స్వచ్ఛమేవ జయతే

19 Mar, 2015 01:01 IST|Sakshi
స్వచ్ఛమేవ జయతే

ఓన్లీ క్లీన్.. మోదీ స్వచ్ఛ భారత్! స్వచ్ఛతతోపాటు శుభ్రత.. అదీ మ్యాథమెటిక్స్‌ని టూల్‌గా మలచుకొని. ఇది కాళిదాసు వంశీధర్ స్వచ్ఛభారత్ ! ఆయనెవరు? ఆ ప్రచారం ఏంటి?
- శరాది
 
కాళీదాసు వంశీధర్ ఓ మ్యాథమెటీషియన్. నల్లకుంటలోని స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫౌండర్. మ్యాథ్స్ అంటే సహజంగా పిల్లలకు భయం. ఈ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు వంశీధర్. అంటే మ్యాథ్స్‌ని చైల్డ్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్‌గా చేయడం. స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ద్వారా అలాంటి కరిక్యులమ్‌ను డెవలప్ చేస్తారు. గణితాన్ని బోధించడానికి సులువైన పద్ధతులను తయారు చేస్తారు. వాటిని స్కూళ్లల్లో టీచర్స్‌కి, పిల్లలకు చెప్తారు.

చాక్‌పీస్‌తో బ్లాక్ బోర్డ్ మీద లెక్కలు చెప్పే పద్ధతి కాకుండా.. స్టూడెంట్ చుట్టూ ఉన్న పరిసరాలను ఉదాహరణలుగా చూపిస్తూ.. లెక్కలను బోధించే విధానాలను చెప్తారు. ఈ సంస్థ ట్యూటరింగ్‌ని వ్యతిరేకిస్తుంది. దాని స్థానంలో మ్యాథ్స్ మామ్ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. తల్లిదండ్రులకు గణితం పట్ల ఆసక్తిని పెంచి వాళ్ల ద్వారా పిల్లలకు లెక్కలు చెప్పించే విధానమన్నమాట. ఇదీ వంశీధర్ అండ్ హిజ్ కంపెనీ పరిచయం క్లుప్తంగా!
 
రి ఆయన తలపెట్టిన స్వచ్ఛభారత్ ఏంటి?
వంశీధర్ తలపెట్టిన స్వచ్ఛభారత్ ప్రచారం పేరు స్వచ్ఛభారత్ ప్లెడ్జ్‌థాన్. క్లీన్ అండ్ గ్రీన్ దీని లక్ష్యం. అయితే గణితాన్ని ఓ టూల్‌గా మలచుకోవడం వంశీధర్ స్వచ్ఛభారత్ ప్రత్యేకత. దీనికి సెర్పిన్‌స్కీ స్వ్కేర్, ఫ్రాక్టల్ థియరీలు అతనికి స్ఫూర్తి. స్వచ్ఛభారత్ అంటే రోడ్ల మీద చీపుర్లతో ఊడ్వడానికే పరిమితం చేయకుండా అసలు చెత్త రోడ్ల మీదకు రాకుండా ఉండేలా ప్రచారం చేయొచ్చు కదా అనుకున్నారు వంశీధర్. అనుకున్నదే తడవుగా తన స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్‌లో ఉన్న స్టాఫ్‌తో చర్చించారు. తనతోపాటు శ్యామ్‌సుందర్, విజయ్‌పాల్, మాధవీలత, జి.వెంకట్రామన్, డాక్టర్ రమారాయ.. ఇలా ఆరుగురు సభ్యులతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకొని స్వచ్ఛభారత్ ప్లెడ్జ్‌థాన్ విధివిధానాలను నిర్ణయించారు. జనవరి 25న ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
 
ఏం చేస్తున్నారు?
తెలుగు రాష్ట్రాలతో సహా కశ్మీర్  నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అక్కడి పిల్లలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తారు. జీవితాంతం స్వచ్ఛభారత్‌కు కట్టుబడి ఉంటానని రాసిన 20 సెంటిమీటర్ల వెడల్పు, 20 సెంటిమీటర్ల పొడవు ఉన్న రుమాలులాంటి క్లాత్ మీద ప్రతిజ్ఞ చేసిన విద్యార్థిపేరు, అతను లేదా ఆమె చదువుతున్న స్కూల్ పేరు రాయిస్తారు. అలాగే ఆ ప్రతిజ్ఞ చేసిన తేదీని రాస్తారు. చివరకు వాళ్లకు నచ్చిన రంగులో అరచేయిని ముంచి క్లాత్ మీద చేతి అచ్చును వేయిస్తారు.

