నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల

23 Jun, 2020 16:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో పెద్ద కంపెనీకి బాస్ అయినా నాన్నకు బిడ్డే కదా. భౌతికంగా ఆయన దూరమైనా... పంచిన ప్రేమనురాగాలు ఎల్లప్పుడూ గుండెల్లో పదిలంగా దాగుంటాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి లింక్డ్ ఇన్ లో తనివితీరా రాసుకొచ్చారు.

‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల ముఖంలోని చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.

యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్ లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలోనూ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.

>
మరిన్ని వార్తలు