నవమల్లిక

8 Jan, 2015 23:57 IST|Sakshi
నవమల్లిక

మల్లికా సారభాయ్.. కూచిపూడికి, భరతనాట్యానికి కేరాఫే కాదు స్వతంత్రతకు ప్రతీక! కళను పోరాట సాధనంగా మలచుకున్న ఆర్టిస్ట్! భయమెరుగని గళానికి భౌతిక రూపంలా కనిపించే ఆమె కళాకృతి నిర్వహిస్తున్న కృష్ణాకృతి ఆర్ట్ ఫెస్టివల్‌లో నృత్యప్రదర్శన ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లిక మనసులోని మాటలు కొన్ని..
 ..:: సరస్వతి రమ
 
నా చిన్నప్పుడు మా అమ్మ (మృణాళిని సారభాయ్)లో చాలామంది గ్లామర్ చూస్తే.. నేను ఆమె హార్డ్‌వర్క్ చూసేదాన్ని. ఆ కష్టాన్ని చూసే జీవితంలో డ్యాన్సర్ కావొద్దు అనుకున్నాను. అమ్మ ఒత్తిడి చేయడంతో ‘దర్పణ’ ఇన్‌స్టిట్యూట్‌లో డ్యాన్స్ నేర్చుకోక తప్పలేదు. డ్యాన్సర్ కావొద్దని అనుకుని థియేటర్‌లో జాయిన్ అయ్యాను. సంగీతం నేర్చుకున్నాను. ఎంబీఏ చేశాను. ఎకనామిస్ట్ అయ్యాను. అన్నీ తిరిగాక హఠాత్తుగా ఓ డిప్రెషన్ ఆవహించింది. నాకేం కావాలి? నేనేం చేస్తున్నాను? అనే మథన. అప్పుడు మనసు తన మాట వినిపించింది నీ లక్ష్యం నాట్యమే.. నువ్వు డ్యాన్సరే కావాలి అని. అలా మళ్లీ డ్యాన్స్ దగ్గర ఆగాను.

అవుట్ స్పోకెన్

నా చిన్నప్పుడు అమ్మ తన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఎప్పుడూ టూర్లు వెళ్లేది. నాన్నా (విక్రమ్ సారభాయ్) సైంటిస్ట్‌గా బిజీ. ఇంట్లో నేను, తమ్ముడు (కార్తికేయ) ఉండేవాళ్లం. ఇలా కాదని నాన్న ఓ నియమం పెట్టాడు. మాకు పన్నెండేళ్లు వచ్చేవరకు తనో, అమ్మో ఇద్దరిలో ఎవరన్నా విధిగా మాతో ఉండేట్టు. సో.. అమ్మకెప్పుడూ ప్రోగ్రామ్స్ ఉండేవి కాబట్టి నాన్న మాతో ఉండేవాడు. అప్పుడే నాన్న ‘సమాజం చెప్పినట్టు నడుచుకునే వాళ్లుంటారు. నేనూ, మీ అమ్మ.. అలాంటి వాళ్లకు భిన్నం. మాకు నిజమనిపించిందే మేం చేస్తాం. కానీ మాలాంటి వాళ్లను సమాజం మెచ్చదు. నువ్వే నిర్ణయించుకో.. సమాజం చెప్పినట్టు వినాలా లేక.. నీకంటూ ఓ పంథానేర్పర్చుకోవాలా అని’ అన్నారు. నాలుగు రోజుల తర్వాత నాన్న దగ్గరకు వెళ్లి చెప్పాను.. ‘నాకంటూ ఓ పంథా ఏర్పరచుకుంటాను’ అని. నాటి నుంచి నాకు సత్యమనిపించిందే చేస్తున్నాను. దీనివల్ల చాలా ఎదురుదెబ్బలు తిన్నాను. అయినా మారలేదు. ఇదే విలువలను నా పిల్లలకూ నేర్పాను.
 
స్వతంత్ర మనుషులు లేరు..

ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కేవలం స్త్రీలే పొందట్లేదు అంటున్నారు. కాని అవి పురుషులకూ లేవంటున్నాన్నేను. పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఇంటర్ పూర్తయ్యాక ‘తనకు నచ్చింది చదివే స్వేచ్ఛతో ఉన్నాడా ? తన అభిరుచిని ఆస్వాదించుకునే స్వాతంత్య్రాన్ని పొందుతున్నాడా? లేడు. ఇక్కడ ఆడవాళ్లం కనీసం ఒక పంజరంలో ఉన్నాం.. మనకు స్వేచ్ఛకావాలి అన్న జ్ఞానంతోఅయినా ఉన్నారు. కానీ పురుషుడికి ఆ జ్ఞానం కూడా లేదు. పంజరంలో ఉండి కూడా స్వేచ్ఛగా ఉన్నాననే భ్రమల్లో బతుకుతన్నాడు.
 
కళ.. భాష

సమాజంలో లింగ వివక్షను రూపుమాపడానికి  కళను భావప్రకటన భాషగా మార్చి 30 ఏళ్లుగా పోరాడుతున్నాను. మా ప్రదర్శనల ద్వారా ప్రతి తల్లికి, అత్తకి చెప్తున్నాం.. వాళ్ల వాళ్ల కూతుళ్లను, కోడళ్లను స్త్రీలుగా కాకుండా మనుషులుగా  చూడమని. గౌరవించమని. దర్పణలో ట్రైన్ అయ్యే ప్రతి అబ్బాయికి స్త్రీని సాటి మనిషిగా గౌరవించాలనే స్పృహను  కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
 
హైదరాబాద్‌తో..

నా మీద ఈ నగరం ఇన్‌ఫ్లుయెన్స్ చాలా గొప్పది. నా కూచిపూడి గురువు సీఆర్ ఆచార్యులు హైదరాబాదీ అయినా.. అహ్మదాబాద్‌లో స్థిరపడ్డారు.  ఆయనను మేం మాస్టర్జీ అనేవాళ్లం. మా అమ్మ టూర్స్‌కి వెళ్లినప్పుడు నన్ను, తమ్ముడిని మాస్టర్జీ ఇంట్లో ఉంచేది. ఆయన మెదడు కంప్యూటర్ కన్నా చురుకైంది. ఆయన వరకట్నాన్ని, స్త్రీ మీద జరుగుతున్న హింసను చాలా వ్యతిరే కించేవాడు. మా ఇద్దరి కోసం ఆయన బ్రౌన్‌కలర్ పేపర్‌తో పెద్ద ఆల్బం ఒకటి తయారు చేశారు. దాంట్లో ప్రతి పౌరాణిక క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఉండేది. ఆ క్యారెక్టర్స్‌కు కాంటెంపరరీ సిట్యుయేషన్‌ను జోడించి మాకు కథలు చెప్పేవారు. వాలి క్యారెక్టర్‌తో పర్యావరణాన్ని బోధించేవారు.

ఏకపాత్రాభినయం, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నిటిని అన్ని రూపాల్లో చేసి చూపించేవారు. మాకది త్రీడీ ప్రెజెంటేషన్‌లా ఉండేది. అది మాకు లాజికల్ థింకింగ్ నేర్పింది. ఆయన కూచిపూడికున్న ఫోక్ ఎలిమెంట్‌ను కాపాడారు. నా కూచిపూడి డ్యాన్స్‌లో కూడా అదే ఉంటుంది. ఇదంతా హైదరాబాద్ మాస్టర్జీ ఇచ్చిన విద్య. అంటే ఇన్‌డెరైక్ట్‌గా హైదరాబాద్ ఇన్‌ఫ్లుయెన్సే కదా. నాకు హైదరాబాదీల మీద ఓ కంప్లయింట్ కూడా ఉంది (నవ్వుతూ). ఈ ఊరిని ఎంతగానో ప్రేమించే నన్ను ఓ నాలుగేళ్లుగా ఇక్కడివాళ్లు మరచిపోయారు. పిలవట్లేదు. తేల్చుకోవాలి ఎందుకో (నవ్వుతూ)!
 

మరిన్ని వార్తలు