మధ్యతరగతి మౌనం వీడాలి

8 Jan, 2015 01:20 IST|Sakshi
మల్లెపల్లి లక్ష్మయ్య

 విశ్లేషణ - కొత్త కోణం
ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. కార్పొరేట్ రంగం నేడు వేగంగా గ్రామాలను, వ్యవసాయాన్ని, కులవృత్తులను ధ్వంసం చేస్తోంది. దళితులు, గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి.
 
 మేధావులంటే పండితులే కావాల్సిన అవసరంలేదు. పండితులంతా మేధావులూ కానవసరంలేదు. ఏదో ఒక రంగంలో నైపుణ్యం కలిగి, అవస రమైతే అధికారాన్ని ప్రశ్నించగలిగిన వారే మేధావులు. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ఇటీవల ఒక సభలో పాండిత్యం ఉంటే మేధావులు అవుతారనేది అబద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రముఖ జర్నలిస్టు నిఖిల్ చక్రవర్తి స్మారకోపన్యాసం చేస్తూ ఆమె భారత మేధావుల తీరు పట్ల ఆందోళన వెలిబుచ్చారు. అధికారాన్ని ప్రశ్నించకపోవడం దేశ ప్రగతికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అది కేవలం ఆందోళన మాత్రమే కాదు పచ్చి వాస్తవం కూడా.
 
                                 చనిపోవడానికి ముందు సోక్రటీస్ 
 ప్రశ్నించేవాడే మేధావి
పాశ్చాత్య ప్రపంచంలో గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మొదలుకొని ఎంతో మంది మేధావులు అధికారాన్ని ప్రశ్నించారు. అలా ప్రశ్నించే హక్కు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డారు. మన దేశంలో ప్రత్యక్షంగా అలాంటి ధిక్కార సంప్రదాయానికి గౌతమ బుద్ధుడిని మూలపురుషునిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అల్లకల్లోలం రాజ్యమేలు తున్న కాలంలో ఆయన అందుకు కారకులైన వారిని నిలదీ శాడు. అంతేకాదు ప్రత్యామ్నాయాలను చూపి, సమాజ విముక్తికి మార్గం చూపించాడు. బౌద్ధం ఆ రోజుల్లో ఒక విప్లవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రశ్నించడంతోనే బుద్ధుడి సామాజిక జీవితం మొదలైంది. ఆయన వృద్ధుడిని, రోగిని, శవాన్ని, పేదవాడిని చూసి సన్యాసం తీసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథ అసత్యం. ఆయన జన్మించిన శాక్య తెగకు, పొరుగున ఉన్న కొలియ తెగలకు మధ్య రోహిణి నది నీటి కోసం ఘర్షణలు సాగేవి. ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని అన్నందుకు ఆయన దేశం వదిలిపెట్టి పోవాల్సివచ్చింది.

 ఆ విధంగా ఇంటిని వదలిన గౌతముడు సమాజాన్ని ఆకళింపు చేసు కొని, పరిష్కార మార్గాలను కనుగొని బుద్ధుడిగా మారాడు. ఆయన ఆరోజు శాక్య గణసభను ప్రశ్నించి ఉండకపోతే, సుఖాలను త్యజించి సమాజం కోసం తపించకపోతే ఏం జరిగేదో చెప్పలేం. అదేవిధంగా భారత స్వాతంత్య్ర పోరా టానికి పునాదులు వేసిన దాదాభాయి నౌరోజి, మహదేవ్ గోవింద్ రనడే లాంటి వారి ప్రశ్నల కొడవళ్లే భారత జాతిని జాగృతం చేశాయి. ఆ ప్రశ్నల నుంచే గాంధీ నెహ్రూ లాంటి నాయకులు ఉద్భవించారు. భారత కుల సమా జాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించిన అంబేద్కర్ అంటరానితనాన్ని రూపు మాపకపోతే ఈ సమాజానికి నిష్కృతిలేదని భావించారు. ధైర్యంగా దాన్ని ధిక్కరించారు, తిరుగుబాటు చేశారు. లేకపోతే మన రాజ్యాంగం అంటరాని తనాన్ని నిషేధించి ఉండేదేకాదు. చరిత్రనిండా మేధావులు అధికారాన్ని, అధి కార భావజాలాన్ని ధిక్కరించిన ఉదాహరణలెన్నో. సమాజం నేడు ఈ స్థాయి లో అభివృద్ధి చెందడానికి కారణం ఎందరో మేధావులు చేసిన త్యాగాలే.

పన్నులు కట్టే దెవరు? రాయితీలు ఎవరికి?
 మేధావులకు ఒక ముఖ్యవనరు అయిన మధ్యతరగతి నేడు సమాజ శ్రేయస్సు గురించిగాక, తమ బాగుకోసం మాత్రమే ఆలోచిస్తోంది. అంతేకాదు, దేశ సంపదను, వనరులను గుప్పిట పట్టిన కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి, సమాజంలో నిరాదరణకు గురవుతున్న, వివక్షకు బలౌతున్న వర్గాల పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ ధోరణి మరింతగా పెరిగింది. రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్యతరగతి వర్గాన్ని మార్కెటీకరణ వెలుగు జిలుగులు అమితంగా ఆకర్షిస్తు న్నాయి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వర్గాలు మరింతగా వ్యక్తిగత ప్రయో జనాలకు అంటిపెట్టుకునేలా వారికి రాయితీలను ఇస్తున్నాయి. ఇటువంటి విధానాలు పేదలకు, మధ్యతరగతికి మధ్యన పెద్ద అగాధాన్ని సృష్టిస్తున్నా యి.

