అనుబంధపు తీయని పాఠం

27 Jul, 2013 03:09 IST|Sakshi
అనుబంధపు తీయని పాఠం
మూడు సంవత్సరాల వయసు నిండితే... 
 ఎల్.కేజీ, యూకేజీ, ఒకటి రెండు మూడు...
 తరగతులు మారుతూ ఉంటారు...
 ఉపాధ్యాయులు పాఠం చెప్పుకుపోతుంటారు... 
 వారు చెప్పేది వీరికి అర్థం కాదు... వీరికి అర్థమైందో లేదో వారికి అక్కర్లేదు.... అందుకే... ఇంటిదగ్గర చదువు చెప్పే పెద్దలు అవసరం. తెలియని విషయాలను పిల్లల దగ్గర నేర్చుకుంటూ... వారికి మార్గదర్శకం చేయాలి... అని 
 ‘అంకుల్స్ ఎడ్యుకేషన్’  ద్వారా వివరించాడు ఆనంద్ జయంతి.
 
 డెరైక్టర్స్ వాయిస్:
 నేను అమెరికాలో ఎంబిబిఎస్‌లో జాయిన య్యాను. శలవులకి ఇండియా వచ్చినప్పుడు ఈ లఘుచిత్రం తీశాను. ఒక్కోసారి మనం మన దగ్గరే సమాధానాలన్నీ ఉన్నాయనీ, మనం బతికే విధానం కరెక్టనీ భావిస్తాం. అయితే కొందరి ప్రభావం కారణంగా మనం చేస్తున్నది తప్పనే నిజాన్ని తెలుసుకుంటాం. ఆ ఆలోచన నుంచి వచ్చినదే ‘అంకుల్స్ ఎడ్యుకేషన్’ ఈ చిత్రానికి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయ్యింది. మా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో నటుడిగా స్థిరపడాలనుకుంటున్నాను.
 
 షార్ట్ స్టోరీ:
ఒక ఫ్లాట్‌లో తల్లీకూతుళ్లు ఉంటారు. కూతురి పేరు ప్రణవి. తండ్రి ఏడాది క్రితమే మరణిస్తాడు. అప్పటి నుంచి ప్రణవి చదువులో వెనకబడుతుంది. ప్రతి పరీక్షలోనూ ఫెయిలవుతూ ఉంటుంది. విషయం తెలుసు కున్న ఆ వృద్ధుడు, ప్రణవికి చదువు చెప్పాలనుకుంటాడు. ముందుగా తను నేర్చుకుని, ఆ తరవాత ప్రణవికి చెబుతుంటాడు. ప్రణవి మంచిమార్కులతో పాస్ అవుతుంది. ఇదీ ప్రధానకథ.
 
 కామెంట్: మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు. చిత్రీకరణ బాగుంది. నటీనటులు అద్భుతంగా నటించారు. ముఖ్యం గా వృద్ధుడుగా నటించిన భిక్షు, ప్రణవిగా నటించిన ప్రణవి ఇద్దరూ ఎంతో చక్కగా నటించారు. కెమెరా, టేకింగ్, లొకేషన్లు... అన్నీ ఒక సుందర దృశ్యకావ్యాన్ని మరపించాయి. ఇందులో ‘‘ఎవరు ఎవరికి చెబుతున్నారు అనుబంధపు ఈ తీయని పాఠం’’ అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, వారి అబ్బాయి యోగీశ్వరశర్మ, సమీర్‌తో కలిసి సంగీతం సమకూర్చారు. ఈ పాటను సమీర్ పాడారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆనందే చేశాడు. 
 
 కథనం చాలా స్లోగా ఉంది. డైలీ సీరియల్‌లాగ సాగదీసినట్టు ఉంది. మంచి కాన్సెప్ట్‌ని మరింత ఫాస్ట్‌గా తీసి ఉంటే బావుండేది. ఇరవై నిముషాల నిడివిలో కంటె, కేవలం పది నిముషాల నిడివిలో తీసి ఉంటే బాగుండేది. మరొకటి... లఘుచిత్రాల పేర్లు తెలుగులో పెడితే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇక రానున్న రోజుల్లో చలనచిత్ర గీతాలలాగే లఘుచిత్ర గీతాలు కూడా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. కనుక ట్యూనింగ్ మీద మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఒక మంచి కథను అందరూ ఆదరించాలంటే, పాట, సంగీతం, గానం, నటన, కథనం ... అన్నీ సమపాళ్లలో ఉండాలి. అప్పుడే ఆ చిత్రం కలకాలం నిలబడుతుంది. కథ పటిష్టంగా ఉండటం వలన వీటిని దోషాలుగా లెక్కించక్కర్లేదు. మరో చిత్రం తీసినప్పుడు ఈ లోపాలు సరిదిద్దుకుంటే చాలు.
 
 - డా.వైజయంతి
 
మరిన్ని వార్తలు