వెగానిజం..

1 Nov, 2014 01:07 IST|Sakshi
వెగానిజం..

సిటీలో వెగానిజం ఈ మధ్య బాగా పుంజుకుంటోంది. పాలు, మాంసం, గుడ్లు, తేనెలకు బదులు వృక్షాధారిత ఉత్పత్తులను వాడటం అనే వెగానిజంను విశ్వసించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఇంటర్నేషనల్ వెగాన్స్ డే సందర్భంగా వెగాన్స్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నారు.
 
 బానిసత్వం, రేసిజం, లింగవివక్ష స్థాయిలో జరపవలసిన ఉద్యమం వెగానిజం అనే భావన వెగనిస్టులది. జంతువులను కష్టపెట్టకుండా, మొక్కల నుంచి వచ్చే వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటే మొక్కలకు బాధ కలగదా అంటే.. నరాల వ్యవస్థ లేని మొక్కలు బాధను గ్రహించే అవకాశం లేదంటారు. అలాగే ఒక ఆకుని తెంపితే మరో ఆకు పుట్టుకొస్తుంది. కానీ జంతువును చంపటం ద్వారా అవి మరలా వచ్చే అవకాశం ఉండదని వీరు గుర్తు చేస్తారు.
 
 పాలూ మాంసాహారమే...
 ప్రతి ప్రాంతంలో పాలు, పెరుగు సహా జంతు సంబంధిత ఆహారం ఆహారంలో భాగమైపోయింది. అలాంటప్పుడు వెగాన్‌గా మారటం అంత సులువైన విషయం కాదు. స్వీట్లు, చాక్లెట్స్, కేక్స్, ఐస్‌క్రీం, పెరుగు, పనీర్, చీజ్, పిజ్జా, టీ, కాఫీ ఇలా రోజులో తినే చాలా పదార్థాలను త్యజించాల్సి ఉంటుంది. అయితే అలవాటయిన ఈ రుచులను పూర్తిగా తినటం మానెయ్యాల్సిన పనిలేదని సిటీకి చెందిన వెగాన్స్ అంటున్నారు. మొక్కల నుంచి లభించే వాటి ద్వారా ఆయా పదార్థాలను తయారుచేసుకుంటే సరిపోతుందంటున్నారు.
 
 ఇది సరికాదు..
 భూమి మీద ప్రతి జీవి వాటికి సంబంధించిన ప్రత్యేక కారణంతో మనుగడ సాగిస్తోంది. అవి మనుషుల కోసం భూమి మీదకు రాలేదు. ఇంట్లో ఒక జంతువును పెట్‌గా ప్రేమిస్తూ, ఆహారంగా మరో జంతువును బలిచేయడం సరైనదేనా? అని ప్రశ్నిస్తున్న వెగాన్స్... పాలు, పాల సంబంధిత ఆహారాన్ని మానేస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం అందదు అనడం అపోహేనని, మొక్కల నుంచి మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని సోదాహరణంగా వివరిస్తున్నారు. పాలు, పాలసంబంధిత పదార్థాలు లేకుండా నోరూరించే చాక్‌లెట్ కప్స్, కుకీస్, ఐస్‌క్రీం, పనీర్ లాంటివి  సైతం తయారు చేసుకోవచ్చునంటున్నారు.
 
 వంటలున్నాయి....
 -    పాలతో కాకుండా పల్లీలతో చేసిన పెరుగు, పెరుగన్నం..
 -    సోయాబీన్స్‌తో తయారైన పనీర్ మ్యాంగో ఐస్‌క్రీం
 -    కాజూ కట్లి - జీడిపప్పు, చక్కెరతో చేసినది
 - వీగన్ చాక్లెట్ బాల్స్ - కర్జూరం, కొకోవా పొడి, నట్స్ కలిపి తయారు చేసింది.
 -    బాదం పాలు, చాక్‌లెట్ చిప్స్, మొక్కజొన్న ఫ్లాక్స్ తో చేసే  చాక్‌లెట్ కప్.
 
 పాలు తాగడం అంటే పాపం చేయడమే..
 మనిషి తప్ప భూమి మీద ఏ జీవి కూడా మరో జీవి పాలు తాగదు. ఆవులు, గేదెలు తమ సంతానానికి ఇవ్వవలిసిన పాలను మనుష్యులు తాగేస్తున్నారు. అంతేకాకుండా పాల ఉత్పత్తి పెరగడానికి ఆ జంతువులను నానారకాల యాతనలకు గురిచేస్తున్నారు. జీవితాంతం ఆడ గేదెలు సంతానోత్పత్తి జరిపేందుకు రకరకాల ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇక నేరుగా చంపి, వంటకు సిద్ధం చేసే జంతువుల గురించి చెప్పేదేముంది. ఇలా జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టకుండా ఆహారాన్ని సమకూర్చుకోవటం వీలవుతుందని, ఈ ఆలోచనను విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు వెగాన్స్. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెగాన్స్ కమ్యూనిటీ క్లబ్బులు కూడా ఏర్పాటు చేసి మొక్కలకు సంబంధించిన ఆహారం గురించి అవగాహన పెంపొందిస్తున్నారు.
 -  ఓ మధు
 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా