లైఫ్ ఈజ్ ప్లే

26 Mar, 2015 23:44 IST|Sakshi
లైఫ్ ఈజ్ ప్లే

ఆసక్తి లేకపోవడమో, ఆకట్టుకునేలా ఉండకపోవడమో.. మొత్తానికి కొద్దిమందికే పరిమితమైంది థియేటర్. ఈ కళను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే కాదు.. ప్రభుత్వాలపైనా ఉందంటున్నారు ప్రొఫెసర్ అనంతకృష్ణన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్స్ ఆర్ట్స్ డీన్‌గా పనిచేస్తున్న ఆయన ప్రేక్షకులను థియేటర్స్ వరకూ రప్పించాల్సిన బాధ్యత మాత్రం నాటకకర్తలదేనని చెబుతున్నారు. ‘వరల్డ్ థియేటర్ డే’ సందర్భంగా ఆయనతో సిటీప్లస్ సంభాషణ..
 ..:: ఓ మధు
 
ఎన్ని రకాల మీడియాలు వచ్చినా థియేటర్‌కుండే ప్రాముఖ్యత ఉంటుంది. ఇది లైవ్ ఆర్ట్. లైవ్ పర్‌ఫార్మెన్స్, లైవ్ ఆడియెన్స్ ఉంటారు. 1940, 50లలో వర్ధిల్లిన ఈ ఆర్ట్ ఫామ్స్ నేడు తెరమరుగవుతున్నాయి. ఈ దురవస్థ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతియావత్తు ఉన్న సమస్య. వీటిపై ఫోకస్ చాలా తక్కువ. ఈ లైవ్ ఆర్ట్‌ని ఇప్పుడున్న సిస్టమ్స్ సపోర్ట్ చెయ్యట్లేదు.

ఒకప్పుడు జాతీయ స్థాయి నాటక అవార్డులు అందుకున్న వారంతా తెలుగువారే. ఇప్పడు ఒక ఆర్టిస్ట్ ఆ రంగాన్ని నమ్ముకుని జీవితం వెళ్లదీసుకునే అవకాశాల్లేవు. ఈ కళ సంరక్షణకు ఏ పథకమూ లేదు. అయితే మంచి నాటకాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. మతానికి, ప్రాంతానికి, గుళ్లకు అనుబంధంగా ఉన్న కొన్ని సంప్రదాయక కళలు, చిందు భాగవతం లాంటి జానపద కళారూపాలకు నేటికీ ప్రేక్షకాదరణ ఉంది.
 
కల్చరల్ పాలసీ కావాలి..
మహారాష్ట్రలో లైవ్ ఆర్ట్‌కి నేటికీ మంచి ఆదరణ ఉంది. జాడిపట్టిలో 10 కి.మీ పరిధిలో ఉన్న వేర్వేరు థియేటర్స్‌లో రోజుకి 40 వేల మంది నాటకాలు చూడ్డానికి వెళ్తుంటారు. చెన్నైలోని తెలుగు పరిషత్‌లు, థియేటర్లకు నేటికీ ఆదరణ ఉంది. విదేశాలలో ఆర్ట్ అండ్ కల్చర్‌కి ప్రాముఖ్యతనిస్తారు. అక్కడి కల్చరల్ పాలసీలు అలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి కల్చరల్ పాలసీలు మన దగ్గరా రావాలి. ఇక సినిమా కోసం రూ.100 ఖర్చు పెట్టే వాళ్లు.. నాటకానికి రూ.50 పెట్టాలన్నా ఆలోచిస్తారు. అదే లండన్‌లోనైతే డ్రామా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతాయి. దీనికి థియేటర్ వాళ్లూ కొంత బాధ్యత వహించాలి. పెట్టిన డబ్బుకు మినిమం వినోదం అందించటం బాధ్యతగా భావించాలి.
 
డిజిటల్ థియేటర్..
ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను, జీవనశైలుల్ని అడాప్ట్ చేసుకుంటున్న మోడరన్ ఆర్ట్‌కి ఎప్పటికైనా మనుగడ ఉంటుంది. ఒకప్పటి దీపాల నుంచి లైటింగ్‌కి, సినోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఇంకా చాలా మార్పులొచ్చాయి. డిజిటల్ మీడియా.. థియేటర్ మీదా ప్రభావం చూపుతోంది. డిజిటల్ థియేటర్ ఇన్ డిజిటల్ ఏజ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టాం. లైవ్ ఆర్ట్‌లో మిస్ అయ్యే అవకాశం ఉన్న వాటిని డిజిటల్‌లో చూపించే ఆస్కారం ఎక్కువ. లైవ్ ఆర్టిస్ట్ మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్ స్టేజ్ మీద కనిపించదు. దానిని డిజిటల్ ద్వారా లైవ్ ప్రొజెక్ట్ చెయ్యవచ్చు.
 
ఉపాధి..
ప్రస్తుతం చాలా స్కూల్స్, కాలేజెస్ థియేటర్‌ని తమ కరిక్యులంలో భాగంగా చేసుకున్నాయి. అలాంటి స్కూల్స్, కాలేజీల్లో ఇక్కడ చదివిన విద్యార్థులు 25 నుంచి 30 వేల జీతంతో జాబ్స్ సంపాదించుకున్నారు. నాటకం వినోదం మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ ఉపకరిస్తుంది. ప్రస్తుతం అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల మనిషి ఏకాకి అవుతున్నాడు. డ్రామా గ్రూప్ యాక్టివిటీ కావటం వల్ల అందరితో కలిసే చాన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్, కాన్సన్‌ట్రేషన్ పెరుగుతాయి. కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.

మరిన్ని వార్తలు