హనీమూన్ అయిపోయింది

9 Apr, 2015 08:33 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

 జీవన కాలమ్

 భారతీయ జనతా పార్టీ హనీమూన్ గడువు ముగిసింది. హనీమూన్ దశలో చిన్న చిన్న అపశ్రుతులను మోజు భర్తీ చేస్తుంది. కాని ఇప్పటికి జరిగిన సంఘటనలలో పెద్ద పెద్ద కప్పదాట్లున్నాయి. అదుపు తప్పిన ఆత్మవిశ్వాసం ఉంది.  2014లో భారతీయ జనతా పార్టీ - తద్వారా నరేంద్ర మోదీ విజయానికి అహర్నిశలూ కష్టపడి పనిచేసిన పార్టీ కాంగ్రెస్. పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలనతో విసిగి వేసా రిపోయిన ఓటరు ఈ అవినీతి పాలనకు ఏనాటికయినా ప్ర త్యామ్నాయం కనిపిస్తుందా అని నిస్సహాయంగా ఎదురు చూస్తూ మోదీ నాయక త్వాన్ని నిర్ద్వంద్వంగా ఆహ్వానించారు. ఇందులో ఆ పార్టీకి సంబంధించిన కొన్ని అతివాద విధానాలనీ, మత ఛాందసాన్నీ సమ్మతించనివారూ, మతేతరులూ కూడా ఉన్నారు. నరేంద్ర మోదీని నిండు మనస్సుతో ఆహ్వానిం చిన కోట్లాదిమందిలో నేనూ ఉన్నాను.

 ఆయన పార్లమెంటు ముందు మోకరిల్లినప్పుడు అందరం పులకించాం.
 తల్లి దీవెనలందుకున్నప్పుడు ఆర్ద్రతతో కరిగి పోయాం. పదవీ స్వీకారానికి సార్క్‌దేశాల నాయకులను ఆహ్వానించినప్పుడు ఆయన రాజనీతిజ్ఞతకు పొంగిపో యాం. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌గారి తల్లికి ఆత్మీ యంగా పట్టుశాలువా పంపినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వపు విలువలకి పెద్దపీట వేసినం దుకు మోదీని ప్రశంసించాం. ప్రతిపక్షాలు ఆయన ప్రతి ష్టను విదేశాలలో గబ్బు పట్టించిన నేపథ్యంలో ఒక్కొక్క దేశపు ప్రశంసలనీ ఆయన అందుకుంటున్నప్పుడు మోదీ రాజకీయ దౌత్యానికి సంబరపడ్డాం.
 నవాజ్ షరీఫ్‌తో భుజాలు కలిపినా పాకిస్తాన్ హురియత్ నాయకులను చర్చలకు ఆహ్వానించినప్పుడు - రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని నిలిపి వేసినందుకు గర్వపడ్డాం. పెద్ద మనస్సుకీ, బుద్ధి లేని చర్యకీ చాలా దూరం ఉందని ప్రభుత్వం హెచ్చరిం చడాన్ని గర్వంగా ఆహ్వానించాం.

 కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసే శక్తులు కొన్ని పార్టీ వర్గాల్లో మేల్కొన్నాయి. ఒకాయన నాథూ రాం గాడ్సేకి దేవాలయం కడతానన్నారు. ఒకానొక మంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి నిండు సభలో ‘మీకు రాం జాదోం (రామ సేవకులు) కావాలా? హరాం జాదోం కావాలా?’ అని బల్లగుద్దినప్పుడు దేశం తెల్లబోయింది. మరో మంత్రి గిరిరాజ్ సింగుగారు బరితెగించి ‘రాజీవ్ గాంధీ ఓ తెల్ల అమ్మాయిని కాక ఏ నైజీరియా అమ్మా యినో చేసుకుంటే ఆమెని పార్టీ నాయకురాలిని చేసే వారా?’ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు మోహన్ భగ వత్‌గారు మదర్ థెరిస్సా లక్ష్యం మత మార్పిడి అన్నా రు. సాక్షి మహరాజ్ అనే పార్లమెంటు సభ్యులు ప్రతీ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్ తొగాడియా గారు ఆ ఆలోచనని వెంటనే సమర్థించారు. గోవా ముఖ్య మంత్రిగారు నర్సులు ఎండల్లో సమ్మె చేస్తే కమిలి పోతారన్నారు. రాంప్రసాద్‌వర్మ అనే మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు పొగాకుకీ, కేన్సర్‌కీ సంబంధం లేదన్నారు.

 ఈలోగా కశ్మీర్‌లో పదవి మాత్రమే లక్ష్యంగా పాకి స్తాన్‌ని సమర్థించే పీడీపీతో భారతీయ జనతా పార్టీ చెయ్యి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశం షాక్ అయింది. పదవిలోకి రాగానే పీడీపీ నాయకులు ముఖ్య మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఉవాచ: ‘పాకిస్తాన్ ధర్మమా అంటూ, వేర్పాటువాదుల సహకారంతో కశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి’. దేశం ఆగ్రహంతో విలవిలలాడింది.
 ఈలోగా నాలుగేళ్లుగా జైలులో ఉన్న కశ్మీర్ వేర్పాటు వాది, ఉద్యమాలలో 112 మంది మారణహోమానికి కారణమైన పాకిస్తాన్ అనుయాయుడు మస్రత్ ఆల మ్‌ను ముఫ్తీగారి ప్రభుత్వం విడుదల చేసింది. దేశం తెల్లబోయింది.

 వేర్పాటువాదులతో చర్చలకు ఆహ్వానించినందుకే అధికార చర్చలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం కశ్మీర్ జాతీయ దినోత్సవానికి హురియత్ నాయకులతో పాటు పాల్గొనడానికి విదేశాంగ ఉపమంత్రిని పంపింది. ముం దు రోజే కశ్మీర్ పొలిమేరల్లో తన కొడుకును దుండగులు చంపగా ఓ తల్లి కొడుకు శవాన్ని పట్టుకుని ‘నా కొడుకు మాటేమిటి? మోదీ ఏం సమాధానం చెబుతారు?’ అని ఆక్రోశించింది.
 పదవిలో ఉండగా సంయమనాన్ని పాటిస్తూ, అందరినీ కలుపుకుని పాలన చేసిన ఆ పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజపేయి భారతరత్నంగా దేశం మన్న నలు పొందడాన్ని ఆ పార్టీయే మరచిపోకూడదు.

 భారతీయ జనతా పార్టీ హనీమూన్ గడువు ముగి సింది. హనీమూన్ దశలో చిన్న చిన్న అపశ్రుతులను మోజు భర్తీ చేస్తుంది. కాని ఇప్పటికి జరిగిన సంఘట నలలో పెద్ద పెద్ద కప్పదాట్లున్నాయి. అదుపు తప్పిన ఆత్మ విశ్వాసం ఉంది. మించి-చిన్న నిరంకుశ లక్షణాలు ఉన్నాయి.


 పార్టీ అనుయాయుల విశృంఖలత్వం పట్ల మోదీ మౌనం పరోక్షంగా ఆయన మద్దతుగా దేశం భావి స్తుంది. ఓటరు నిర్వేదం మూట బరువెక్కకుండా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభం కావాలని- కోరి గద్దెనెక్కిం చిన ఓటరు ఆత్రుతగా, కాస్త కలవరంతో ఎదురుచూసే రోజులొచ్చాయి.

>
మరిన్ని వార్తలు