‘రేపు’ తీపి

4 Dec, 2014 00:57 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

 జీవన కాలమ్

 ‘ఇతను ఇంతకంటే వృద్ధిలోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’
 అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ.
 అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టి
 సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి.
 
 ఈ మధ్య మానవవన రుల మంత్రి స్మృతీ ఇరానీ భర్తతో కలసి నాథూలాల్ అనే జ్యోతిష్కుడితో జాత కాన్ని చూపించుకున్నారు. ఆవిడ మంత్రి అవుతారని లోగడ నాథూలాల్ చెప్పా రట. ఇప్పుడు రాష్ట్రపతి అవుతారని జోస్యం చెప్పా రు. ఇది బొత్తిగా మత ఛాందసమని పత్రికలవారు ఆమెను నిలదీశారు. ‘అది నా వ్యక్తిగత వ్యవహారం’ అన్నారు స్మృతీ ఇరానీ. ‘నాకూ జ్యోతిషం మీదా ఖగోళశాస్త్రం మీదా నమ్మకాలున్నాయి’ అంటూ మం త్రిని వెనకేసుకొచ్చారు నజ్మా హెప్తుల్లా.

 ‘ఆవిడ మానవ వనరుల మంత్రి. శాస్త్రీయమైన విశ్వాసాలనే ప్రోత్సహించాలి’ అన్నారు కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్‌గారు. వారికి గుర్తు లేని విషయమేమిటంటే జ్యోతిషం ఒక శాస్త్రంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం వంటి ఎన్నో విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశం. కాగా, అయ్యరు గారూ! వంద అనుభవాల పెట్టుబడి- విశ్వాసం. వంద సంవత్సరాల విశ్వాసాల పరిణతి -శాస్త్రం.

 మన దేశంలో చిలకలనీ, పావురాలనీ నమ్ము కొని వాటి పేరిట కలల్ని అమ్ముకుని పొట్టపోసుకునే పేవ్‌మెంట్ జ్యోతిష్కుల మధ్య, శాస్త్రీయమైన అన్వ యమూ, ప్రతిభా కల ఒక్క ప్రముఖుడిని గుర్తు పట్ట డం కష్టం. మిగతా తొమ్మిది మంది శాస్త్రాన్ని గబ్బు పట్టిస్తారు. దేశంలో తెలియని రేపుని బులిపించి డబ్బు చేసుకొనేవారెందరో. వీరంతా శాస్త్రం పేరు చెప్పి కాయలమ్ముకునే అవకాశవాదులు. రేపు గురిం చి ఎవరికెంత తెలుసో, ఆ రేపు వచ్చేవరకూ తెలి యదు. కాని వారికి లోనయ్యే లేదా నమ్మేవారి విశ్వా సం కల్మషం లేనిది. నమ్మించడంలోనే అవినీతి ఉంది. నమ్మడంలో అకుంఠితమైన విశ్వాసం మూలాలు ఉన్నాయి.

 భవిష్యత్తు గురించి తు.చ. తప్పకుండా చెప్ప గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఫ్రెంచ్ జ్ఞాని నోస్టర్‌డామస్‌ల ‘కాలజ్ఞానం’ ఇప్పటికీ ప్రపంచా న్నంతటినీ ఆశ్చర్యపరుస్తోంది. పిడపర్తి దక్షిణా మూర్తిగారి జీవితచరిత్ర అద్భుత సంఘటనల మణి హారం. మిత్రుడు భమిడిపాటి రాధాకృష్ణ తన మృత్యువుకి ముహూర్తాన్ని తనే నిర్ణయించుకు న్నాడు. ముత్తుస్వామి దీక్షితార్ తన అవసానాన్ని గుర్తుపట్టి, శిష్యులను పిలిచి ‘మీన లోచన పాశమో చని కదంబ వనవాసిని’ (మీనాక్షి మేముదం దేహి’ కీర్తన - పూర్వీ కల్యాణి) అనే చరణాన్ని నెఱవల్ చెయ్యమంటూ తనువు చాలించారు. ఇది చరిత్ర. గ్రహధర్మాన్ని ఎరిగిన వారికి భవిష్యత్తు కరత లామలకం.

 ఇందుకు నేనెన్నయినా ఉదాహరణలు చెప్పగ లను. పాతికేళ్ల కిందట మా నాన్నగారు విశాఖ కింగ్‌జార్జ్  ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు- హార్ట్ అటాక్ వచ్చి, క్షయతో రెండు ఊపిరితిత్తులూ చెడి, కోమాలో. ఈ స్థితిలో మా తమ్ముడు మా కుటుంబ జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మగారిని కలుద్దామన్నాడు. నాన్నగారు వెళ్లిపోతున్నారనడా నికి జ్యోతిష్కుని ప్రమేయం అవసరం లేదు. అయి నా ఆశపోదు. వెళ్లాం. కామేశ్వరశర్మ గారు మా నాన్న గారి మిత్రులు. ఆయనకు కుష్టు. విషయం తెలిసి ఆయనా నివ్వెరపోయారు. దాదాపు గంటసేపు లెక్క లు వేశారు. అవతల ఆసుపత్రిలో చావుబతుకుల్లో నాన్నగారు. ఇక్కడ కాగితం మీద లెక్కలు వేస్తున్న జ్యోతిష్కుడు. ఆ క్షణంలో జ్యోతిషం మీదా, మా తమ్ముడి మీదా, ఆయన మీదా కలిగిన కోపం, అస హ్యం వర్ణనాతీతం. ఆఖరికి లెక్కలు పూర్తి చేసి తేలికగా, ‘మరేం పరవాలేదయ్యా! గండం గడిచి పోతుంది’ అన్నారు. నాకు కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. లేచి వచ్చేశాను. ఆ తర్వాత నాన్నగారు కోలుకుని, 14 ఏళ్లు జీవించి, నిద్రలో వెళ్లిపోయారు.

 నేను సినీనటుడినయ్యాక ఇదే విషయాన్ని ఓ ప్రముఖ హీరోకి, హీరోయిన్‌కి చెప్పాను. వారిద్దరూ తమ జాతకాలు ఇచ్చారు. వారి పేర్లు చెప్పకుండా కామేశ్వరశర్మగారికిచ్చాను. ఆయన పరిశీలించి రెండు రోజుల తర్వాత చెప్పారు, ‘ఈ అమ్మాయి చాలా పాపులర్. త్వరలో పెళ్లవుతుంది’ అని. ఆ మాట విని హీరోయిన్ నవ్వేసింది- వేళాకోళంగా. కొన్ని నెలల లోనే ఆవిడ అమ్మ పైదేశానికి వెళ్లినప్పుడు అర్ధాం తరంగా పెళ్లి చేసేసుకుంది. ఆ పెళ్లి చాలాకాలం నిలవలేదు. అది వేరే కథ.

 ఇక హీరో గురించి. ‘ఇతను ఇంతకంటే వృద్ధి లోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’ అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి.

 మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ. అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టిని సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి. విశ్వాసం ఇంధనం. అన్నిటికీ మిం చి ‘బంగారు భవిష్యత్తు’ దాని పదును.

మరిన్ని వార్తలు