కశ్మీర్ కిటికీ పూర్తిగా తెరుచుకుంటుందా?

28 Dec, 2014 00:41 IST|Sakshi
కె.రామచంద్ర మూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి

 త్రికాలమ్
 మరికొన్ని రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతున్న సంవత్సరం భారతదేశ చరిత్రను అనూహ్యమైన మలుపు తిప్పింది. అరవై ఏడేళ్ళ కిందట స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరు మాసాల క్రితం సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ (భాజపా)కి అత్యధిక సంఖ్యా బలం సమకూర్చిన సందర్భం దేశ రాజకీయాలలో నిర్ణ యాత్మకమైనది. ఈ సువర్ణావకా శాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య సంస్థలను సమాదరించి, పరి పుష్ఠం చేసుకొని, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వెల్లివిరిసే భారతావనిని నిర్మించుకుంటామా లేక వ్యక్తి ఆరాధన ముమ్మరమై, నియంతృత్వ ధోరణులు పెచ్చరిల్లి తిరిగి ఎన్నికలు వచ్చే సమయానికి మొన్న తిరస్కరించిన పార్టీకే పట్టం కడతామా అన్నది కొద్ది రోజుల్లో రానున్న సంవత్సరంలో మోదీ నేతృత్వం లోని ఎన్‌డీఏ సర్కార్ పనితీరుపైనా, రాష్ట్రప్రభుత్వాలు ఆయనతో సహకరించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే రీతిపైనా ఆధారపడి ఉంటుంది.

 నరేంద్రమోదీ ప్రభంజనసదృశంగా ఎన్నికల ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీకి లోక్‌సభలో మొదటిసారి సగానికంటే ఎక్కువ స్థానాలు సంపాదించి పెట్టి చరిత్ర సృష్టించారు. అటువంటి ఘనవిజయంతో దాదాపుగా సమానమైనదీ, ఒక విధంగా అంతకంటే కీలకమైనదీ, చరిత్రాత్మకమైనదీ ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లో భాజపా సాధించిన అపూర్వమైన ఆధిక్యం. జమ్మూ-కశ్మీర్ ప్రజలు ప్రసాదించిన ఈ అవకాశాన్ని సృజనాత్మకంగా, వివేకవంతంగా, దార్శనికతతో, సహనంతో, వ్యూహా త్మకంగా వినియోగించుకుంటే భారత ఉపఖండంలో శాంతి స్థాపించి చరిత్రలో చిర స్థాయిగా నిలిచే అదృష్టం సైతం మోదీభాయ్‌ని వరించవచ్చు. కశ్మీర్ కిటికీ తెరు చుకుంది. దాని ద్వారా శాంతి సమీరాలను స్వేచ్ఛగా అనుమతించి కశ్మీర్ ప్రజల జీవి తాలలో వెలుగు నింపడమా లేక పాత పద్ధతులే కొనసాగించి అణచివేత విధానాలనే అశ్రయించి కిటికీని మరోసారి మూసివేయడమా! తేల్చుకోవలసిన సంధి సమయం.

