ప్రధాని ఫకీర్! నిజాం యాచకుడు!

16 Dec, 2014 02:34 IST|Sakshi
ప్రధాని ఫకీర్! నిజాం యాచకుడు!

ప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ పర్యటనలో శ్రామికుల రోజుకూలీని ముప్పావలాకు పెంచుతూ ఆదేశాలిచ్చారని చెప్పుకున్నాం. ఆ నేపథ్యంలో ఆరో నిజాం ఆసక్తికరమైన ఆదేశాలను ప్రస్తావించుకున్నాం. వాటిల్లో ఒక ఒప్పందాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. అది అపూర్వమైంది! అప్పు కోసం ప్రధాని దరఖాస్తు!
 
ఆరో నిజాం ప్రభువుకు కొంత విరామం తర్వాత ఏడో నిజాం నవాబుకు ప్రధానమంత్రిగా సేవలు అందించారు మహారాజా కిషన్‌ప్రసాద్. ఆయన వితరణశీలి. బండి మీద బయటకు వెళ్తూ డబ్బు సంచులను వెంట ఉంచుకునేవారు. ఆపన్నులు ఎదురైతే రెండు చేతులతో వెదజల్లేవారు. వారు చూపే కృతజ్ఞతాభావం తన కంట పడకముందే ముందుకు సాగిపోయేవారు. ఉపఖండంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కవులను, కళాకారులను ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి, కానుకలిచ్చి పంపేవారు. ఆరో నిజాం హయాంలో ఇక్బాల్ వంటి ఎందరో అలా సహాయం పొందినవారే.
 
ఈ వాతావరణంలో తనను తాను ఫకీర్‌గా అభివర్ణించుకునే ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్ నిజంగానే ఫకీర్ అయ్యారు. తన జీతభత్యాలు అత్తెసరుకూ సరిపోవడం లేదు. అతిథులను ఎలా ఆదరించడం? అందిన చోటల్లా అప్పు చేశారు. అప్పులు అలాగే ఉన్నాయి. అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు రెండు లక్షల రూపాయల రుణం కావాలని నిజాం నవాబుకు ప్రధానమంత్రి దరఖాస్తు చేసుకున్నారు, లిఖితపూర్వకంగా! నిజాంకు ప్రధానమంత్రి జీవనశైలి తెలుసు. ఎందుకు అప్పు అడిగారో తెలుసు. అప్పు తీర్చేందుకు అప్పు. దానధర్మాలు చేసేందుకు అప్పు. సరే అన్నారు, ఒక షరతుపై!
 
‘పుణ్యా’నికి రుణమాఫీ!
 కిషన్ ప్రసాద్ తాను ఆర్జించిన‘సవాబ్’ను తనకు బదలాయిస్తూ ప్రామిసరీ నోట్‌పై సంతకం చేస్తే అందుకు బదులుగా రెండు లక్షల రూపాయలు ఇస్తానన్నారు నిజాం! ‘సవాబ్’ అంటే? ఒక ధార్మిక సంపద! వెలకట్టలేనిది! భక్తుడు మంచి పనులను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. నిష్కామంగా అన్నమాట! ‘ఫలానా మేలు చేస్తే ఫలానా దానం ఇస్తాను’ వంటి మొక్కులు కామ్యార్థాలు. నిష్కామ భక్తి సంపదను తెలిపే దృష్టాంతం ‘కైశిక పురాణం’ అనే హిందూ మత గ్రంథంలో ఉంది. ఒక ‘అచ్యుతుడు’ కైశికి రాగంలో రోజూ వామనమూర్తిని నిష్కామంగా అర్చించేవాడు. తన గాన నీరాజనంతో అతడు ఆర్జించిన సంపదను త్యాగం చేసి ఒక ‘బ్రహ్మరాక్షసు’డికి విముక్తి కలిగిస్తాడు. లోకరీతిలో ఎన్నో పాపాలు, తప్పులు చేసేందుకు ఆస్కారం ఉన్న వ్యక్తులకు మతగ్రంథాలు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించాయి.
 
మంచివారి పుణ్యసంపదను గ్రహించి మరణానంతరం స్వర్గ ప్రవేశం పొందవచ్చని ముస్లిం మత గ్రంథాల్లో ఉదహరించారు. ‘ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా దానం చేసినవారిని, సజ్జనులను రుణ విముక్తులను చేసినవారిని అల్లా తన నీడకు చేర్చుకుంటారు. తీర్పు చెప్పే రోజు మరే ఇతర దోషాలు అంటకుండా రక్షిస్తారు’ అని పవిత్ర గ్రంథం పేర్కొంది. ఈ పుణ్యఫలం బదిలీని ఉర్దూలో ‘సవాబ్’ అంటారు. అరబ్బీలో ‘తవాబ్’ అంటారు. మహా రాజా కిషన్‌ప్రసాద్ లోకులకు తాను బాకీ పడ్డ అప్పు తీర్చేందుకు నిజాంను అప్పు అడిగారు. కిషన్‌ప్రసాద్ హిందువా? ముస్లిమా? అతడేమిటో అతనికే తెలుసు! ఇరు మతాల ప్రజానీకానికీ తెలుసు. అతడు చేతిలో పైసాలేని మహారాజు! నిస్సంశయం గా బీదవాడు! సజ్జనుడు! ‘దొరకునా ఇటువంటి సేవ’ అనుకున్నారు నిజాం! తన ధార్మిక సంపదను పెంపొందించుకునేందుకు కిషన్‌ప్రసాద్ అంగీకారాన్ని ప్రామిసరీ నోట్ సాక్షిగా అడిగారన్నమాట! ఇరువురి సంతకాలతో ‘ఇహ-పర రుణాలు’ అలా సయోధ్యను కుదుర్చుకున్నాయి.
 
కనిపించని సంపద!
 కిషన్‌ప్రసాద్ 76వ ఏట 1940లో మరణించారు. ఒకప్పుడు ఆయన నివాసం ‘షాద్ మ్యాన్షన్’ వైభవోజ్వలంగా ప్రకాశించింది! ఆయన నివాసపు ప్రధాన ద్వారంలో రెండు సింహాలుండేవి. కొన్నాళ్ల తర్వాత అవి అదృశ్యమయ్యాయి. పాతబస్తీలో కిషన్‌ప్రసాద్ రోడ్ ఉంది. ఆయన నివాసాన్ని గుర్తించడం కష్టమే! మానవాళి సంపదను కనిపించేది-కనిపించనిదిగా (టాంజిబుల్-ఇన్‌టాంజిబుల్) యునెస్కో విభజించింది. భవనాలు కనిపించేవి. అవి కనిపించకపోయినా ఫర్వాలేదు. విలువలు కనిపించనివి. అవి అనుభవంలోకి మాత్రమే వస్తాయి. కిషన్‌ప్రసాద్ సమాజానికి అందజేసిన ధార్మిక సంపద ఇన్‌టాంజిబుల్. అమూల్యమైనది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో నివసించే ఇరుమతాలకు చెందిన ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఇంటర్నెట్ ద్వారా ‘హలో’ అనుకుంటున్నారు!
 - ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి

మరిన్ని వార్తలు