స్మైల్ ఈజ్ స్టైల్

28 Dec, 2014 02:26 IST|Sakshi
స్మైల్ ఈజ్ స్టైల్

స్మైల్‌ని మించిన స్టైల్ లేదు.. ఈ స్టేట్‌మెంట్ ఓ డిజైనర్‌ది. రోజుకో ఫ్యాషన్ సృష్టికర్త.. నవ్వుని మించిన స్టైల్ స్టేట్‌మెంట్ లేదనడం విశేషమే. అయితే అంతకు మించిన విశేషాలు చాలానే ఉన్నాయి నిఖిల్ తంపి దగ్గర. ఫ్యాషన్ డిజైనర్‌గా మూడేళ్లలో స్టార్‌డమ్ అంటే దాదాపు అసాధ్యమే. అయితే దీన్ని సుసాధ్యం చేశాడు నిఖిల్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టుగా.. షార్ట్‌టైమ్‌లోనే టాప్ ప్లేస్‌కి చేరుకున్నాడు. నేటి బాలీవుడ్ తారలైన సోనమ్ కపూర్, విద్యాబాలన్‌ల నుంచి ఎవర్‌గ్రీన్ మాధురీదీక్షిత్ దాకా.. వస్త్ర శైలులను తీర్చిదిద్దాడు. వయసులోనే కాదు అనుభవంలోనూ కుర్రాడే అయిన ఈ ముంబై పోరడు.. నగరంలో తొలిసారి తన డిజైన్లను ప్రదర్శించిన సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే...
 
- ఎస్బీ

 
హాయ్ హైదరాబాద్.. ఈ సిటీకి ఇదే తొలిసారి రావడం. నాకు నెట్ ద్వారా ఇక్కడ చాలా మంది కనెక్ట్ అయ్యారు. నా డిజైన్‌లను అభిమానిస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ వారికి నా డిజైన్స్‌ను పరిచయం చేస్తున్నా. ఇకపై రెగ్యులర్‌గా ఈ సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌కి నా డిజైన్స్ అందుబాటులోకి తెస్తా.
 
ఓనమాలు తెలీకున్నా..

నేనేమీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయలేదు. అయితే ఒక స్నేహితురాలి కోరిక మేరకు ఆమె లేబుల్ లాంచింగ్ కోసం బాగా హెల్ప్ చేశాను. ఆ సమయంలో డిజైనింగ్‌పై ఏర్పడిన అవగాహన, కొంతమంది సన్నిహితుల సూచనలు నన్ను ఇన్‌స్పైర్ చేసి ఈ రంగంలోకి వచ్చేలా చేశాయి. ఎంట్రీలెవల్‌లోనే లాక్మె ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం అక్కడ నుంచి ఒకటొకటిగా వచ్చిన అవకాశాలు నన్ను చాలా స్వల్పకాలంలోనే డిమాండ్ ఉన్న డిజైనర్‌గా మార్చాయి. ఇది ఓవర్‌నైట్ స్టార్‌డమ్ అనే విషయం నేను అంగీకరిస్తాను. అయితే దీన్ని లాంగ్‌టైమ్ నిలుపుకునేందుకు ప్రయత్నిస్తాను.
 
నానమ్మ స్ఫూర్తి..

మా నాన్నది కేరళ. ట్రెడిషనల్ ఫ్యామిలీ. పొడవాటి జడ, నిండైన విగ్రహం, అందుకు తగ్గట్టుగా కాంచీవరం చీర .. అందంగా మాత్రమే కాదు హుందాగా కూడా మెరిసిపోయేది మా నానమ్మ. ఆమె రూపాన్ని చూస్తూ పలువురు గొప్పగా మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ వస్త్రధారణ నన్ను చిన్నప్పటి నుంచి ఆకట్టుకునేది. ఓ రకంగా నేను డిజైనర్ కావడానికి ఆమే స్ఫూర్తి. కేరళ వస్త్రధారణ థీమ్‌తోనే నేను కథాకళి కలెక్షన్ రూపొందించాను.
 
ఏంజెలినా.. చాన్స్ ఇచ్చేనా..


నాకు యుక్తవయసు నుంచి అభిమాన నటి మాధురీ దీక్షిత్. ఆమె కోసం కేప్‌టాప్‌ని డిజైనింగ్ చేయడం మరిచిపోలేని అనుభవం. వయసు పెరిగినా వన్నె తరగని అందం ఆమెది. అలాగే అనుష్కాశర్మ, సోనమ్ కపూర్, విద్యాబాలన్.. వీరందరికి నా డిజైన్స్ ఇవ్వడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. దీపికా పదుకునే, ఏంజలినా జోలిలకూ డిజైన్ చేయాలని నా కోరిక.
 
నవ్వుతూ కనిపించరా..

ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక స్టైల్ స్టేట్‌మెంట్ ఏర్పరచుకుంటున్నారు. అయితే నా దృష్టిలో నవ్వుని మించిన స్టైల్ స్టేట్‌మెంట్ లేదు. ఒక వ్యక్తిని తలచుకోగానే తన స్మైలింగ్ ఫేస్ గుర్తుకు వస్తే చాలు. ప్రతి ఒక్కరిలో ఆ లుక్ గుర్తుండిపోతుంది. అందుకే కీప్ స్మైలింగ్.
 

మరిన్ని వార్తలు