 జమ్మూ-కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో రెండు పరిణామాలు ముఖ్యమైనవి. ఒకటి, ఆ రాష్ట్రం ప్రజలు మతం ప్రాతిపదికగా ఓటు చేశారనే అభిప్రాయానికి తావి చ్చారు. భాజపా గెలుచుకున్న స్థానాలన్నీ(25) హిందువులు ఎక్కువగా నివసించే జమ్మూలోవే. ముస్లింలు నివసించే కశ్మీర్ లోయలో కానీ, బౌద్ధుల స్థావరమైన లద్దాఖ్‌లో కానీ ఒక్క సీటు కూడా భాజపా గెలుచుకోలేదు. కశ్మీర్‌లో అయితే మొత్తం 34 స్థానాలకు పోటీ చేస్తే 33 స్థానాలలో ధరావతు గల్లంతైంది. ఓట్ల శాతం రెండు కంటే తక్కువ. అత్యధిక స్థానాలు (28) గెలుచుకున్న పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) సైతం ఎక్కువ స్థానాలను లోయలోనే సంపాదించింది. జమ్మూ డివిజన్‌లో ఈ పార్టీకి లభించిన దర్హాల్, రజౌరీ, పూంచ్ స్థానాలలో అత్యధిక ఓటర్లు ముస్లింలే. అందుకే అన్ని ప్రాంతాలలో గెలిచింది నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఒక్కటే అంటూ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పుకో గలుగుతున్నారు. జమ్మూ-కశ్మీర్ ప్రజలు మతం ప్రాతిపదికగా ఓటు చేశారనే వాదన బలమైనది. ఇది ఉత్తరోత్తరా కశ్మీర్‌లో వేర్పాటు ఉద్యమం బలపడితే జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం విభజనకు కూడా ఆస్కారం ఉంది. రెండు, కాంగ్రెస్‌పార్టీ తక్కువ విజయా లతో నాలుగో స్థానానికే పరిమితమైనప్పటికీ, భాజపా విజృంభించి తన ఓటింగ్ శాతాన్ని 12.6 శాతం నుంచి 28.7 శాతానికి పెంచుకున్న కారణంగా జమ్మూ-కశ్మీర్ ఓటర్లలో సగంమంది జాతీయపార్టీలవైపు మొగ్గుచూపారు. ఇది శుభసూచిక.

 కాంతి శకం ఆరంభమౌతుందా?
 ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయంగా, స్వేచ్ఛగా జరిగాయని అన్ని పార్టీలూ నిర్ధారించాయి. ఆరేళ్ళ కిందట 2008లోనూ ఎన్నికలు స్వేచ్ఛగానే జరి గాయి. కశ్మీర్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగడం ప్రారంభమైంది 2002 లో, ప్రధాని వాజపేయి హయాంలో. 2014లో మునుపెన్నడూ లేనంత ఓటింగ్ శాతం, ప్రచారం కూడా కోలాహలంగా జరిగింది. విజయోత్సవాలూ అంతే సందడిగా జరుపుకున్నారు. ఇక కశ్మీర్ సమస్య పరిష్కారమైనట్టేనా? కొత్త ప్రభుత్వం ఏర్పడి జనరంజకంగా పరిపాలిస్తే కశ్మీర్‌లో కటికచీకటి అంతమై కాంతిశకం ఆరంభం అవుతుందని ఆశించవచ్చునా?

 పోయిన వారం పెషావర్‌లో ఘోరకలికి ప్రపంచం నిర్ఘాంతపోయింది. 130 మందికి పైగా బాలబాలికలను పాకిస్తాన్ తాలిబాన్ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘాతుకానికి మనం తల్లడిల్లిపోయాం. ప్రధాని మోదీ తీవ్ర మనస్తాపం వెలిబుచ్చు తూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సందేశం పంపించారు. పార్లమెంటు సైతం సంతాప తీర్మానం చేసింది. నేలకూలిన కుసుమాలు పాకిస్తాన్‌లో పూసినవైనా మనం కన్నీరు మున్నీరైపోయాం. కానీ నాలుగు సంవత్సరాల కిందట కశ్మీర్‌లో వందమం దికి పైగా ముక్కుపచ్చలారని యువకులు పారామిలిటరీ దళాల, సాయుధ పోలీ సుల తూటాలకు బలైతే మనం అయ్యోపాపం అన్న పాపాన పోలేదు. పెషావర్‌లో హంతకులు మతోన్మాదులు, మతిచలించిన మతవాదులు. కశ్మీర్‌లో పిల్లల్ని పిట్టల్లా కాల్చివేసినవారు పారామిలటరీ సిబ్బంది. 2010లో పారామిలటరీ దళాలు పేల్చిన బాష్పవాయుగోళం తునక ఒకటి తగిలి తుఫాయిల్ మట్టూ అనే బాలుడి తల పగిలి మరణించాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన యువకులు చేతులలో రాళ్ళు పట్టుకొని వీధులలోకి వచ్చారు. మరతుపాకులు ధరించిన పారామిలటరీ దళాలను ధిక్కరించి నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేశారు. వారిని అణచివేసేందుకు చంపడమే ధ్యేయంగా సాయుధ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ నిరసన ప్రదర్శనలలో 120 మందికిపైగా మరణించారు. వీరిలో అత్యధికులు విద్యార్థులు. మొన్నటి పెషావర్ నరమేధం జరిగినరోజునే అక్కడికి నవాజ్ షరీఫ్ చేరుకున్నారు. చనిపోయిన పిల్లలు నా పిల్లలే అంటూ కంటతడిపెట్టారు. కశ్మీర్‌లో పిల్లల హత్యాకాండ జరిగిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీనగర్ వెళ్ళలేదు సరికదా వందమంది పిల్లలు దారు ణంగా చనిపోయినందుకు సంతాపం ప్రకటించ లేదు. అప్పటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా బాధితులకు ఓదార్పు కలిగించే విధంగా మాట్లాడలేదు. పార్ల మెంటులో ప్రతిపక్షాలు సైతం ఈ అమానుషకాండను తగువిధంగా చర్చనీయాంశం చేయలేదు. పారామిలటరీ తూటాలకు నేలకొరిగిన పన్నెండు, పదమూడేళ్ళ బాలుర అంత్యక్రియల సందర్భంగా శవయాత్రలు చేస్తూ గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు విలపించిన దృశ్యాలను మన టీవీ చానళ్ళు చూపించనే లేదు. దేశం లోని ముస్లిం మతసంస్థలూ, రాజకీయపార్టీలూ ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. వాస్తవానికి సుప్రీంకోర్టు కశ్మీర్‌లో యువకుల కాల్చివేతను సుమోటోగా పరిగణించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి విచారణ జరపవచ్చు. ఆ పనీ జరగలేదు. భారత సమాజం యావత్తూ పట్టించుకోలేదు. నిర్లిప్తం గానే మిగిలిపోయింది.

