స్ట్రెస్‌ మంచిదే...

8 Nov, 2017 18:36 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఒత్తిడితో ఆరోగ్యం చిత్తవుతుందని పలు సర్వేలు హెచ్చరిస్తుంటే కొద్దిపాటి ఒత్తిడి మానవ ఆరోగ్యానికి మంచిదేనని తాజా పరిశోధన వెల్లడించింది. కొద్దిపాటి స్ట్రెస్‌ శరీరంలో మందకొడితనాన్ని పారదోలుతుందని, వయసుమీరుతున్న కణాలను కాపాడటంతో పాటు వ్యాధుల రిస్క్‌ను జాప్యం చేయడంలో తోడ్పడుతుందని ఈ పరిశోధన పేర్కొంది. ఒత్తిడి కారణంగా మానసిక అలజడి, గుండె జబ్బులు, స్ట్రోక్‌, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు ముంచుకొస్తాయని ఇప్పటివరకూ పలు అథ్యయనాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

తాజా పరిశోధనలో వెలుగుచూసిన అంశాలతో మానవ శరీరంలో కణాల వ్యవస్థకు వయసు మీరడం, వృద్ధాప్య సంబంధ వ్యాధులు ప్రబలడానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకునేందుకు పరిశోధకులు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. వ్యాధులకు దారితీసే కణాలు బలహీనపడకుండా అలాగే కొనసాగించడం, వృద్ధాప్య లక్షణాలను జాప్యం చేయడం దిశగా తమ పరిశోధనలో తేలిన అంశాలు పరిశోధకులు సరికొత్త బాటను చూపుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్‌వెస్ర్టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ మరిమటో చెప్పారు.

ప్రజలను దీర్ఘకాలం జీవించేలా చేసేందుకు ప్రయత్నించడం తమ లక్ష్యం కాదని, మానవ జీవన కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని అందించేందుకు అవసరమైన వ్యవస్థకు రూపకల్పన చేయడమేనని అన్నారు.

మరిన్ని వార్తలు