ఇస్ కే సివా..!

8 Nov, 2014 02:46 IST|Sakshi
ఇస్ కే సివా..!

ఆస్తులు హక్కుగా పంచుకునే వారసులు చాలామంది.. ఆశయాలను అంతే బాధ్యతగా నెరవేర్చేవాళ్లు కొంతమందే.. మహ్మద్‌అలీ బేగ్ తండ్రి ఆస్తికన్నా ఆశయానికి విలువిచ్చిన వారసుడు! అందుకే తండ్రి పేరిట ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్‌ను స్థాపించాడు.. 2005 నుంచి నాటకాల ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు.. దక్కన్ సంస్కృతి ప్రపంచానికి చాటుతున్నాడు.. శుక్రవారం మొదలైన ఈ నాటకోత్సవం గురించి పద్మశ్రీ మహ్మద్ అలీబేగ్ చెప్తున్న విషయాలు..
 
 సెవెంటీస్‌లో టెక్నికల్‌గా అంతగా డెవలప్‌కాని టైమ్‌లో ఎన్నో కష్టనష్టాలకోర్చి మా నాన్న (ఖాదర్ అలీబేగ్) థియేటర్‌ను ఓ యజ్ఞంలా భావించాడు. ఆయన కొడుకుగా ఆ తపననే నేను వారసత్వంగా అందుకున్నా. మా నాన్న నాకే కాదు థియేటర్‌ను ఆరాధించే ప్రతి కళాకారుడికి తండ్రి, గురువు.. అన్నీ. బేసిక్‌గా నేను ఆర్టిస్ట్‌ను కాదు. థియేటర్ నా ప్రొఫెషన్ కాదు. హాబీ అంతకన్నా కాదు. ఖాదర్ అలీబేగ్ కొడుకుగా ఆయన కీర్తిని అజరామరం చేయడానికే ఈ రంగంలోకి వచ్చాను. ఫౌండేషన్‌ను స్థాపించి ఏటా నాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నాను. మన థియేటర్‌ను బతికించుకోవడమే కాకుండా.. ప్రపంచంలోని డిఫరెంట్ థియేటర్స్‌ను హైదరాబాద్ ప్రేక్షకులకూ పరిచయం చేయాలని నా కోరిక.. లక్ష్యం కూడా! తెలంగాణ, దక్కనీ సంస్కృతికి ప్రత్యేకమైనది. దీనికి ప్రపంచ గుర్తింపు రావాలంటే ఇలాంటి కళలే ప్రచార సాధనాలుగా ఉపయోగపడతాయి. వీటి ద్వారానే మన ఉనికి విశ్వవ్యాప్తమవుతుంది.
 ఒక్కో థీమ్‌తో..
 ఏటా అన్ని భాషల్లోంచి నాటకాలను ఆహ్వానిస్తాం. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో నాటకాల ప్రదర్శన నిర్వహిస్తున్నాం. మొదటి ఏడాది ‘ప్రేమ’కు సంబంధించిన నాటకాలను ఆహ్వానించాం. ఇంకో ఏడాది హాస్యరసం.. మరోసారి విమెన్ ఓరియెంటెడ్ అంశాలను తీసుకున్నాం. ఈసారి ‘బయోగ్రఫీ’ ఆధారంగా వచ్చిన నాటకాల ప్రదర్శన ఉంటుంది. గొప్ప వ్యక్తుల బయోగ్రఫీనే కాకుండా సామాన్యుల నిజజీవితాల ఆధారంగా రచించిన నాటకాలుంటాయి. భ్రూణహత్యలపై ‘జుగ్‌జుగ్ జియో’ నాటకం, నేను రాసిన గోల్కొండ రాణి ఆత్మకథ ‘సవాన్ ఎ హయత్’, వాణీగణపతి ‘ద్వారం’ వంటి నాటకాలు ఇలాంటివే. ఈ జానర్‌లో ఒదగని నాటకాలను ‘బొకే’అనే పేరుతో విడిగా ప్రదర్శిస్తున్నాం. వాటిలో గిరిష్‌కర్నాడ్ రాసిన ‘బాయిల్డ్ బీన్స్ ఆన్ టోస్ట్’, రాళ్లపల్లి గారి ‘సుందరి.. సుబ్బారావు’లాంటి నాటకాలున్నాయి. కేవలం నాటకాలే కాదు.. కాలక్రమంలో నాటకకళలో వస్తున్న మార్పులు, టెక్నిక్‌లకు సంబంధించిన వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తున్నాం. యూరప్ దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘సర్కస్ థియేటర్’ను ఈసారి పరిచయం చేస్తున్నాం. ఈ తరహాలో ఉన్న  స్పానిష్, ఫ్రెంచ్ నాటకాల ప్రదర్శనా ఉంది.  ..:: శరాది
 
 
 నా  దరఖాస్తు ఒక్కటే..
 
 పద్మశ్రీ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడిని. నా నాటకాలు జర్మనీ, లండన్, ఫ్రాన్స్‌లాంటి చోట స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నాయి. పద్మశ్రీ బిరుదు ప్రదానం తర్వాత అశోకా హాల్‌లో ప్రొటోకాల్‌కు విరుద్ధంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆయన సతీమణి అభినందించడం మరువలేను. అంతటి ప్రతిష్ట ఉన్న మన దక్కనీ నాటకానికి తెలంగాణలోనూ అంతే గౌరవం దక్కాలి. అందుకు తగిన వసతులిమ్మని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొంత స్థలం కేటాయించి, ఆధునిక వసతులతో మంచి థియేటర్‌ను నిర్మించమని దరఖాస్తు చేస్తున్నాను. 365 రోజులు ఆ థియేటర్ నాటకాల ప్రదర్శనకు అనువుగా ఉండాలి. దక్కనీ, తెలంగాణ సంస్కృతిపై మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉంది. నా దరఖాస్తును మన్నిస్తారనే అనుకుంటున్నాను.
 

మరిన్ని వార్తలు