 ధర్మాగ్రహాన్ని కాదనలేం
 కశ్మీర్‌లో యువకుల హత్యాకాండ జరిగిన తర్వాత కొంతకాలానికి నేను లోయకు వెళ్ళాను. రెండు వారాలు పర్యటించి సామాన్య ప్రజలనూ, విశ్వవిద్యాయం ఆచా ర్యులనూ, పౌరహక్కుల కార్యకర్తలనూ, హురియత్ నాయకులనూ కలుసుకొని ఇంటర్వ్యూలు చేశాను. కశ్మీర్‌లోయ విషాదంతో, ఆగ్రహంతో, అశాంతితో దహిం చుకొని పోతున్న రోజులవి. గృహనిర్బంధంలో ఉన్న హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీతో మాట్లాడాను. ఆయన తక్షణం కశ్మీర్‌ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని వాదించే వ్యక్తి. ‘నేను ఇంతకాలం చెబుతున్నది నిజమే కదా’ అన్న భావన ఆయన ముఖంలో కనిపించింది. భారత్ హంతకదేశం అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ సందర్భంలో గిలానీ బంద్ పిలుపు ఇస్తే కశ్మీర్‌లోయలో గాలికూడా స్తంభించేది. మొన్న మోదీని కలిసి భాజపాతో పొత్తు పెట్టుకున్న సజ్జాద్ లోన్ ఇంట్లో ఒక పూట గడిపాను. ప్రొఫెసర్ అబ్దుల్ గనీ లోన్ కుమారుడు. గనీలోన్ ఒక బహిరంగసభలో మాట్లాడుతూ ఉండగా పాకిస్తాన్ నుంచి వచ్చిన మిలిటెంట్లు కాల్చిచంపారు. కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు అమానుల్లాఖాన్ కుమార్తె ఆస్మాను సజ్జాద్ పెళ్ళి చేసు కున్నాడు. ఆమె పాకిస్తాన్ పౌరురాలు. మొన్న భర్త తరఫున ఎన్నికల ప్రచారం చేసింది. విద్యాధికుడైన సజ్జాద్‌కు కశ్మీర్‌ను ఎట్లాగైనా రావణకాష్టం కాకుండా కాపా డాలనే తాపత్రయం ఉంది. జమ్మూ-కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేపీసీ) అధినాయకు డాయన. ‘ప్రధాని, ముఖ్యమంత్రి శ్రీనగర్‌లో సభ పెట్టి కశ్మీర్ సమాజానికి క్షమాపణ చెప్పినట్లయితే భారతదేశంతో స్నేహంగా (భాగంగా అని అప్పుడు అనలేదు. ఇప్పుడు అంటారేమో) ఉండటానికి ఆలోచించే అవకాశం ఉండేది’ అన్నారు సజ్జాద్.

