బెల్లవిస్టా... చరిత్రకు సాక్షి

11 Aug, 2014 01:56 IST|Sakshi
బెల్లవిస్టా... చరిత్రకు సాక్షి

హైదరాబాబాద్ మా కలల నగరం! ఇక్కడికి వస్తామని కలలు కనలేదు! ఇది మామూలు    నగరమా? రెండు బిలియన్ డాలర్ల స్వంత ఆస్తితో ప్రపంచంలో అత్యధిక  ధనవంతుడు, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ జీవించిన నగరం! ఎర్రని ఉదయం కోసం మగ్దుం వంటి విప్లవ కవులు కామ్రేడ్లూ ఉద్యమించిన నగరం! మానాన్న వయసున్న పెద్దవాళ్లు ఇక్కడి  స్త్రీల సౌందర్యాలను మార్మికంగా వర్ణించుకునే వారు! ప్రిన్సెస్ నీలోఫర్ జీవించిన నగరం!  హైద్రాబాద్‌ను ‘నగరాల్లో వధువు’గా ఉర్దూ కవులు అభివర్ణించారు. 1958లో మేము ఇక్కడకు వచ్చేసరికి ‘నిరుడు కురిసిన హిమసమూహములు’ కరిగిపోయినా, ఆ చల్లదనం, ఆహ్లాదం ఆవిరి కాలేదు! విశాలమైన, నీటైన సిమెంట్ రోడ్లు. ఒకే అంతస్తున్న ఇళ్లు. ఎటుచూసినా పచ్చదనం. రాజ్యం పోయినా దర్పమూ, ఔదార్యమూ లోపించని రాజవంశీకులు !
 
 నగరంలో తొలకరి వర్షం ప్రతిఏటా జూన్ 7న పడేది. ఏ ఏడాదైనా అలా వాన కురవకపోతే, ఒకటి రెండురోజులు ఆలస్యమైతే ప్రతి హైద్రాబాదీ బాధపడేవారు. ‘ప్చ్, అయ్యో, వాన కురవలేదు ఎందుకనో’ అంటూ తనవల్లే వాన కురవలేదా అన్నంతగా ఫీలయ్యేవారు. తొలకరితో నగరం చల్లబడేది. మరో తొమ్మిది నెలలవరకూ! కుదుపుల్లేని ప్రయాణంలా రుతువులు మెల్లమెల్లగా మారేవి. వానాకాలం నుంచి చలికాలం రావడం దుస్తుల మార్పులో స్పష్టంగా తెలిసేది. ఇక్కడి హాయైన వాతావరణం ప్రజలకు సామరస్య స్వభావాన్నిచ్చిందేమో! ఈ వాతావరణం ఆదర్శనీయమైన గవర్నర్లనూ ఇచ్చింది! సరోజినీ నాయుడు నుంచి శివశంకర్ వరకూ ఎక్కువమందిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపింది హైద్రాబాదే!
 
 శతాధిక వసంతాల భవనం!
 జిల్లాల్లో ట్రైనీలుగా పనిచేస్తూ శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు 1956లో హైద్రాబాద్ వచ్చేవారం. రాజ్‌భవన్-పంజాగుట్ట జంక్షన్‌లో ఉన్న బెల్లావిస్టా అతిథి భవనంలో మా విడిది. బెల్లవిస్టా అనే ఇటాలియన్ పేరుకు అర్థం ‘అందమైన చోటు’!  ఇక్కడ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉంది. అతిథి గృహంలో  ఫర్నిచర్, పింగాణీ, వెండి పాత్రలూ, సేవకుల వినయవిధేయతలూ మమ్ములను ఆశ్చర్యానికి గురిచేసేవి. ‘రాజరికం’ మా అనుభవంలోకి వచ్చేది! ఈ అందమైన చోటు శతవసంతాలు చూసింది.
 
