ఈ అనుబంధం ప్రేమ కావ్యం

6 Dec, 2014 14:40 IST|Sakshi
ఈ అనుబంధం ప్రేమ కావ్యం

అనురాగానికి దూరంతో, కాలంతో పనిలేదు. మనసులు కలిస్తే వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రేమ నిండిన అక్షరాలతో అల వోకగా దాటేయవచ్చు. అనురాగం అర్ధశతాబ్ది దాటినా ఇంకా నిన్నటి జ్ఞాపకమంత వెచ్చగా ఉంటుంది. హృదయస్పందనలు పరస్పరం సంభాషించుకుంటే నువ్వు నేను మనం అవుతుంది. అనుభవాల ముచ్చట్లు వెలుగుజాడలవుతాయి. అచ్చంగా ఇలాంటి ఆనందపు అనుభవాల్ని పందిరిగా చేసి ఈ వారం మీ కోసం యూ అండ్ ఐగా సాహితీవేత్త మలయవాసిని... విద్యావేత్త కోలవెన్ను పాండురంగ విఠల్‌మూర్తి ముచ్చట్లు.
- మలయవాసిని, విఠల్‌మూర్తి
 
Marriage is a vowed Transition of fitful and temporary into permanent and eternal love అని రస్కిన్ చెప్పిన మాటలు మన వివాహ వ్యవస్థకు సరిగ్గా సరిపోతాయి అంటారు విఠల్‌మూర్తి. నా మాటే నెగ్గాలి అనే పంతానికి పోకుండా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటే దాంపత్య జీవనం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది అంటారు మలయవాసిని. మలయవాసిని తన మేనమామ కూతురే అని, తమది పెద్దల ఆశీస్సులతో జరిగిన ప్రేమ వివాహమని గుర్తు చేసుకున్నారు విఠల్‌మూర్తి.
 
విఠల్ : ‘మాది విజయవాడ. ఎంఎస్సీ (టెక్) చేయడానికి ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చాను. అప్పుడు మలయవాసిని ఏయూలోనే బీఏ ఆనర్స్ చేస్తోంది. హాస్టల్ విజిటింగ్ అవర్స్‌లో నేను ఆమెను కలిసేవాణ్ణి. అలా మా మధ్య పరిచయం బాగా పెరిగింది. తను బీఏ ఆనర్స్ మూడో సంవత్సరం చదువుతుండగా పెళ్లి ప్రతిపాదన ఆమె ముందు పెట్టాను. ఆమె అంగీకరించడంతో ఇంట్లో వాళ్లకి చెప్పాను. నాకన్నా ముందు ఇద్దరన్నయ్యలు ఉండడంతో వాళ్లు కొంత సమయం ఆగమన్నారు. తర్వాత  నేను మైక్రో మెటీరాలజీలో పీహెచ్‌డీ చేయడానికి రష్యా వెళ్లిపోయాను.  నేను వచ్చేవరకు నాకోసం ఉండగలవా అని వెళ్లే ముందు మలయవాసినిని అడిగాను. ఆమె సరేనంది. మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి.
 
మలయవాసిని : ‘ నేను బీఏ ఆనర్స్ 4వ సంవత్సరంలో ఉండగా మా నాన్నగారు వాళ్లు వైజాగ్ వచ్చేశారు. తర్వాత నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. రష్యా వెళ్లిన ఆయన సుమారు 4 1/2 సంవత్సరాలు రాకపోవడంతో ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి తొందర పెట్టేవారు. కానీ నేను కచ్చితంగా ఆయన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పడంతో ఇంట్లో వాళ్లు ఇంక మాట్లాడలేకపోయారు. 1971లో ఆయన రష్యా నుంచి వచ్చిన తరువాత మా వివాహం జరిగింది.
 
