తెగబడిన ఉన్మాదం

18 Dec, 2014 23:33 IST|Sakshi
తెగబడిన ఉన్మాదం

మాట పెగలని బరువైన క్షణాలివి. నా హృదయం ఓ తల్లిగా, ఓ స్త్రీగా కాదు సాటి మనిషిగా రోదిస్తోంది. మానవత్వం హత్యకు గురైంది. హంతకుడూ మనిషే !! టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ నా ఆలోచనలకు కళ్లెం వేసింది. రక్తమోడుతున్న చిన్నారులను మూటల్లా మోసుకెళ్తుంటే నా మెదడు మొద్దుబారిపోయింది. ఏ మనిషీ, ఏ జాతి, ఏ మతమూ సహించలేని ఘాతుకం మన పొరుగు దేశంలో జరిగింది. ఇది నేను రాస్తున్న సమయానికి 140కి పైగా పసిమొగ్గలు రాలిపోయాయి. మీరు చదివే సమయానికి మరెన్ని ప్రాణాలు ఆవిరి అయిపోతాయో అని భయంగా ఉంది. ఈ భయం సృష్టించాలనే కదా మారణహోమం చేస్తోంది ఉగ్రవాదం. ఈ భయానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటి దగ్గరా ఉన్న ఆయుధం ధైర్యం.
 
ఏకే47లు, కలష్నికోవ్‌లు, ట్యాంకర్లు, బంకర్లు, బాంబులు, మిసైల్స్ ఇవి సైన్యం దగ్గర మాత్రమే ఉండే రోజులు కావివి. మనం ఇప్పుడు భయపడాల్సింది, ఉగ్రవాదుల చెంతనున్న ఆయుధ బలం చూసి కాదు, ప్రాణాలను సైతం లెక్క చేయనంతగా యువత మనసులను ప్రభావితం చేస్తున్న ఛాందస భావజాలం చూసి. తమ ప్రాణాలనే లెక్క చేయని కరడుగట్టిన ఉన్మాదులకు పసిపిల్లల ప్రాణం విలువ ఏం అర్థమవుతుంది. అందుకే విచక్షణ రహితంగా కాల్చారు, పేల్చారు, తగులబెట్టారు. వాళ్లు రగిల్చిన చిచ్చు చూసేందుకు వాళ్లు ఎలాగూ మిగిలి ఉండరు. కానీ, ఈ వినాశనం ఓ భయంకరమైన దృశ్యంగా బతికి ఉన్న పిల్లలను వెంటాడుతూనే ఉంటుంది.

తెర వెనుక మత రాజకీయాలకు ఆజ్యం పోసే వ్యవస్థలకూ ఇది పీడకలలా వేధిస్తూనే ఉంటుంది. మానవత్వానికి మచ్చగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రభుత్వాలు, అగ్రరాజ్యాలు ఇప్పుడు ఏం చేస్తాయో వేచి చూడాలి. సోమవారం సిడ్నీలోని చాక్లెట్ కెఫేలో ఒక్క దుండగుడు సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం తేరుకోకముందే మంగళవారం పాకిస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. రేపు మళ్లీ ఏ మూల నుంచి పంజా విసురుతారో అనే భయం అందరి మనసుల్లోనూ ఉంది.
 
పరాకు చేటుగా..
గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు మన మనసుల నుంచి ఇప్పుడిప్పుడే మాయమవుతున్నాయి. అంతా సాధారణంగా నడిచిపోతోంది అని మన భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నాం. భద్రత మన హక్కు అయితే అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. హైఅలర్ట్ ప్రకటిస్తేనే తనిఖీలు మొదలవుతాయి, మెటల్ డిటెక్టర్లు మోగుతాయి. మామూలు రోజుల్లో తనిఖీ అంటే మనకు అవమానం, మెటల్ డిటెక్టర్లు మనకు టైమ్ వేస్ట్. మాల్స్‌లో సెక్యూరిటీ తనిఖీలను పెద్ద ఫార్స్‌లా మార్చిన ఘనత మనకే చెందుతుంది. మనకు క్యూలో నిల్చోవడమే సరిగ్గా రాదు.. ఇక మాక్ డ్రిల్స్, ఎమెర్జెన్సీ ప్రాక్టీస్‌లు ఏం తెలుస్తాయి. అవగాహన మనమూ పెంచుకోవాలి. పొరుగింట్లో ఎవరుంటారో వారి కార్యకలాపాలు, భావజాలం ఇవన్నీ తెలుసుకోవడం మన బాధ్యత. ఇవి తెలుసుకోవాలంటే కనీసం వారితో మాట్లాడటం అవసరం.
 
నిఘాతో పాటుగా..
ఇక భద్రతావిభాగాల సంసిద్ధత మరో కోణం. మన బలగాల బల ప్రదర్శన అవసరం రాకూడదనే కోరుకుందాం. కానీ ఒకవేళ అలాంటి సమయమే వస్తే.. ఆస్ట్రేలియా సిడ్నీ కెఫే ఉదంతంలో సైనిక చర్య మనకు ఉదాహరణగా నిలవాలి. మనదీ ఉగ్రవాద పిరికిపంద చర్యలు చూసిన దేశమే. మనదీ ఈ దాడులను తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్న ఇంటెలిజెన్సే. నిఘా వర్గాలను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాళ్లున్నారు.. బాధ్యత కేవలం వారిదే అనుకుని కళ్లు మూసుకుని చల్లగా ఉండటం మనకు తగదు. కళ్లు తెరవండి. నిఘా నేత్రాలకు మీ అప్రమత్తతను జోడించండి. తనిఖీలు సరిగ్గా జరిగేలా సహకరిద్దాం. చేయని పక్షంలో డిమాండ్ చేసి మరీ తనిఖీలు చేయిద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేకింగ్ న్యూస్ ఉంటే కానీ తోచని మొద్దు చర్మం సమాజంలా తయారవ్వొద్దు మనం.
 
వేయి మలాలాల దీటుగా..
కళ్ల ముందు మాంసపు ముద్దల్లా పసికందులు కనిపిస్తుంటే చలించని హృదయం లేదు. ఆ కుటుంబాలను మాత్రమే కాదు ఈ నష్టం, ఆ దేశం అంతటికీ కోలుకోలేని నష్టం ఈ ఉగ్రపర్వం. భయానకమైన ఈ సంఘటన నుంచి బయటపడిన పిల్లలు ద్వేషం, భయం, కోపం, పగ వంటి ఎమోషనల్ డిస్ట్రబెన్స్‌లో పెరగకుండా చూడాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న మన సమాజానిదే. మలాలాపై దాడి జరిగిన వాయవ్య పాకిస్థాన్‌లోనే ఈ స్కూల్ దాడి కూడా జరిగింది. వేల మంది బాలికల విద్య కోసం గొంతువిప్పిన మలాలా లాగ నేల రాలిన వంద మంది చిన్నారుల నుంచి రేపు వేల మంది మలాలాలు జనించాలి. హక్కుల గళం వినిపించాలి. ఈ రోజు భయంతో కాదు బాధతో నిద్రపట్టదు. రేపు ఉదయం భయంతో కాదు బాధ్యతతో లేస్తాను. వేయి మలాలాల సూర్యోదయం కోసం ఎదురు చూస్తాను.

మరిన్ని వార్తలు