సేవ మన తత్వం

6 Sep, 2014 01:19 IST|Sakshi
సేవ మన తత్వం

‘సేవాతత్పరత అనేది భారతీయుల రక్తంలోనే ఉంది. సేవాగుణంలో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు’ అని అంటున్నారు ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌భట్.  నగరవాసి నిర్వహిస్తున్న రైస్ బకెట్ చాలెంజ్‌కు మద్దతుగా తొలుత ఆయన తాజ్ ఫలక్‌నుమా వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత  బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆసుపత్రి దగ్గర అన్నార్తులకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీనిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరణ్ జోహార్‌కు రైస్ బకెట్ చాలెంజ్‌ను విసురుతున్నట్టు ప్రకటించిన ఆయన మాట్లాడుతూ ‘ రైస్ బకెట్ చాలెంజ్ అనే నిరుపేదలకు ఉపకరించే కార్యక్రమం రూపుదిద్దినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను.
 
 ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది హైదరాబాదీ కావడం ఈ నగరవాసులు గర్వించాల్సిన విషయం’ అనికొనియాడారు. తెలుగు సినిమా రూపొందించడంపై మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ భాషల్లో సినిమా తీసే ఆలోచన లేదు. కాబట్టి, తెలుగు సినిమా తీసే అవకాశం లేదు. అయితే ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులున్న రంగంగా తెలుగు సినీ రంగం మీద నాకు చాలా గౌరవం ఉంది’ అన్నారు.  కాగా, శృంగారభరిత చిత్రాలను రూపొందించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ప్రేక్షకులు వాటినే ఆదరిస్తున్నారు. నేను సిటీలైట్ అనే క్లాసిక్ మూవీ తీస్తే ఎవరూ చూడలేదు. అదే జిస్మ్, మర్డర్.. సూపర్‌హిట్ అయ్యాయి. అందుకే అలాంటి సినిమాలే ఎక్కువ తీస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలే ఎవరైనా తీయాలనుకుంటారని, వారికి నచ్చని సినిమాలు తీసి చేతులు కాల్చుకోవాలని ఎవరూ అనుకోరని’ అన్నారాయన.
 - ఎస్.సత్యబాబు

మరిన్ని వార్తలు