  హైద్రాబాద్ హైకోర్డు ప్రధానన్యాయమూర్తి ముస్లిహుద్దీన్ మహమ్మద్ 1905లో బెల్లావిస్టా భవంతిని నిర్మించారు. ఆయనకు హకీముద్దౌలా బిరుదుండేది. విశాలమైన ఆ భవంతిలో రెండు అడుగుల గోడలు తప్ప మధ్యలో ఎక్కడా స్తంభాలుండేవి కావు. 57వ ఏట ప్లేగు వ్యాధితో మరణించే వరకూ(1914) ఆయన అందులో నివసించారు. ఈ కాం పౌండ్‌లోనే ఇంకో భవంతి ఉంది. ఇందులో హకీముద్దౌలా తమ్ముడు న్యాయవాది, జలాలుద్దీన్ నివసించేవాడు. 1916లో ఆయన చనిపోయిన తర్వాత వారసులు అమ్మకానికి పెట్టారు. 1917లో ఫర్నిచర్‌తో సహా 60 వేల రూపాయలకు నిజాం కొన్నాడు. క ట్టుబడి ఖర్చు రూ.45 వేలు!
 
 రాకుమారుని ‘కటకట’!
 నిజాంకు ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ అలీ ఇమామ్ 1919నుంచి 1922 వరకూ బెల్లవిస్టాలో నివసించారు. పక్కనే ఉన్న లేక్‌వ్యూ (ప్రస్తుతం ఎ.పి.సీ.ఎం క్యాంప్ ఆఫీస్) అలీ ఇమామ్  కార్యాలయం!  సాయుధ దళాల అధిపతి, బేరార్ యువరాజు హోదాలో నిజాం పెద్దకుమారుడు అజంజా, 1922 నుంచి ఇందులో నివసించారు. బెల్లవిస్టా ముందు ఇప్పుడు విద్యుత్ కార్యాలయం ఉన్న భవంతి యువరాజుల గుర్రపుశాల! బెల్లవిస్టాలో ఆయన నివసించినన్నాళ్లూ రాత్రి విందు వినోదాలు పూర్తయ్యి నిద్రలోకి జారేవేళకి సూర్యుడు ఉదయిస్తుండేవాడు!
 
 యువరాజుకి నెలకు 25వేలు అలవెన్స్‌గా నిజాం ఇచ్చేవాడు. అది చాలక వడ్డీవ్యాపారుల వద్ద ముప్ఫై వేలు తీసుకున్నట్లుగా సంతకాలు పెట్టి పదివేల రూపాయలు తీసుకునేవాడు. పెద్ద-చిన్న ప్రిన్స్‌లు (అజంజా-మౌజాం జా) ఇలా చేసిన అప్పు మొత్తం నాలుగున్నరకోట్ల రూపాయలుగా లెక్కతేలింది. నిజాం క్లియర్ చేశాడు. ఇక్కడ రకరకాల స్త్రీ-పురుషులుండేవారు! వారందరినీ ఖాళీచేయాల్సిందిగా ఆదేశించి వారి తాలూకూ బాకీలు లెక్కవేసేందుకు నిజాం ఒక కమిటీ వేశాడు!
 
  తనకు 50 ఏళ్లు వచ్చినా ఆయన విదిల్చే ‘నాలుగు కాసుల కోసం’ ఎదురు చూడాల్సి వస్తోందని బేరార్ యువరాజు, నిజాంకు వ్యతిరేకంగా క్షుద్రపూజలు చేయించాడు! ఇవన్నీ తెలిసి నిజాం వార సుడిగా మనుమడు ముఖరంజాను నిర్ణయించాడు. ఫలితంగా తండ్రికొడుకుల మధ్య మాటలు లేవు!  1948లో హైద్రాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో భాగం అయ్యాక ‘నిజాం సైన్యాధ్యక్షుడు’ బెల్లవిస్టాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి బెల్లవిస్టా ప్రభుత్వ అతిథి గృహం. ట్రైనీ ఆఫీసర్లుగా మేం విడిది చేసినప్పుడు అక్కడి లైబ్రరీలో అపురూప గ్రంథాలను తిరగేశాం! ‘నిజాం సిబ్బంది’ చెప్పే బెల్లావిస్టా కథలు ఏ పుస్తకంలోనూ ఉండేవి కావు!         
 ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి

మరిన్ని వార్తలు