 ఎన్నికలు ఎన్నయినా జరగవచ్చు. నూటి కి నూరు శాతం పోలింగ్ జరగవచ్చు. అంతమాత్రాన కశ్మీర్ ప్రజలు భారత్‌లో కొనసాగడానికి సంతోషంగా ఒప్పుకున్నట్టు అర్థం కాదు. 2008 నాటి ఎన్నికలకు రెండు మాసాల ముందే 70 మంది కశ్మీరీలు పోలీసు కాల్పుల్లో మరణించారు. అప్పుడు పీడీపీ నాయకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి. అంతమంది పౌరులు మరణించడం పట్ల ఆయన ఖేదం వెలిబుచ్చలేదు. అప్పటి ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంది. ప్రజా స్వామ్యం వేళ్ళూనుకుంటోందనీ, కశ్మీరీ ప్రజలు ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారనీ మనవాళ్ళు ఆనందం వెలిబుచ్చారు. రెండేళ్ళు తిరగకుండానే అశాంతి ప్రబలింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినా, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా వారు భారతదేశ సార్వభౌమత్వాన్ని ఆమోదిస్తున్నట్టు అర్థం చేసుకుంటే పొరబాటు. మరి ఎన్నికలను ఎందుకు బహిష్కరించడంలేదు? ఈ ప్రశ్నకు ప్రముఖ నవలా రచయిత మీర్జా వహీద్ చెప్పే సమాధానం ఇది: ‘ఎన్నికలలో పాల్గొని ఎవరినో ఒకరిని గెలిపిస్తే వారు తమ ఇళ్ళకు విద్యుచ్ఛక్తి సరఫరా ఏర్పాటు చేసి చలికాలంలో శరీరాలు గడ్డకట్టకుండా కాపాడతారేమోనని, జైల్లో సంవత్సరాల తరబడి నిష్కార ణంగా మగ్గుతున్న సమీప బంధువులను విడిపించడంలో సహకరిస్తారేమోననీ, పట్టభద్రులైనా పనిలేకుండా తిరుగుతున్న యువతీ యువకులకు ఉద్యోగాలు వస్తాయేమోననే ఆశతో ఓటు చేస్తున్నారు’. ఎన్నికలే వివాదాన్ని పరిష్కరించగలిగితే 1957 నుంచి జరిగిన ఎన్నికల ఫలితంగా ఈ వివాదం పది సార్లు పరిష్కృతం అయ్యేది అంటాడు మీర్జా వహీద్.

  ఈ నేపథ్యంలో కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఎన్నికల ఫలితంగా నెలకొన్న పరిస్థితులను ఎట్లా వినియోగించుకోవాలి? శ్రీనగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇది మరికొంతకాలం కొనసాగవచ్చు. అసలే కశ్మీర్. అందులోనూ చలికాలం. కదలిక కష్టం. పార్టీల బలాబలాల ప్రాతిపదికగా లెక్కలు వేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పీడీపీకీ, భాజపాకీ అవకాశం ఉంది. రెండు పార్టీలలో దేనికైనా మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పి ఒమర్ అబ్దుల్లా లండన్ వెళ్ళిపోయారు. షరతులు లేకుండా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పీడీపీకి కాంగ్రెస్ పార్టీ గులాంనబీ ఆజాద్ ద్వారా వర్తమానం పంపింది. ఈ రెండు పార్టీలూ 2008లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. పీడీపీ కాంగ్రెస్ ఊసు ఎత్తడానికి కూడా సిద్ధంగా లేదు. భాజపా ప్రధాన కార్యదర్శి, కశ్మీర్ ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన రాంమాధవ్‌తో పీడీపీ నాయకులు చర్చలు కొనసాగిస్తున్నారు.

