క్రౌంచాసనాన్ని నాలుగు రకాలుగా సాధన చేస్తారు

2 Jul, 2013 03:28 IST|Sakshi
క్రౌంచాసనాన్ని నాలుగు రకాలుగా సాధన చేస్తారు
 క్రౌంచాసనాన్ని నాలుగు రకాలుగా సాధన చేస్తారు. వాటిలో ఇప్పుడు మనం చూపిస్తున్న విధానం ఒకటి. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం క్రౌంచ పక్షి ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని క్రౌంచాసనం అంటారు.
 
 ఎలా చేయాలి!
 రెండు కాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి. 
 
 ఎడమకాలిని మోకాలి దగ్గర మడిచి ఎడమ పిరుదు పక్కన ఉంచాలి.
 
 శ్వాస తీసుకుని రెండు చేతులతో కుడికాలిని పట్టుకుని వీలైనంత వరకు నిటారుగా పైకి లేపాలి. ఈ స్థితిలో మోకాలిని వంచకుండా(ఫొటోలో చూపినట్లుగా) గడ్డాన్ని మోకాలికి తాకించాలి.
 
 ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ కాలితోనూ చేయాలి. ఇలా రోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 తొడల మీద ఉన్న కొవ్వు కరిగిపోతుంది. కాళ్లకు బలం వస్తుంది. 
 
 వీపు దిగువ భాగం, పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి.
 
 గ్యాస్ట్రిక్ సమస్య, అజీర్తి, మలబద్దకం తొలగిపోతాయి.
 
 బీజకోశం, గర్భకోశాలకు శక్తి చేకూరుతుంది. రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.
 
 ఏకాగ్రత పెరుగుతుంది, భుజాలకు బలం వస్తుంది.
 
 జాగ్రత్తలు...
 మోకాళ్ల నొప్పులు, స్పాండిలోసిస్  ఉన్న వాళ్లు గురువు పర్యవేక్షణలో చేయాలి.
 
 రుతుక్రమ సమయంలో చేయకూడదు.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, 
 నేషనల్ యోగా చాంపియన్
 
మరిన్ని వార్తలు