వెండి తెరపై జయరాజసం

4 Sep, 2014 00:54 IST|Sakshi
వెండి తెరపై జయరాజసం

బాలీవుడ్‌లో మన ‘జయ’కేతనాన్ని ఎగురవేసిన తొలితరం నటుడు. భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తెలుగుసినీప్రముఖుడు కూడా ఆయనే. కరీంనగర్ బిడ్డ అయిన పైడి జయరాజ్ చదువు సంధ్యలు సాగింది హైదరాబాద్‌లోనే. నాటి హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో 1909 సెప్టెంబర్ 28న జయరాజ్ జన్మించారు. ఆయన చదువు సంధ్యలన్నీ హైదరాబాద్‌లోనే సాగాయి. నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ చదువుకున్నారు. టాకీలు ఇంకా ప్రారంభం కాని ఆ కాలంలోనే ఆయనకు సినిమాలపై మక్కువ ఏర్పడి, 1929లో బాంబే చేరుకున్నారు.

మూకీ సినిమా ‘స్టార్ క్లింగ్ యూత్’ ఆయన తొలిచిత్రం. ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహా సాగర్ మోతీ’, ‘ఫ్లైట్ ఇన్‌టు డెత్’, ‘మై హీరో’ వంటి పదకొండు మూకీ సినిమాల్లో జయరాజ్ నటించారు. 1931లో ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన ‘షికారీ’ ఆయన తొలి టాకీ చిత్రం. అక్కడి నుంచి జయరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాటి నట దిగ్గజాలు పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్, మోతీలాల్ వంటి వారికి దీటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు యాక్షన్ హీరోగా బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. నిరూపా రాయ్, శోభనా సమర్థ్, షకీలా, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, చాంద్ ఉస్మానీ, జేబున్నీసా, ఖుర్షీద్ వంటి హీరోయిన్ల సరసన ఆయన నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
 
చారిత్రక పాత్రలతో చెరగని ముద్ర
మంచి శరీర దారుఢ్యానికి స్ఫురద్రూపం తోడవడంతో చారిత్రక పాత్రల్లో జయరాజ్ అద్భుతంగా రాణించగలిగారు. రూప దారుఢ్యాలకు మించి అద్భుతమైన అభినయంతో చారిత్రక పాత్రలతో ఆయన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. రాజ్‌పుటానీ, షాజహాన్, అమర్‌సింగ్ రాథోడ్, వీర్ దుర్గాదాస్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణాప్రతాప్, టిప్పు సుల్తాన్, రజియా సుల్తానా, అల్లావుద్దీన్,
 జై చిత్తోడ్, రాణా హమీర్ వంటి పాత్రలు ఆయనను తిరుగులేని యాక్షన్ హీరోగా నిలిపాయి. అదేకాలంలో మజ్దూర్, షేర్‌దిల్ ఔరత్, జీవన్ నాటక్, తూఫానీ ఖజానా, మధుర్ మిలన్, ప్రభాత్, మాలా, స్వామి, నయీ దునియా, నయీ కహానీ, హమారీ బాత్, ప్రేమ్ సంగీత్ వంటి సాంఘిక చిత్రాల్లోనూ రాణించారు.

మొహర్, మాలా (1943), ప్రతిమా, రాజ్‌ఘర్, సాగర్ (1951) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సాగర్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. వయసు మళ్లిన తర్వాత కేరక్టర్ యాక్టర్‌గా పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షోలే, ముకద్దర్ కా సికందర్, డాన్, ఫిఫ్టీ ఫిఫ్టీ వంటి బ్లాక్‌బస్టర్స్‌లో కీలక పాత్రలు ధరించారు. ‘గాడ్ అండ్ గన్’ ఆయన చివరి చిత్రం. తెలుగువాడైన జయరాజ్ హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించినా, ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. తెలుగు సినీరంగం సైతం ఆయనను పట్టించుకోకపోవడమే విషాదం. అయితే భారత సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1980లో పద్మభూషణ్ అవార్డునిచ్చింది. అదే ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా జయరాజ్‌ను వరించింది.
 
చరమాంకం విషాదకరం
దాదాపు ఆరున్నర దశాబ్దాల నట జీవితాన్ని విజయవంతంగా గడిపిన జయరాజ్‌కు చరమాంకం మాత్రం విషాదమే. పంజాబీ మహిళ సావిత్రిని పెళ్లాడిన ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తి కోసం కొడుకు దిలీప్‌రాజ్ వేధింపులకు దిగడంతో భరించలేక వార్ధక్యంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సొంత ఫ్లాట్‌పై జయరాజ్‌కే అధికారం ఉంటుందని, కొడుకు దిలీప్ రాజ్ రోజుకు ఒకసారి చూసిపోవడం తప్ప అక్కడ ఉండేందుకు వీలులేదని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జయరాజ్ ఎన్నాళ్లో బతకలేదు. 2000 ఆగస్టు 11న తుదిశ్వాస విడిచారు.
- పన్యాల జగన్నాథదాసు

>
మరిన్ని వార్తలు