 ఉత్తరాలే వారధి
 వి : ఉత్తరాలకు మాకు విడదీయరాని బంధం ఉందేమో అనిపిస్తుంది. పెళ్లికి ముందు మా అనుబంధాన్ని ప్రేమలేఖలు పటిష్టం చేస్తే పెళ్లి తర్వాత ఎడబాటును దూరం చేశాయి. మలయవాసినికి 1975లో ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్‌గా అవకాశం వచ్చింది.  యూనివర్సిటీలో ఉద్యోగం కావడంతో తర్వాత అవకాశం చూసుకుని నేను కూడా వచ్చేస్తానని చెప్పి ఒప్పించి ఆమెను, బాబును వైజాగ్ పంపించాను. ఉత్తరాలే మాకు వారధి అయ్యాయి. ఒక సంవత్సరం గడిచిన తర్వాత తను తిరిగి వచ్చేస్తానన్నా ఇంకో ఆరు నెలలు చూద్దామన్నాను. ఏయూ మెటీరాలజీలో రీడర్‌గా అవకాశం రావడంతో వైజాగ్ వచ్చాను.
 
 మ : అప్పటికే తను అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ ర్యాంక్‌లో చేస్తున్నా నాకోసం రీడర్‌గా చేరారు. పిల్లల పెంపకంలో కూడా నాకు చేదోడువాదోడుగా ఉన్నారు. పిల్లలకు స్నానాలు చేయించడం దగ్గర్నుంచి అన్నింటిలోనూ సహకరించేవారు. వారి సహకారం వల్లే నేను 12 పుస్తకాలు రాయగలిగాను. నేను సాహితీ చర్చల్లో పాల్గొనేదాన్ని.  
 వి: ‘ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఆమె కోపంగా ఉండడం నేను చూడలేదు. ఎప్పుడైనా తనకు విషయం నచ్చలేదు అంటే ఏమో అని మాత్రం అంటుంది. అంతే.
 
పుస్తకాలే ప్రపంచం
మ : మా ఇద్దరికీ పుస్తకాలే ప్రపంచం. ఇద్దరివీ సబ్జెక్టులు వేరు..కానీ తెలుగు సాహిత్యమంటే ఆయనకు ఇష్టం.. సైన్స్ అంటే నాకు ఆసక్తి.. అలా మా సంభాషణంతా సైన్స్, సాహిత్యం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మా ఇద్దరి అభిరుచులు చదవడం, రాయడమే.. తను రాసిన రామసేతు, జమ్మిచెట్టు పుస్తకాలకు కావలసిన సాహిత్య సహకారం నేనందిస్తే నా ‘మన పుణ్యనదులు’ పుస్తకంలో నదులు, ప్రాజెక్టుల గురించి  ఆయన చెప్తే రాశాను. మేమిద్దరం పోటీ పడి విద్యార్థులతో డాక్టరేట్లు చేయించేవాళ్లం. నా దగ్గర 28 మంది పీహెచ్‌డీ చేస్తే ఆయన దగ్గర 22 మంది చేశారు. మధ్యలో 2 1/2 సంవత్సరాలు ఆయన బ్రెజిల్ వెళ్లడంతో నా రీసెర్చ్ స్కాలర్స్ సంఖ్య పెరిగింది. ఇద్దరికీ మొక్కల పెంపకమంటే చాలా ఇష్టం. మా ఇంటి చుట్టూ మొక్కలు పెంచాం.
 
 పిల్లలిద్దరివి ప్రేమ వివాహాలే..
 పిల్లల అభీష్టాలను హుందాగా అంగీకరించారు ఈ దంపతులు. ముగ్గురు పిల్లల్లో పెద్దబ్బాయిదే పెద్దలు కుదిర్చిన వివాహం. రెండో అబ్బాయికి, అమ్మాయికి వాళ్లు ఇష్టపడిన వ్యక్తులను ఇచ్చి పెళ్లి చేశారు. రిటైరైన తర్వాత విశాఖ సాహితీ అధ్యక్షురాలిగా మలయవాసిని.. రీసెర్చ్ స్కాలర్స్‌కు గైడ్‌గా విఠలమూర్తి తమ తమ రంగాల్లో సేవలందిస్తున్నారు.

మరిన్ని వార్తలు