ణంతో కాకతీయ ద్వారం, లోగో మధ్యలో తెలంగాణ పల్లెలను కళ్లకు కట్టే విధంగా ఉన్న పచ్చిక, నగర సౌందర్యాన్ని తెలిపే చార్మినార్‌ను కలిపి లోగోను తయారుచేశారు. ఈ లోగోను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానేశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

>
మరిన్ని వార్తలు