 కేంద్రంతో సయోధ్య అనివార్యం
 కశ్మీర్‌లో ప్రధానంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలూ కేంద్రంలో అధికారం చలా యిస్తున్న పార్టీతోనే సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటాయి. కేంద్ర నిధులపైన ఆధారపడిన రాష్ట్రం కావడం ఇందుకు కారణం. భాజపా అభీష్టానికి భిన్నంగా వెడితే కష్టాలు తప్పవనే అవగాహన ఒమర్‌కూ, ఆయన తండ్రి ఫారుఖ్‌కూ, ముఫ్తీ మెహబూబాకూ, ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌కు దండిగా ఉంది. పీడీపీ ఒక వేళ స్వతంత్రంగా వ్యవహరించి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ల మద్దతు తీసు కుంటే అసెంబ్లీలో సంఖ్యాబలం ఉంటుంది కానీ ఢిల్లీ నుంచి నిధులు అందడం అనుమానం. భాజపా నాయకత్వానికి ఉన్న స్వేచ్ఛ పీడీపీకి లేదు.

 పీడీపీ, భాజపాలు ముఫ్తీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయ వచ్చు. ఇందులో సజ్జాద్ లోన్‌నూ చేర్చుకోవచ్చు. భాజపా శాసనసభా పక్షం నాయ కుడుగా ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో సహాయమంత్రి జితేందర్ సింగ్ అయినా, నిర్మల్ సింగ్ అయినా ఎన్నికై ఉపముఖ్యమంత్రి పదవి స్వీకరించవచ్చు. దీనివల్ల ఢిల్లీకీ, శ్రీనగర్‌కూ అనుబంధం ఉంటుంది. ఇంతకంటే ఉత్తమం, కశ్మీర్‌లో సుస్థిర శాంతి స్థాపనకు అవకాశం కల్పించే ప్రత్యామ్నాయం భాజపా నాయకత్వం లో పీడీపీతో కలసిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ప్రధాని మోదీ నాయ కత్వంలో నేరుగా పని చేయడానికి అనువుగా భాజపా ముఖ్యమంత్రి శ్రీనగర్‌లో ఉంటే కశ్మీర్ సమస్యను అన్ని కోణాల నుంచీ అధ్యయనం చేయడానికీ, పరిష్కారం కోసం వ్యూహాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు. పండిట్ నెహ్రూ షేక్ అబ్దుల్లా స్నేహంపైన ఆధారపడే వారు. ఇందిరాగాంధీ షేక్‌ను జైలు నుంచి విడుదల చేయించినా ఆ కుటుంబంతో సఖ్యత కుదుర్చుకోలేకపోయారు. రాజీవ్‌గాంధీకీ అంతటి వ్యవధి లేకపోయింది. పైగా ఫారుఖ్‌ను దించి ఆయన బావ షాను గద్దెనె క్కించి భంగపడ్డారు. పీవీ కశ్మీర్ వివా దాన్ని క్షణ్ణంగా అర్థం చేసుకున్నప్పటికీ ఎన్నికలను సవ్యంగా జరిపించి ప్రజాస్వా మిక వాతావరణాన్ని పునరుద్ధరించలేకపోయారు. వాజపేయి చొరవ ప్రదర్శించి లాహోర్ వెళ్ళడం, షరీఫ్‌తో, ముషార్రఫ్‌తో చర్చలు జరపడమేకాక వేర్పాటు వాదు లతో సమాలోచనలను అనుమతించారు. మళ్ళీ ఆ అవకాశం మోదీకి దక్కింది.

