కెసెండ్రా మాట ఎవరు వింటారు?

23 Mar, 2015 22:56 IST|Sakshi
కెసెండ్రా మాట ఎవరు వింటారు?

నీరు జీవితం!  చెట్టు చేమకు సమస్త ప్రాణికోటికి నదులు, ఇతర నీటి వనరులే జీవనాధారం!  కాబట్టే నగరాలు నదీతీరాల వెంట వెలిశాయి. టైగ్రిస్, నైలు, సింధు నదీతీరాల్లో నాగరికతలు నవనవలాడాయి. నదుల నడక మారిన కారణంగా, నదుల్లో జలరాశులు హరించుకుపోయిన కారణంగా చారిత్రక నగరాలు అంతరించిపోయిన దాఖలాలున్నాయి. మొన్న ఆదివారం వరల్డ్ వాటర్ డే చేసుకున్నాం! నీరు చరిత్రలోకి ప్రవహించక ముందే ఓసారి నీటిని స్మరించుకుందాం!
 
భూగోళం బాస్కెట్‌బాల్ సైజులో ఉంటే మంచినీటి గోళం పింగ్‌పాంగ్  బంతి సైజులో ఉంటుంది. భూగోళాన్ని ఆక్రమించిన 70 శాతం నీటిలో మంచి నీరు ‘గరిటెడే’!  భూమి ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకూ మనిషికి అవసరమైన మంచి నీటి పరిణామంలో మార్పు లేదు! నీటి నిలువల్లోనే మార్పులు. సాంప్రదాయక పద్ధతుల్లోని నీటి నిలువలను మనుషులమైన మనం మార్పునకు గురిచేస్తున్నాం! నదుల సహజ ప్రవాహాన్ని అరికట్టి కృత్రిమ జలాశయాలను ఏర్పరుస్తున్నాం. సహజనీటి వనరుల చుట్టూ పరిశ్రమలు, నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. ఒక కారు తయారీకి పెద్ద స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో మంచినీరు వాడతాం. మంచినీటి విలువలు లేని ఒక కూల్‌డ్రింక్ కోసం రెండువందల రెట్లు అధికంగా మంచినీరు వాడతాం. మన చేష్టల ఫలితంగా మంచినీటికి నిలువ జాగా లేకపోతోంది! నీటిని నిలువ చేయడంలో ప్రకృతికి తనదైన పద్ధతులున్నాయి. మన పూర్వీకులు వాటిని గౌరవించారు. అధికారిక జలాశయాలు ఏర్పడ్డాక వాటి సరఫరా, నియంత్రణ కేంద్రీకృతం అయ్యింది.  నీటి సరఫరా బ్యూరోక్రసీ విధుల్లో భాగం అయ్యింది.

జలాశయాలు, కాలువల్లో మేటలు (సిల్ట్) ఏర్పడతాయి. వీటిని క్రమానుగతంగా తొలగించాలి. పాలకులు, అధికార గణం వాటిని పట్టించుకోరు. ఫలితంగా నీటి నిలువ సామర్ధ్యం కుంచించుకుపోతోంది! కొత్త కాలనీలు నిర్మించేపుడు, ఇళ్లు నిర్మించే సందర్భాల్లో అప్పటికే ఉన్న మురుగుకాల్వలకు నష్టం కలుగకుండా చేయడం, కొత్తవాటిని ఏర్పరచుకోవడం అనే అంశంలో దారుణమైన అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితం? చినుకు చిటుక్కుమంటే నగరం ముంపునకు గురికావడం అనుభవంలోకి వస్తూనే ఉంది కదా!
 
సేద్యానికి జూదానికి తేడా ఏమిటి?


వీటికి తోడు భూతాపపు పెరుగుదల వాతావరణంపై విపరీత ప్రతికూలతను చూపుతోంది. వానలు వెర్రెత్తుతున్నాయి. రుతువులకూ వానలకూ సంబంధం లేకుండా పోతోంది. ఈ నెలలో ఈ కార్తెలో వానలు వస్తాయి అనే శతాబ్దాల లెక్కలు తల్లకిందులు కావడంతో నీటి నిలువలపైనా ఆ ప్రభావం పడుతోంది. ‘వానాకాలం పంట’ అనే నానుడికీ కాలం చెల్లుతోంది. భారతీయ వ్యవసాయం జూదప్రాయంగా మారుతోంది. జూదశాల (క్యాసినో)కు వ్యవసాయానికీ తేడా ఏమిటి? క్యాసినో ఎప్పుడు తెరుస్తారో తెలుస్తుంది. మనమెంత నష్టపోతామో తెలుస్తుంది. వ్యవసాయ జూదం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ముగింపు ఎప్పడూ సుఖాంతం కాదు కదా! ప్రాణాంతకంగా కూడా మారుతోంది.
 
