సాహసవీరుడు.. సాగర యాత్ర

3 Nov, 2014 23:31 IST|Sakshi
సాహసవీరుడు.. సాగర యాత్ర

ఊరి పొలిమేర వరకూ వెళ్లాలంటేనే ఒకరిని వెంటరమ్మంటాం. అదే లాంగ్ ట్రిప్ అయితే.. దోస్తుల మందను వెంటేసుకుపోతాం. అలాంటిది ఒంటరిగా సముద్రయానం అంటే ఎలా ఉంటుంది.అదీ ఒక్క రోజో.. రెండు రోజులో కాదు.. ఏకంగా 151 రోజులు. నాన్‌స్టాప్ జర్నీ. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకంటే కష్టమైన అడ్వెంచర్ ఇంకేదీ ఉండదనిపిస్తుంది. కడలి కెరటాలపై సాగిన ఆ యువకుడి జర్నీ...

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఐదువేల మందికి పైగానే ఉన్నారు. అంతరిక్ష యాత్ర చేసిన వారు 500 మంది వరకూ ఉంటారు. కడలి కెరటాలపై నాన్‌స్టాప్‌గా భూగోళాన్ని చుట్టొచ్చింది మాత్రం 80 మందే. ఇలాంటి క్లిష్టమైన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి భారతీయుడు, సెకండ్ ఏషియన్..  నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టామీ. ప్రభుత్వం ఆయనను కీర్తి చక్ర అవార్డుతో గౌరవించింది. ఇటీవల నగరానికి వచ్చిన అభిలాష్‌ని ‘సిటీప్లస్’ పలకరించింది..

మా నాన్న నేవీలో పని చేసేవారు. అందుకే చిన్నప్పటి నుంచి నేవీ అంటే ఇష్టం. సముద్ర  ప్రయాణాలంటే ఆసక్తి ఉండేది. ఎప్పుడూ సముద్రానికి దగ్గరగా ఉండాలని కోరుకునేవాణ్ని. అందుకే నేవీలో చేరాను. సముద్ర జలాలపై తేలి ఆడుతూ సాగే సెయిలింగ్ గేమ్ అంటే భలే సరదా. సెయిలింగ్  గేమ్‌కు సంబంధించిన పుస్తకాలు చదివేవాణ్ని. నేవీ కాంపిటీషన్స్‌లో చాలాసార్లు పాల్గొన్నాను. అన్ని రకాల బోట్స్ నడిపాను. ఇదే సమయంలో నేవీ అధికారులు నాన్‌స్టాప్ సర్కమ్ నావిగేషన్ ప్రాజెక్ట్ తలపెట్టారు. బోట్‌లో నాన్‌స్టాప్‌గా గ్లోబ్ చుట్టిరావాలి. అదీ ఒంటరిగా. దీని గురించి అనుకున్నప్పుడు వాళ్లు నన్నే మొదట అడిగారు. నా డ్రీమ్ పూర్తి చేసుకునే అవకాశం రావడంతో వెంటనే సరేనన్నాను.
 
ఆమే స్పూర్తి..
గతంలో సర్కమ్ నావిగేషన్ గురించి ఒక మ్యాగజైన్‌లో చదివాను. 1999లో ఆ రేస్ టీమ్‌లో ఈబెల్ అనే ఓ ఫ్రెంచ్ లేడీ ఉన్నారు. ఆమే నాకు స్ఫూర్తి. ఆవిడ చేయగలుగుతున్నప్పుడు నేనెందుకు చేయలేను అని అనిపించింది. నా టూర్‌కు ముందు మలేసియాలో సెయిలింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. 2012 నవంబర్ 1న ముంబైలో నా సముద్రయానం మొదలైంది. దక్షిణం నుంచి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అంట్లాంటిక్ ఓషన్ అలా 40 వేల కిలోమీటర్లు బోట్లో ప్రయాణించాను. 151 రోజుల ప్రయాణం తర్వాత అంటే 2013 మార్చ్ 31న ముంబై చేరుకున్నాను.
 
లంగరుతో పని లేదోయ్..
పూర్తిగా సముద్రం మీదుగా సాగే ఈ యాత్రలో సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ సిద్ధంగా ఉండాలి. మనకు మనమే అన్నీ కావాల్సి ఉంటుంది. వాతావరణం, వంట, ఐటీ, రూట్ మ్యాప్ ఇలా అన్నీ తెలిసుండాలి. మరో మనిషి సాయం నేరుగా అందే అవకాశం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా మానసికంగా బలంగా ఉండాలి. కాస్త డీలా పడ్డా.. ప్రయాణం పెద్ద ప్రమాదంగా మారిపోతుంది. ఆలోచనను పక్కదారి పట్టకుండా చూసుకుంటే ఈజీగా ముందుకెళ్తాం. ఈ ప్రయాణం ఒక్కసారి మొదలైతే డెస్టినేషన్ రీచ్ అయ్యే వర కూ లంగరుతో పని ఉండదు.
 
ఆఫ్టర్ 130 డేస్..
151 రోజుల యాత్రలో.. 130 రోజుల తర్వాత మనిషిని చూడగలిగాను. నా యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి భూమిని చూడటం గొప్ప అనుభూతినిచ్చింది. అట్లాంటిక్ సముద్రంలో తిమింగలాలు వెంటాడాయి. తుఫాన్లంటారా కామన్. మరో 15 రోజుల ప్రయాణం మిగిలి ఉండగా.. బోట్‌లో మంచినీళ్లు డీజిల్ లీకేజీతో తాగడానికి పనికి రాకుండా పోయాయి. వరుణుడి దయతో ఇన్ని నీళ్లు దొరికాయి. ఇవన్నీ ఒంటరిగా ఎలా హ్యాండిల్ చేశానని ఆలోచిస్తే.. సాహసానికి ఇవన్నీ పరీక్షలే కాని అవరోధాలు కాదనిపిస్తుంటుంది.

 ఓ మధు

మరిన్ని వార్తలు