చరిత్రకు రాని హీరోలు

26 Mar, 2015 09:08 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

 జీవన కాలమ్

 మా వాసూ పోయిన 23 సంవత్సరాలలో ఏ ఒక్కసారీ ఇలాంటి కాలమ్ రాయలేదు. 18 సంవత్సరాలుగా వాసూ పోయిన రోజున ఉత్తమ నూత న దర్శకుడిని సత్కరిస్తూ- ఆ రోజు ఎవరి కళ్లూ చెమర్చకుం డా చేసే ప్రయత్నం చెప్పనల వి కాదు. ఈ బహుమతి ఉద్దేశం వాసూని తలుచుకుని కంటతడిపెట్టుకోవడం కాదనీ, ఒక యువదర్శకుని విజయాన్ని పండుగ చేసుకో వడమనీ అతిథులందరికీ చిన్న కాగితాలు పంపేవారం. కానీ జయాబచ్చన్, అపర్ణాసేన్, సునీల్‌దత్ వంటి వారిని ఆపలేకపోయేవారం. అయినా భోరుమన్న కళ్లు తుడుచుకున్న లెస్లీ కెర్వాలో, జానకీ విశ్వనాథన్, ఆమిర్ ఖాన్‌లు ఎందరో ఉన్నారు- అది మా నిస్సహాయత.


 ప్రతీ సంవత్సరం ఆనాటి విషాదాన్ని వెనక్కి నెట్టి విజేతను గుండెలకు హత్తుకుంటున్న మమ్మల్ని చూసి ఒక హిందీ మిత్రుడు అడిగాడు:   "Tell me, when will this madness end?" అని. "After us" అదీ సమాధానం.
 ఒక్కరే - మాలతీచందూర్ మా గుండెల్లోంచి దూసుకెళ్లారు, ‘‘...వెలుగులో ఉన్నవాడు చీకటి వస్తుంద ని భయపడతాడు. చీకటిలో ఉన్నవాడు ఏ చిన్న వెలుగు కనిపించినా దాని వెనుక నడిచిపోతాడు....’’

 అయితే ఇందుకుకాదు ఈ కాలమ్. ఈ 18 సంవ త్సరాలూ ఏటా ఓ యువదర్శకుడిని గౌరవించినప్పు డల్లా - అలా సత్కారానికి నోచుకోని మరో 20-30 మం ది ఆ సంవత్సరం కనిపిస్తారు. వారి ప్రయత్నంలో లోపం లేదు. వారి జీనియస్‌కి వారు బాధ్యులు కారు. వాళ్లకి తప్పనిసరిగా ఉత్తరం రాస్తాం. ఆ ఉత్తరం మీద నేనే సంతకం చేస్తాను. ఇది బహుమతి కన్నా ముఖ్య మైన పని. ఈ ఉత్తరాన్ని రోజుల తరబడి ఆలోచనల్లో రంగరించి సిద్ధం చేశాం. ఆ యువ దర్శకుని ఉత్సాహాన్ని ఏవిధంగానూ తగ్గించకుండా పునరుద్ధరించే వాక్యాలివి:


 ‘‘మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించే దర్శ కుని మొక్కవోని లక్ష్యానికి దోహదం చేస్తూ, అతని ఆద ర్శానికి  దన్నుకావాలన్నదే మా ఫౌండేషన్ లక్ష్యం. ప్రతీ సంవత్సరం అందరు తొలి దర్శకులను ఆహ్వానించి ప్రోత్సహించాలన్నదే మా ధ్యేయం. ఈ పోటీలో మీ చిత్రం పాల్గొనడమే గొప్ప విజయం. కారణం- ఇలాం టి ప్రోత్సాహానికి  మా శ్రీనివాస్ నోచుకోలేదు కనుక. మీ చిత్రం చాలా బాగుంది. అయితే, ఇన్ని చిత్రాల పరిశీ లనలో, తప్పనిసరిగా ఏ ఒక్క చిత్రమో మిగతావాటి కంటే ఒక్క అడుగయినా ముందు నిలుస్తుంది. అయితే అన్నీ గొప్ప ప్రయత్నాలే. సందేహం లేదు. కాని, ఈ బహుమతి ఒక్కరికే దక్కుతుంది. గత్యంతరం లేదు. దర్శకుడిగా ఎన్నో అంగల్లో ముందుకు సాగబో తున్న మీ కెరీర్ సమర్థవంతం, ఫలవంతం కావాలని ఆశి స్తున్నాం. మీలో ఆ సామర్థ్యం ఉన్నదని నమ్ముతున్నాం.


 ఆగస్టు 12న మీలో ఒకరయిన మీలాంటి దర్శకునికి సత్కారం జరుగుతుంది. మా కుటుంబ సభ్యుడిగా వచ్చి అందులో పాల్గొనండి.’’
 ఈ ఉత్తరాన్ని గత 18 సంవత్సరాలుగా దేశం నలు మూలలో ఉన్న 265 మంది యువ దర్శకులకు ఇప్పటి వరకూ పంపాం.
 ఇప్పుడు ఈ కాలమ్ స్ఫూర్తి. మొన్న ఈ ఉత్తరం అందుకున్న బహుమతి రాని బెంగాలు దర్శకుడు బౌద్ధా యన్ ముఖర్జీ కలకత్తా నుంచి సమాధానం రాశాడు. అది ఇది:

 ‘‘మీ ఉత్తరానికి ధన్యవాదాలు. అందులో విషయం మనసుని బాధ పెట్టినా  బహుమతిని ఒక్కరే అందుకో గలరని అర్థమవుతోంది. న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని నేను మనసారా గౌరవిస్తాను. అయితే అరవిందన్ పుర స్కారం లాగ ఈ బహుమతితో పాటు ఒక ప్రత్యేక ప్రశం సని న్యాయనిర్ణేతలు రెండో స్థానంలో ఉన్న చిత్ర దర్శ కుడికి అందజేయవచ్చు. అందువల్ల మరో చిత్ర దర్శకునికి ఆనందం కలుగుతుంది.
 ఈ సంస్థకి నా శుభాకాంక్షలు. శ్రీనివాస్ స్ఫూర్తి మా అందరిలో ప్రబలాలని, రాబోయే కాలంలో నిజాయి తీగా మేము చేసే కృషి మరింత ఫలవంతం కావాలని ఆశిస్తాను. శ్రీనివాస్‌కి మేము ఇవ్వగల నివాళి అది.

 మీ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా సాగాలి. మీరు నూతన దర్శకులలో నింపుతున్న ప్రాణవాయు వు- జ్యోతిగా వెలుగొందాలి. ఇది గొప్ప కృషి. ధన్య వాదాలు.’’
 ఇది చదువుతూంటే కుటుంబమంతటికీ కళ్లు చెమ ర్చాయి. గుండె గొంతులో కదిలింది. ఇంత ఉదాత్త మయిన యువదర్శకులు ఈ దేశంలో ఎందరు ఈ కళని పరిపుష్టం చేస్తున్నారో!
  ఆర్ద్రత ఆదర్శాన్ని ఆకాశంలో నిలుపుతుంది. ఇలాంటి స్పందనలు కన్నీటిని కూడా కర్పూరంలాగ వెలి గించి-కాంతిని హృదయాల్లో నింపుతాయి. మా వాసూ ధన్యుడు.

మరిన్ని వార్తలు