నీటి కంటె చమురు చౌక

గతంలో ఎప్పుడూ వినని ‘నీటి కరువు’ అనే పరిస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కెసెండ్రా గుర్తుంది కదా? ట్రాయ్ రాజు ప్రియం కూతురు కెసెండ్రా.  ఆమె అందానికి అబ్బురపడ్డ అపోలో దేవుడు ఆమెకు జరగబోయే సంఘటనలను సవివరంగా చెప్పగల వరాన్ని ఇస్తాడు. కానుకకు కొనసాగింపుగా ఆమెతో సంగమాన్ని కోరతాడు.  కెసెండ్రా అంగీకరించదు. అపోలో కోపితుడవుతాడు. ఆమె చెప్పే భవిష్యవాణిని ఎవ్వరూ నమ్మకుందురు గాక అని శపిస్తాడు. ఆధునిక కెసెండ్రాలు నీటి విషయంలో భవిష్యవాణిని చెబుతూనే ఉంటారు. ఎవరు నమ్ముతారు? వచ్చే ఐదేళ్లలో మంచినీటికి విపరీత కరువు వస్తుందని 2050 నాటికి శాశ్వత కరువు ఏర్పడుతుందని కెసెండ్రాలు సెలవిస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు చమురు కోసం కాదు నీటికోసమే జరుగుతాయి అనే జోస్యాన్ని నమ్మాల్సి వస్తోంది. కడవ నీటికోసం పల్లెతల్లులు పదిమైళ్లు నడవడం కంటిముందు కనిపిస్తున్న వాస్తవమే కదా! నదీప్రవాహాలను పంచుకుంటున్న కర్ణాటక-తమిళనాడు మధ్య అంతర్యుద్ధం ఏర్పడ్డ పరిస్థితులను చూశాం కదా! తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు-పొగలు కన్పిస్తున్నాయి. పోలీసులు పోలీసులపై లాఠీచార్జ్ చేసిన వైనానికి కారణం ఇరురాష్ట్రాల నీటి అవసరాలే కదా!
 
ఆ దండ కట్టలేం!

‘చెంగ’ అనే పంజాబీ పదానికి అర్థం మంచి, చక్కని, అందమైన.. ఇలాంటి పేర్లున్నాయి. భారతదేశానికి నదులతో ఒక చెంగల్వ దండ వేద్దామనుకున్నారు దివంగత ఇంజనీర్ కె.ఎల్.రావు. ఆయన నెహ్రూ కేబినెట్‌లో ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేశారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు నీటి చుక్కకు తపిస్తోంటే కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడం గురించి రావుగారి ఇంజనీరింగ్ హృదయం కలత చెందింది! ఈ దుస్థితి తొలగాలంటే ఏంచెయ్యాలి..?  నదులను కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ ‘గార్లెండ్ ప్రాజెక్ట్’ను సూచించారు. దశాబ్దాల క్రితపు ఖరీదైన ఆ కల ఇప్పటికీ ఆచరణలోకి అడుగువేయలేదు. ఒక వేళ అమలు చేయాలనుకుంటే గార్లెండ్ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చవుతుంది? పదేళ్ల క్రితం అంచనా ప్రకారం 5,60,000 కోట్ల రూపాయలు! ఆర్థిక కారణాలొక్కటే ఈ ప్రాజెక్ట్ అమలుకు అడ్డంకి కాదు. రాష్ట్రాల భిన్న ధోరణులు కూడా! ‘ నా జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టదు’ అని ప్లానింగ్ కమిషన్ సభ్యులొకరు ఇటీవల నిర్వేదం చెందారు. అతడిని నిరాశావాదని అందామా..!!
 ప్రజెంటేషన్:
 పున్నా కృష్ణమూర్తి

మరిన్ని వార్తలు