ఇటీవల జరిగిన ఒక సర్వేలో దేశంలోని నూటికి 80 శాతం మంది కేవలం రోజుకు 25 రూపాయల ఆదాయం, ఖర్చుతో జీవిస్తున్నట్టు తేలింది. దీన్ని బట్టి దేశంలోని పేదల జీవన విధానానికి, సంపన్నుల జీవన విధానానికి మధ్యనున్న అంతరం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో తేలిపోతోంది. ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నాటి నుండి నేటి వరకు మేధావులు, పట్టణ మధ్య తరగతి వర్గాలు విమర్శలను గుప్పిస్తూనే ఉన్నాయి. నిజానికి అర్హులైన కూలీ లలో సగం మంది మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయో గించుకున్నవారికి కూడా నిర్దేశించిన దానిలో సగం దినాలు మాత్రమే పని లభించిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

అదేవిధంగా ఆహార భద్రతా చట్టం విషయంలోనూ మధ్యతరగతి చాలా తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిం ది. కొందరు దీన్ని ప్రజాధన దుర్వినియోగం అన్నారు. మరికొందరు తాము కడుతున్న పన్నులతో ఖజానాకు సమకూరిన ధనాన్ని సంక్షేమ కార్యక్రమాల పేరిట వృథా చేస్తున్నారని వాపోయారు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నం అవు తుంది. నిజానికి పన్నులు కడుతున్నదెవరు? ప్రయోజనం పొందుతు న్నదెవరు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మధ్యతరగతి, ధనికులు ప్రత్యే కించి చెల్లించే ఆదాయం పన్ను కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే. మిగిలిన 85 నుంచి 90 శాతం రాబడి ప్రజలందరూ కొనుగోలు చేసే వస్తువుల మీద వేసే కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారా చేకూరుతోంది. అం దులో ఎక్కువ శాతం పేద, దిగువ మధ్య తరగతుల నుండే వస్తోంది. నిజా నికి పన్నుల్లో అధిక భాగాన్ని చెల్లిస్తున్న 80 శాతం జనాభా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు బాగా తక్కువగా ఉంటోంది. కానీ ఎక్కువ భాగం కార్పొరేట్, ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల సౌకర్యాల కోసమే ఖర్చవుతోంది. అందుకే మధ్యతరగతి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించకుండా మౌనం వహిస్తోంది.

రంగుల కలల నుంచి బయటపడాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం మూడు కాలాలు పచ్చగా ఉండే పంట పొలాలను ధ్వంసం చేసి వేలాది మంది పల్లె ప్రజలను వీధుల్లోకి గెంటేస్తుంటే పల్లెల నుండి ఎదిగి వచ్చిన మధ్యతరగతి ధనిక వర్గాలు సైతం మౌనం వహిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ పట్ల కూడా ఈ వర్గాల్లో కదలిక లేకపోవడం విచారకరం. ఇది భవిష్యత్తులో చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తేనే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి.

ఇది మొత్తం సమాజ పురోభివృద్ధినే దెబ్బతీస్తుంది. అందుకే మధ్యతరగతి పై అంతస్తులకు ఎదిగిన వర్గం పాలకులను ప్రశ్నించడం అవసరం. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆధిపత్యాన్ని నెరపుతున్న కార్పొరేట్ రంగం మధ్యతరగతి వర్గానికి కొన్ని తాయిలాలు ఇస్తూ వారిలోని ప్రశ్నించే తత్వాన్ని చంపేయాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రభావం తాత్కాలికమే. ఇదే మధ్యతరగతి వర్గం సమాజంలో సాగుతున్న అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి పోరాడిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

ఇటీవల సాగిన తెలంగాణ ఉద్యమంలో మధ్యతరగతి వర్గం నిర్వహించిన పాత్ర కీలకమైనది. అయితే భవిష్యత్తులో, తెలంగాణ నిర్మాణంలో కూడా వారు అదే పాత్రను పోషిస్తారో, లేదో చూడాల్సిందే. గ్రామాల్లోని రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను కార్పొరేట్ రంగం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. గ్రామాలను, వ్యవసాయాన్ని, కుల వృత్తులను ధ్వంసం చేసే పనిని కార్పొరేట్ రంగం అతివేగంగా సాగిస్తోంది. అదే సమయంలో తరతరాలుగా అంటరానితనానికి గురైన దళితులు, సమాజానికి దూరంగా బతుకుతున్న గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారాలంటే కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి.

 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
 మొబైల్ నం: 9705566213

మరిన్ని వార్తలు