ఇక నాటి నుంచి వాళ్ల తుది శ్వాస వరకు ఆ విద్యార్థి తన చుట్టు ఉన్న పరిసరాలు స్వచ్ఛంగా, పచ్చగా ఉంచడడమే కాదు ఇతరులతోనూ ఆ పనిచేయిస్తూ.. దానిమీద చైతన్యం కలిగిస్తూ ఉండాలి. ఇదీ స్వచ్ఛభారత్ ప్లెడ్జ్‌థాన్ ఉద్దేశం. నో ప్లాస్టిక్ కూడా అందులో భాగం. ఈ ప్రతిజ్ఞ తీసుకున్న పిల్లలంతా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ  తమ పరిసరాల్లో ఎక్కడైనా పాలిథిన్ కవర్లు కనిపిస్తే  వాటిని తీసుకొచ్చి తమ స్కూల్ డస్ట్‌బిన్‌లో వేయాలి. అలాగే చెత్తను అంటే ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఇలా వేటికవే వేరు చేసి ఆయా వ్యర్థాలకు కేటాయించిన చెత్త డబ్బాల్లో పడేయాలి. అవి నిండాకా రీసైక్లింగ్‌కి ఉపయోగపడేవాటిని రీసైక్లింగ్‌కి పంపాలి. అయితే ప్లెడ్జ్ తీసుకోగానే పని అయిపోదు. ఆ ప్రతిజ్ఞ తీసుకున్న పిల్లలు మిగిలిన స్కూల్ పిల్లలతో కలిసి ప్లెడ్జ్‌థాన్ చేయాలి. ఇది నిరంతం సాగుతుంది. వాలంటీర్స్ ఈ పనిమీద ఉంటారు. వందమందికి పైగా వాలంటీర్స్ స్వచ్ఛభారత్ ప్లెడ్జ్‌థాన్‌కోసం పనిచేస్తున్నారు.
 
రల్డ్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్
ఇప్పటిదాకా తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్.. అయిదు రాష్ట్రాల్లో  8 వేల మంది విద్యార్థులు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇంకా చాలా రాష్ట్రాల నుంచి స్పందన వస్తోంది. ‘ఈ ప్లెడ్జ్‌కి కావల్సిన మెటీరియల్ అంటే రుమాళ్లు వంటివన్నీ మేమే సప్లయ్ చేస్తాం. రానున్న మూడేళ్లలో 1,67,77,216 మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ఆ రుమాళ్లన్నింటినీ కలిపి ఫ్రాక్టల్ థియరీ ప్యాటర్న్‌లా చేసి.. దాన్ని ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో పెట్టడం లక్ష్యం. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాం. వారానికి ఒక స్కూల్ నుంచి వాలంటీర్స్ వచ్చి సందర్శకులకు దాని ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని వివరిస్తున్నారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, తొలి క్యాంపెయిన్. ఇప్పటికే మేం గిన్నిస్ బుక్ రికార్డ్స్ దాటేశాం. అయితే ఇంత పెద్ద ప్లెడ్జ్ ప్యాటర్న్ నేషనల్ మ్యూజియంలో పెట్టడం సాధ్యం కాదు కాబట్టి అందులో కొంత భాగాన్నే  మ్యూజియంలో ఉంచి మిగిలిన వాటిని చిన్న చిన్న భాగాలుగా చేసి ఆయారాష్ట్రాల మ్యూజియాలకు పంపిస్తాం. కానీ వాళ్ల వాళ్ల రాష్ట్రాలకు కాకుండా.. తెలంగాణది జమ్మూకి, తమిళనాడుది ఉత్తరప్రదేశ్‌కి ఇలా.. ఒక రాష్ట్రంది ఇంకో రాష్ట్రానికి పంపాలని అనుకుంటున్నాం.. జాతీయ సమైక్యతకు స్ఫూర్తిగా’ అంటారు వంశీధర్.

ఈ ప్రాజెక్ట్ అయ్యాక ఇలా గణితాన్ని సామాజిక బాధ్యతకు జతచేస్తూ ఇంకా అనేక సోషల్ క్యాంపెయిన్స్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుకూడా చెప్తారు. ఇదీ.. వంశీధర్ స్వచ్ఛభారత్ ప్లెడ్జ్‌థాన్! ఇందులో పాల్గొనాలనుకునే స్కూళ్లు, కాలేజీలు vamsi.k@schoolofmathematics.in కి సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు