'విషాదకర ప్రకటనకు వారే సాక్షులు'

4 Oct, 2013 09:58 IST|Sakshi

సీమాంద్ర చరిత్రలో ఓ విషాదకర ప్రకటనకు వారు సాక్షులుగా మిగిలిపోయారు. తెలంగాణ నోట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపే సందర్భంగా జరిగిన చర్చలోనూ పాల్గొన్నారు. కానీ తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం చెప్పకుండా ఆపలేకపోయారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర క్యాబినెట్‌లో ఉన్నారు. వారే కావూరి సాంబశివరావు, పల్లంరాజు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరి సాక్షిగానే తెలంగాణపై కేబినెట్ నోట్ కు ఆమోద ముద్ర పడిపోయింది.

సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా... సమైక్యవాదులు రాజీనామాలు చేయండంటూ ఎంత డిమాండ్‌ చేసినా రాజీనామాలతో ఏం లాభం. పదవుల్లోనే ఉండి ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటామంటూ ఎన్నో ప్రకటనలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టనివ్వమన్నారు. ఎంతమంది రాజీనామాలు చేయమన్నా పదవులను పట్టుకుని వేలాడారు. కానీ చివరికి జరిగిందేంటీ..?

కేంద్ర కేబినెట్‌ భేటీలో తెలంగాణ నోట్‌పై సాగిన చర్చలో కావూరి, పల్లంరాజులు పాల్గొన్నారు. నోట్‌ను వ్యతిరేకించలేక, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రమంత్రి మండలి ముందు ఉంచడంలో ఘోరాతిఘోరంగా విఫలమయ్యారు. అధిష్టానం ఆదేశాలతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. విభజన పాపాన్ని మూటగట్టుకున్నారు. తెలంగాణ నోట్పై కేబినెట్ నిర్ణయం తీసుకోవటంతో .....ఇక ప్రజలు తమమీద తిరగబడతారనుకున్నారో ఏమో మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.

భేటీ తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగలేమని చెప్పారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని ప్రధాని నచ్చజెప్పారు. దీంతో రాజీనామాలపై వారెలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు ఈరోజు తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మరిన్ని వార్తలు