లైట్ 4 క్రికెట్

2 Jan, 2015 00:33 IST|Sakshi
లైట్ 4 క్రికెట్

సిటీకి చెందిన ఏడీపీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓ యువకుడికి క్రికెట్ కిట్ కొనిచ్చింది. నగరంలోని సాయి జానియర్ కాలేజ్ మరో కుర్రాడికి ప్రయాణపు ఖర్చులు అందివ్వడమే కాకుండా పాస్‌పోర్ట్ సైతం సిద్ధం చేసి ఇచ్చింది. ఇంకో అబ్బాయికి అవసరమైన సాయాన్ని ఐ అండ్ ఐ అనే ఎన్‌జీఓ సమకూర్చగా, మరో యంగ్‌స్టర్‌కి కిరణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేయూతని అందించాడు. ఆ సాయం చేసిన వారికి అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఆ నలుగురు కుర్రాళ్లూ సాధించిన విజయం మాత్రం ఆషామాషీ కాదు. అవును మరి ఆ విజయం పేరు బై ్లండ్ క్రికెట్‌లో వరల్డ్‌కప్.
 -ఎస్.సత్యబాబు  
 
చూపులేనివాళ్లూ క్రికెట్ ఆడతారు. దేశానికి పేరు తెస్తారు. కొన్నాళ్ల కిందటే సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్‌కప్ జరిగింది. అందులో మనవాళ్లు కప్ గెలిచారు. అదీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ మీద. అంతటి ఘన విజయాన్ని మనకు దక్కించిన క్రికెట్ వీరుల్లో నలుగురు మన తెలుగోళ్లే. వరల్డ్‌కప్ విజయం తర్వాత ఇటీవల స్వస్థలాలకు వెళుతూ హైదరాబాద్‌లో ఆగిన వీరిని సిటీప్లస్ పలకరించింది. కంటి చూపు లోపానికి దుర్భర దారిద్య్రం తోడైనా.. వెలుగు బాటలు పరచుకుంటూన్న ఈ క్రీడారత్నాలు తమ అనుభవాలను ఇలా వివరించారు.
 
 వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌ని..
మాది గుంటూరు జిల్లా, మాచర్ల. నాన్నది వ్యవసాయం. నాలుగేళ్ల వయసులో తలుపు గొళ్లెం తగిలి ఒక కన్ను పోయింది. వయసు పెరిగేకొద్దీ ఇన్‌ఫెక్షన్ కారణంగా రెండో కంటి చూపు మందగించింది.  నరసరావుపేట షిఫ్టయ్యాక నాన్న ఇడ్లీ, దోసె అమ్మి మమ్మల్ని పోషించారు. స్కూల్‌డేస్‌లో క్రికెట్ ఆడేవాడ్ని.  పదో తరగతిలో ఉండగా ఏపీ టీమ్‌కి.. అలా ఇండియన్ టీమ్‌కి కూడా వైస్ కెప్టెన్ అయ్యాను. ఇంటర్ చదువు, క్రికెట్ హైదరాబాద్‌కి రప్పించాయి. నిజాం కాలేజ్‌లో బీఏ ఆర్ట్స్ పూర్తి చేశాను. ఆల్‌రౌండర్‌ని. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌ని. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో కెరీర్ బెస్ట్ స్కోరు 94 బంతుల్లో 158 రన్స్ చేశాను.
 
 2008 దాకా మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. మా బ్రదర్ ఆంజనేయరెడ్డి ఎస్సై అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. జనరల్ కోటాలోనే 2011లో ఎస్‌బీహెచ్‌లో క్లర్క్‌పోస్ట్‌కు సెలక్టయ్యా. కొంత నా స్పోర్ట్స్ నేపథ్యం కూడా ఉపయోగపడింది. ఆర్థిక సమస్యలు తీరడంతో క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాను. ప్రాక్టీస్‌లో కాళ్లు ఫ్రాక్చర్స్ అయ్యాయి. పళ్లు విరిగాయి. చాలా సార్లు దెబ్బలు తగిలాయి. అయినా పట్టు విడవలేదు. ఈ కష్టాలన్నీ మరపించిందీ వరల్డ్ కప్ విజయం. తొలిసారి స్పోర్ట్స్ మినిస్ట్రీ రూ.5 లక్షలు ఇచ్చింది. అలాగే ప్రధాని మోదీ మాతో అరగంట గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.            
 - అజయ్‌కుమార్‌రెడ్డి
 
వైజాగ్ టు వరల్డ్‌కప్
మాది శ్రీకాకుళం జిల్లా. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురం. నాన్న వ్యవసాయకూలీ. అమ్మ ఇంట్లో ఉండేది. తమ్ముడు వెల్డింగ్ లేబర్. ఐదేళ్లున్నప్పుడు కుడి కన్నుకు క్రికెట్ బాల్ తగిలింది. రక్తం రాలేదు చిన్నదెబ్బే అనుకుంటే మళ్లీ అక్కడే తగిలింది. ఒక నెలలోనే చూపు పూర్తిగా పోయింది. అంతేకాకుండా ఎడమ కంటికి ఇన్‌ఫెక్షన్ సోకింది. విశాఖపట్నంలోని మోడల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో పదో తరగతి వరకూ చదివాను. అక్కడే క్రికెట్ కంటిన్యూ చేశాను. టెన్త్‌క్లాస్‌లో స్కూల్ కెప్టెనయ్యా. విశాఖపట్నం నుంచి  వైజాగ్ చాలెంజర్స్ టీమ్‌కు సారథిగా స్థానిక క్రికెట్ పోటీ ల్లో పాల్గొన్నాను.

ఆ తర్వాత స్టేట్ టీమ్‌లో తీసుకున్నారు. 2011 నవంబర్‌లోఇండియన్ క్రికెట్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాను. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను అందుకున్న టీమ్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికీ నాకు సరైన ఉద్యోగం లేదు. జిల్లా కలెక్టర్‌ను కలిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించారు. రూ.4,500 జీతం. టోర్నమెంట్స్‌కి వెళితే అందులోనూ కోత. తమ్ముడికి హెల్త్ బాగోలేదు. నాన్న వెల్డింగ్ పని మీద ఇతర దేశాలు వెళ్లారు.హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ సాయంతో క్రికెట్‌ను కొనసాగించగలిగాను. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోదగ్గ ఆర్థిక సాయం చేసింది. మంచి జాబ్ వస్తే లైఫ్‌లో కొంత తేరుకుంటాను.  
 - వెంకట్
 
యంగెస్ట్.. ఫీల్డింగ్‌లో బెస్ట్..
మాది శ్రీకాకుళం జిల్లా కొప్పరవలస. చిన్నప్పుడే నాన్న చనిపోతే... అమ్మ రెక్కల కష్టం మీద నన్ను, తమ్ముడ్ని పెంచింది. నా చిన్నప్పుడు ఏదో కర్రపుల్ల తగిలి కుడి కంటి చూపు దెబ్బతింది. సరిగా గమనించకపోవడంతో.. ఎడమ కంటికీ ఇన్‌ఫెక్షన్ సోకింది. పదో తరగతి వరకు బొబ్బిలిలోని బ్లైండ్ స్కూల్‌లో చదివా. తర్వాత హైదరాబాద్‌లోని సాయి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్‌లో చేరా. 2011 నుంచి క్రికెట్ ఆడుతున్నాను. 2013లో తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడి, వెంటనే ఇండియన్ టీమ్‌కి సెలక్టయ్యా. ప్రస్తుతం వరల్డ్‌కప్ ఆడిన టీమ్‌లో నేనే యంగెస్ట్. నా ఫీల్డింగ్‌కు మంచి పేరుంది. ఏడుగురిని రన్ అవుట్ చేశాను. 4 క్యాచ్‌లు పట్టాను. పేదరికంలో ఉన్న నాకు  పాస్‌పోర్ట్ వర్క్, రాకపోకల ఖర్చులు అంతా మా కాలేజ్ వాళ్లే చూసుకున్నారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరి బాగా ప్రోత్సహిస్తున్నారు. మాకు ఉపాధి పరంగా సరైన ఆసరా లభిస్తే  క్రికెట్‌లో మరింతగా సత్తా చాటుతా.
 - దుర్గారావు
 
 ఆల్‌రౌండర్‌ని..
 మాది నల్లగొండ జిల్లా మల్లాపురం గ్రామం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ హైదరాబాద్‌లోని చంపాపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు రూ.2 వేల జీతం. ఊర్లో ఉండగా, ఏడెనిమిదేళ్ల వయసనుకుంటా.. బాణం పుల్ల కుడికన్ను లోపల గుచ్చుకుంది. హైదరాబాద్ సరోజని కంటి ఆస్పత్రిలో చూపించినా చూపు దక్కలేదు. ఎడమ కంటి చూపు 40 శాతం దెబ్బతింది. దారుల్ షిఫా బాయ్స్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో టెన్త్ దాకా చదివా. క్రికెట్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఆడి, 2008లో సౌత్‌జోన్‌కు సెలక్టయ్యాను. ఆ తర్వాత ఇండియన్ టీమ్‌కు సెలక్టయ్యాను.
 
 ఐ ఆండ్ ఐ ఎన్‌జీఓ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చే సింది. డిసెంబర్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించా. ప్రస్తుతం మెహదీపట్నంలోని సాలార్జంగ్ కాలనీలో ఉన్న  హోమ్ ఫర్ ద బ్లైండ్ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఉస్మానియాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేస్తున్నాను. కాల్ సెంటర్‌లో జాబ్ చేసేవాడ్ని. ఇండియన్ టీమ్‌కి సెలక్టయ్యాక లీవ్ ఇవ్వడం కుదరదన్నారని రిజైన్ చేశాను. ప్రస్తుతం జాబ్ కూడా లేదు. నాకు అవసరమైన క్రికెట్ కిట్‌ను బంజారాహిల్స్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏడీపీ కొని ఇచ్చింది. వరల్డ్‌కప్ గెలిచాక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం అందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసరా అందిస్తే మరింతగా క్రికెట్లో రాణించగలనన్న నమ్మకం ఉంది.         
- మధు

మరిన్ని వార్తలు