అంతరంగాల యుద్ధచిత్రం

29 Jul, 2014 00:51 IST|Sakshi
అంతరంగాల యుద్ధచిత్రం

కలపాతి గణపతి సుబ్రహ్మణ్యన్ 90వ ఏట తాజాగా చిత్రించిన ఒక మహాకుడ్య చిత్రం సాలార్‌జంగ్ మ్యూజియంలో కొలువై ఉంది. పెయింటింగ్ ఒక్కటే!  ఫలకాలు 16. మడతలు 8.  ఎత్తు 9 అడుగులు. వెడల్పు 36 అడుగులు. ‘వార్స్ ఆఫ్ ద రెలిక్స్’ అనే ఈ తెలుపు-నలుపుల చిత్రం ప్రత్యేకత ఏమిటి?  పికాసో ‘గెర్నికా’ ప్రత్యక్ష యుద్ధాన్ని కళ్లకు కడితే, కేజీ కుడ్యచిత్రం యుగయుగాల మానవ మస్తిష్కాల అంతరంగ యుద్ధాలను ఆవిష్కరించింది.
 
 జగమెరిగిన చిత్రకారుడు ఆయన. విద్యార్థి దశలో గాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ చదువు తర్వాత కోల్‌కతా శాంతినికేతన్‌లో చేరి చిత్రకారుడిగా ఎదిగారు. మన కళా సంస్కృతులపై పలు పుస్తకాలు రాసి, వాటి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనాపాటి కె.జి.సుబ్రహ్మణ్యన్. కేరళలోని కలపాతిలో పుట్టిన ఆయన పూర్తి పేరు కలపాతి గణపతి సుబ్రహ్మణ్యన్. ఆధునిక చిత్రకళకు సంబంధించి భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడాయన. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్‌తో సత్కరించింది. తొంభయ్యేళ్ల వయసులోనూ తరగని ఉత్సాహంతో కళా సృజన సాగిస్తున్న సుబ్రహ్మణ్యన్ సాలార్జంగ్ మ్యూజియంలో తన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో ముచ్చట్లు ఆయన మాటల్లోనే...
 - కె.జి. సుబ్రహ్మణ్యన్
 ప్రసిద్ధ చిత్రకారుడు

 
 నేను హైదరాబాద్ వచ్చింది తక్కువసార్లే. అయినా, హైదరాబాద్ అంటే ఇష్టం. ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, అంతే గ్రీనరీ కనిపిస్తుంది. వెరీ నైస్ థింగ్. నగరం మధ్యలో హుస్సేన్‌సాగర్ మరో అందం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ కోసం ప్లానింగ్ జరుగుతున్నప్పుడు మెంబర్‌గా ఆ మీటింగ్స్ లో పాల్గొన్నా. సెంటర్ యూనిట్‌ను పెట్టేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్ రెండూ పరిశీలనకు వచ్చాయి. అహ్మదాబాద్ కంటే హైదరాబాదే దేశానికి సెంటర్ పాయింట్ అని, ఆ ఇన్‌స్టిట్యూట్‌ను హైదరాబాద్‌లోనే పెట్టించాలని చాలా తపనపడ్డా. కానీ అది కాస్తా అహ్మదాబాద్‌కి తరలిపోయింది.
 
 శిష్యులు కాదు భక్తులు...
 ఆర్ట్‌కి సంబంధించి హైదరాబాద్ చాలా యాక్టివ్. నేను బరోడాలో ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఎల్‌జీ గుప్తా ఇక్కడి నుంచి... లక్ష్మా గౌడ్, డీఎల్‌ఎన్ రెడ్డి, వైకుంఠం వంటి కొందరు యంగ్ ఆర్టిస్టులను అక్కడకు పంపించారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లు నాకు శిష్యులు కాదు, భక్తులు. ఇక్కడ జగదీశ్ మిట్టల్ లోకల్ ఆర్ట్ కలెక్షన్ ఏ మ్యూజియానికీ తీసిపోదు. వెలుగులోకి రాని ఎన్నో కళలకు కాణాచి హైదరాబాద్. ఇదంతా ప్రపంచానికి తెలియాలంటే చాలా పని జరగాల్సి ఉంది. అయితే, దీనికి ప్రభుత్వాన్ని నిందించలేం. ప్రభుత్వం ఇతర పనులతో చాలా బిజీగా ఉంటుంది. దీనివల్ల ఆర్ట్ బ్యాక్ సీట్‌లోకి వెళ్లిపోతుంది. దీని గురించి పట్టించుకోమని ప్రభుత్వాన్ని అడిగితే, తప్పకుండా చేద్దామంటూ ఒక అకాడమీ పెట్టి చేతులు దులుపుకుంది. హైదరాబాద్‌లో డబ్బున్న ఆసాములు లేరా? సంస్కృతిని పరిరక్షించే బృహత్ కార్యాన్ని వాళ్లు తమ భుజాన వేసుకోవచ్చు కదా!  
 
 వయసుతో పనిలేదు
 నాకు తొంభై ఏళ్లు నిండాయి. ఇప్పటికీ బొమ్మలు గీస్తా. నా పని వయసుకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఆర్ట్‌కి వార్ధక్యం లేదు.
 
 విశ్వజనీనం
 ఒక మనిషికి తోటి మనుషులతో, పరిసరాలతో గల అర్థవంతమైన అనుబంధమే నా దృష్టిలో అసలైన ఆర్ట్. దానికి ఎలాంటి పరిమితులూ ఉండవు. అది విశ్వజనీనం. అప్‌కమింగ్ ఆర్టిస్టులు ముందుతరం వాళ్ల అనుభవాలను చదవాలి, సహవాసం చేయాలి, నేర్చుకోవాలనే తపన ఉంటే పర్‌ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తారు.
 
 మన విద్యావిధానం అస్తిత్వమే మారాలి
 మన ప్రాథమిక విద్యావిధానం ఏమాత్రం పసలేనిది. అది మనుషులను కాదు, కార్మికులను తయారు చేస్తోంది. ఈ చదువు ఆలోచన ఉన్న మనిషిని కాదు, చెప్పిన పని చేసే మరబొమ్మలను తయారు చేస్తోంది. అందుకే మన విద్యా విధానం అస్తిత్వమే మారాలి. అందులో సృజనకు తావుండాలి.
 -  సరస్వతి రమ
 ఫొటోలు: సృజన్ పున్నా

మరిన్ని వార్తలు