మళ్లీ మావోయిస్టుల అలజడి

23 Sep, 2014 14:06 IST|Sakshi
మళ్లీ మావోయిస్టుల అలజడి

రాష్ట్రాన్ని విభజిస్తే మావోయిస్టులు రెచ్చిపోయే అవకాశం ఉందని వ్యక్తమైన ఆందోళన నిజమేనని తేలుతోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టులు తమ ఉనికిని చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏవోబీ ప్రాంతంలో వరుసపెట్టి పది సంఘటనలు జరిగాయి. ఇటు  తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల లోనూ కేడర్ను బలోపేతం చేసుకునే కార్యక్రమాలు గట్టిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈ పేరుతోనే విధ్వంసాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మావోయిస్టు నరేష్ను ఇన్ఫార్మర్ పేరుతో హతమార్చారు. విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల ప్రాంతంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులను గట్టిగా హెచ్చరించారు. కొయ్యూరులో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని సర్పంచిలకు లేఖలు రాశారు. పాడేరు ప్రాంతంలో కాఫీ తోటలను ాదివాసీలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు పంచారు. ఇక భద్రచాలం డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున బ్యానర్లు, గోడపత్రికలు వెలిశాయి.

ఇటీవలి కాలంలో ఇంతగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్న సందర్భాలు లేవు. ఇంతకుముందు ఏవోబీ ప్రాంతంలో ప్రధానంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మావోయిస్టులు అలజడి సృష్టించేవారు. కొన్నాళ్లుగా వాళ్ల కదలికలు పెద్దగా కనిపించలేదు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) పట్టుబడ్డారని, కాదు త్రుటిలో తప్పించుకున్నారని ఆమధ్య కథనాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ మావోయిస్టుల కదలికలు రావడం ఇదే. దాంతో రెండు రాష్ట్రాలలో ఉనికిని చాటుకోడానికి వాళ్లు ప్రయత్నాలు చేస్తున్న విషయం స్పష్టమైపోయింది. సమైక్య రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల్లోనూ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ కావచ్చంటూ విభజనకు ముందు కొంతమంది నిపుణులు వ్యక్తం చేసిన ఆందోళన నిజమేనని ఇప్పుడు తేలుతోంది.

మరిన్ని వార్తలు