శాంతంలేక సౌఖ్యంలేదు

28 Dec, 2014 01:33 IST|Sakshi
శాంతంలేక సౌఖ్యంలేదు

 జ్యోతిర్మయం
 మనిషికి శత్రువులు ఎక్కడో బైట లేరు. తనలోనే ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని వాటి పేర్లు. అరిషడ్వర్గాలనేది వాటినే. సొంత ఇంటి లోనే శత్రువులు ఉన్న యజమానికి సుఖశాంతులు ఉం డవు. ఈ ఆరూ చెరుపు చేసేవే కానీ మొదటి మూడూ మరీ చెడ్డవి. ఆ మూడింటిలోను ఏది మిగతా వాటికంటే ఎక్కువ చెరుపు చేసేదంటే క్రోధం అని చెప్పాలి. ఎందు కంటే అది అన్నింటి దుర్గుణాల్ని ఇముడ్చుకొంది.

 కోపంలో మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవటం అనేది బైటకు కనిపించే లక్షణం. లోపల ఇంతకంటే ప్రమాదకరమైనది ఇంకోటి జరుగుతుంది. అదేమి టంటే అతడి ఒళ్లు వేడెక్కి లోపల రక్తం ఉడికిపోతుంది. చీటికీ మాటికీ కోపం తెచ్చుకొనే మనిషి ఒంటిలోని నెత్తురు కూడా వేడెక్కుతుంది. కోపగ్రస్తుడి శరీరం త్వరలోనే రోగగ్రస్తమవుతుంది. ఉప్పుకారం తినే మని షికి కోపం రాకుండా ఉండటం ఎలా సాధ్యం అని అడుగుతారు చాలా మంది. నిజమే, ఎప్పుడో ఒకప్పుడు దేనికో దానికి కోపం రాకుండా ఉండదు. వచ్చిన ప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్న వాడే ఘనుడు.

 అయితే, అవసరమైనప్పుడు కోపం ప్రదర్శించటం మంచిదే అన్నారు పెద్దలు. అంటే కోపాన్ని నటించు అన్నారు. మనకో కథ ఉన్నది. ఒక సాధువు మాట విని ఓ సర్పం తనూ సాధువుగా మారిపోయింది. ఆకతాయి పిల్లలు చూసి రాళ్లు రువ్వుతున్నా కోపం తెచ్చుకొనేది కాదు. దాంతో పిల్లలు దాన్ని మరీ బాధించేవారు. ఓ రోజు ఆ సాధువు అదే దారిన తిరిగి వెళ్తుంటే పాము తన దీనావస్థను చెప్పుకొంది. అప్పుడా సాధువు అన్నా డట, ‘ఓ పామా, నిన్ను కోపం తెచ్చుకొని కాటు వేయవ ద్దన్నాను గాని బుసకొట్టవద్దన్నానా?’ అని. దాంతో పాముకు జ్ఞానోదయమై నాటి నుండి కోపం నటిస్తూ బుసకొట్టడం చేసిందట. పిల్లలు కూడా భయపడి దాని జోలికి వెళ్లటం మానివేశారు.

 తనకు గాని, తనతోటి వారికి గాని జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను సహించి ఊరుకొమ్మని ఏ ధర్మశాస్త్రం చెప్పదు. వాటిని ఎదిరించి రూపుమాపవల సిందే అని బోధిస్తుంది. అప్పటి ఆ ఆగ్రహాన్నే ధర్మా గ్రహం, సత్యాగ్రహం అన్నారు.

 రామాయణం బాలకాండలో వాల్మీకి అడుగుతా డు నారదుణ్ణి, ‘కోపాన్ని జయించిన వాడు ఎవరు? యుద్ధంలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయ పడుతారు?’ అని. అందుకు నారదుడు అలాంటి వారు రాముడు అని సమాధానం చెబుతాడు. అంటే రాముడు స్వతహాగా శాంతమూర్తి. అధర్మం, అన్యాయం లాంటి వాటి మీద యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం, అంటే ఆ సందర్భంలో, ఆ కాసేపు, కోపాన్ని తెచ్చిపెట్టు కొంటాడు. ఆ పని అయిపోయిన తర్వాత తెచ్చిపెట్టు కొన్న కోపాన్ని తీసివేస్తాడు. మళ్లీ ఎప్పటిలా శాంత మూ ర్తి అవుతాడు. అవతార పురుషులు తమ చర్యల ద్వారా లోకంలో మనుష్యులు ఎలా జీవించాలో చెబుతారు.
 దీవి సుబ్బారావు

మరిన్ని వార్తలు