కళాపర్వం

27 Mar, 2015 23:58 IST|Sakshi
కళాపర్వం

పనితోపాటే పుట్టింది పాట. పనీపాటా జతకట్టింది జన పదం. అదే జాన పదం. అచ్చమైన పల్లె సంస్కృతికి దృశ్యరూపం. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనన్ని భిన్న కళలు, విభిన్న సంస్కృతులు మన సొంతం. ఈ కళాకృతులన్నింటికి వేదికయ్యింది శిల్పారామం. ‘పర్‌‌వ పూర్వోత్తర్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంత ఆహూతులను అలరించింది...
- ఎస్. శ్రావణ్‌జయ
 
ఆనందమైనా.. విషాదమైనా... సంబరమైనా....  పాండిత్యానికి అతీతంగా పరవశమే పరమపద సోపానంగా సాగే కళ జానపదం. అచ్చమైన గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం. భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ప్రాంతానికో ఆటపాటా. అఖిల భారత రంగస్థల ఉత్సవం సందర్భంగా సంగీత నాటక్ అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శిల్పారామంలో శుక్రవారం ప్రారంభమయిన ఈ అద్భుత నృత్య ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది.  
 
రాధాకృష్ణుల నృత్యం...

‘ఏడే ళ్ల వయసులో ఈ నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతి రోజూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటల పాటు క్రమం తప్పకుండా నేర్చుకోవాలి.  ఇప్పుడు నా వయసు 38. కొన్ని సార్లు ఈ నాట్యం గంట పాటు ఉంటుంది. బృందంలో ఏ ఒక్కరూ అలసిపోయినా ప్రమాదమే. మా మణి పూర్ రాష్ట్రంలో ప్రతి యాసాంగ్(హోలీ) పండుగకి మా బృందం ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తుంది. హోలీ పండుగ సందర్భంగా రాధాకృష్ణులు చేసే నృత్యమే ఈ డోల్ చోలమ్‌కి ప్రధాన నేపథ్యం’ అన్నారు డోల్ చోలమ్ కళాకారుడు జ్ఞానేశ్వర్.
 
నవ వసంత  వేడుక...


‘అసోంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తాం. అసోం మహిళలు ఈ నాట్యాన్ని ఎంతో ఇష్టపడి చేస్తారు. దేశ వ్యాప్తంగా మా బృందం చాలా చోట్ల ప్రదర్శన ఇచ్చింది’ అంటోంది బిహు నృత్య దళం. వీటితోపాటు మణిపూర్‌కే చెందిన ‘థాంగ్ థా’,  మిజోరం నృత్యం చెరా, బెంగాల్ - బౌల్ గాన్  ప్రదర్శనలు
 ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు