లిటీల్ స్టార్స్@Five Stars

8 Jan, 2015 18:55 IST|Sakshi
లిటీల్ స్టార్స్@Five Stars

స్టార్ హోటల్‌కు వెళ్లాలని.. పసందైన విందు లాంగించాలనుకునే మధ్య తరగతి మందభాగ్యులెందరో ఉంటారు. కానీ తిన్నాక చుక్కలు కనిపిస్తాయని ఆ సాహసానికి పూనుకోరు. కాస్తో కూస్తో ఉన్నవాళ్లకే ఈ పరిస్థితి ఉంటే..దిక్కూమొక్కూ లేని అనాథల పరిస్థతి ఏమిటి?.. ఐదుతారల హోటల్‌లో వంటకాలెలా ఉంటాయో కూడా ఊహించలేని అనాథలకు ఫైవ్‌స్టార్ రుచులను పరిచయం చేశాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. చవులూరించే భోజనమే కాదు రోజంతా ఆటపాటల తో ఎంగేజ్ చేసి చిన్నారుల మోముల్లో సంతోషం నింపాయి.
 ..:: దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్
 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ, హాస్టల్స్‌లో, అనాథ శరణాలయాల్లో తలదాచుకుంటున్న చిన్నారులకు సరికొత్త ఆనందం పంచాలనుకున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని నలాస్ అప్పాకడాయ్ రెస్టారెంట్ నిర్వాహకులతో కలసి 50 మంది అనాథ పిల్లలను రెస్టారెంట్‌కు ఆహ్వానించి వారికి పసందైన విందు ఇచ్చాయి. అంతేకాదు వినోద కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఈ  కార్యక్రమంలో ఆసరా అనాథాశ్రమం, లాడ్జ్ కీస్ నంబర్ 297, ఈ మర్చంట్ డిజిటల్, స్టార్ ఎన్‌జీవో తదితర సంస్థలు పాల్గొన్నాయి.
 
సందడే సందడి..

పిల్లలందరూ స్టార్ హోటల్‌లోకి అడుగుపెట్టగానే ఘజల్ గాయకుడు ఖాన్ అలీఖాన్ తన పాటలతో అలరించారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచి పెట్టారు. ‘ఈ మర్చంట్’ పేరుతో కంప్యూటర్  వ్యర్థాలతో ఆకర్షణీయంగా పలు ఆకృతుల్లో చేసిన బొమ్మలను పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. భోజనం తర్వాత కొనసాగిన ఆటపాటలు చిన్నారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. మూడుగంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారులంతా సందడిగా గడిపారు.
 
ఎంతో తృప్తినిచ్చింది..

సాధారణంగా రెస్టారెంట్లలో మిగిలిన పదార్థాలను పార్సిల్ చేసి పేదలకు పంచుతాం. కానీ, నేరుగా పిల్లలను ఇక్కడికి పిలిచి విందు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. చెన్నైలోని మా బ్రాంచ్‌లో ఈ పద్ధతిని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభించాం. నగరంలోని ఇతర రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సంతోషం.
 
- గురు, డెరైక్టర్ (సేల్స్) , నలాస్ అప్పాకడాయ్ రెస్టారెంట్

             ఫొటోల కోసం క్లిక్ చేయిండి
 

మరిన్ని వార్తలు