 కశ్మీరీల హృదయాలను గెలవడమే మార్గం
 కశ్మీర్‌లో సుస్థిర శాంతి అంటే ఏమిటి? అది ఎట్లా సాధ్యం? కశ్మీర్ లోయ ప్రజలు కోరుకుంటున్నట్టు వారికి స్వాతంత్య్రం ప్రసాదించడం ఉత్తమమైన మార్గం అని ప్రపంచంలోని ప్రజాస్వామ్యవాదులంతా భావిస్తున్నారు. అప్పుడు కశ్మీర్ లోయకు మాత్రమే స్వాతంత్య్రం ఇచ్చి జమ్మూ, లద్దాఖ్ డివిజన్లను భారత్‌లో సంపూ ర్ణంగా, బేషరతుగా విలీనం చేసుకోవాలి. ఈ పరిష్కారానికి భారత ప్రభుత్వం కానీ, రాజకీయవ్యవస్థ కానీ, సమాజం కానీ అంగీకరించే వాతావరణం లేదు. జమ్మూ- కశ్మీర్ ప్రజలు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి కశ్మీర్ ప్రజల హృదయాలను గెలుచుకొని వారి ఆమోదంతో వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ఒక్కటే మార్గం. కశ్మీర్ విషయంలో ఇంతకాలం అన్ని పార్టీల కంటే భిన్నంగా వాదిస్తున్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఒక్కటే సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమలు చేయగలదు. 370వ రాజ్యాంగ అధికరణ గురించి కానీ, ఉమ్మడి పౌరసత్వం గురించి కానీ, ప్రత్యేక ప్రతిపత్తి గురించి కానీ అభ్యంతరాలు చెబుతూ, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీనీ, ఇతర పార్టీలనూ కుహనా లౌకికవాదులుగా ముద్రవేసి నిందలు వేస్తూ వచ్చిన భాజపా కశ్మీరీల మనసు గెలుచుకోవడానికి ఏమి చేసినా కుహనా లౌకికపార్టీలు అభ్యంతరం చెప్పవు. కశ్మీరీ సమాజంతో సమాలోచనలు జరిపి వారికి ఏ విధమైన సంబంధం భారతదేశంతో కావాలో తెలుసుకొని గూడుకట్టుకున్న భారత వ్యతిరేక భావాన్ని దూరం చేయగలిగితే అది చరిత్రాత్మకం అవుతుంది. పక్కన పాకిస్తాన్ కనీవినీ ఎరుగని సక్షోభంలో ఉన్నది కనుక కశ్మీరీలు కూడా తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌తో భావోద్వేగంగా కూడా విలీనం కావ డానికి సిద్ధపడవచ్చు. ముఖ్యంగా కశ్మీర్‌లో కొత్తతరం ఉచితాలను ఆశించడంలేదు. ఆత్మగౌరవంతో జీవించాలనీ, ఇతర రాష్ట్రాలలోని పౌరులకు ఉన్నట్టే తమకు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ అమలు జరగాలనీ కోరుకుంటున్నారు. భాజపా నాయకత్వాన శ్రీనగర్‌లో ప్రభుత్వం ఏర్పడితే అందులో పీడీపీ భాగస్వామి అయితే కశ్మీర్, జమ్మూ మధ్య అంతరం తగ్గుతుంది.  జార్ఖండ్‌లో గిరిజనేతరుడైన రఘువర్ దాస్‌ను ముఖ్యమంత్రిగా నియమించినట్టు జమ్మూ-కశ్మీర్‌లో ముస్లిమేతరుడిని ముఖ్యమంత్రిగా నియమించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉండవచ్చు. కానీ సామరస్యవాద ముస్లిం నాయకుడిని గుర్తించి పగ్గాలు అప్పగించి ఆయన వెనుక భాజపా నాయకత్వం ఉంటే కశ్మీరీల హృదయాలను జయించడం తేలిక. ఇందుకు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సంపూర్ణ సహకారం అవసరం. ఇది ఊహాజనితంగానో, ఆశావాదంగానో, ఆదర్శవాదంగానో కనిపించవచ్చును కానీ కశ్మీర్‌లో శాంతి నెలకొ నాలంటే ఇది ఒక్కటే మార్గం. భాజపా హయాంలో, ముఖ్యంగా మోదీ నాయకత్వం లోనే ఇది సాధ్యం. అన్ని అవకాశాలనూ వినియోగించుకొని ఇంత దూరం వచ్చిన మోదీ అసెంబ్లీ ఎన్నికలు ప్రసాదించిన రాజకీయ సమీకరణాలను తనకు అనుకూ లంగా ఏ విధంగా మలచుకుంటారన్నది అత్యంత ఉత్కంఠ కలిగించే అంశం. కొత్త సంవత్సరంలో వినూత్న రాజకీయాల కోసం ఆశావహంగా ఎదురుచూడవచ్చా?
murthykondubhatla@gmail.com

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శరీరం లేకపోతేనేం...

వేడి వృథా కాకుండా.. కరెంటు..!

రహస్య మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా..

బస్‌లో మహిళ డ్యాన్స్‌ : సిబ్బందిపై వేటు

ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