డబ్బు దారుల్లో చోద్యాలు

27 Apr, 2015 23:09 IST|Sakshi

ధనం అన్ని అనర్థాలకు మూలం అంటారు కొందరు. డబ్బంటే సుఖం. డబ్బంటే అధికారం. డబ్బంటే మనమాటను అందరూ వినడం అనుకుంటారు అధికులు. కాబట్టే కదా చరిత్ర నిండా ఇన్ని రక్తపాతాలు- కన్నీళ్లు! దీన్నెవడు కనిపెట్టాడో కాని, లోకంలో డబ్బనేది లేకపోతే చీకూచింతా ఉండదు కదా అని వాపోతారు మరి కొందరు. ఊహల్లోంచి బయటకు వస్తే డబ్బు ఆక్సిజన్ ! డబ్బు కావాలి! ఎంత? ‘చాలు చాలు’ అనేంత! కలవారు డబ్బు వ్యర్థం అనుకుంటారు. లేనివారు వెంపర్లాడతారు. డబ్బొద్దు అనుకున్నా డబ్బుండాలి కదా!.

డబ్బు చేసుకోవడానికి మంచి సలహాలు ఎవరిస్తారు? సంపాదన చేతకాని వాళ్లు మాత్రమే! సంప్రదాయక విజ్ఞానం మనిషి ముందు మూడు దారులు పరచింది. బెగ్-బారో-స్టీల్! అడుక్కో-అప్పుచేయి-లాక్కో! కొందరు అడుక్కునే వారిని మనం గుర్తించలేం. వారు మనోవిజ్ఞానంలో మాస్టర్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడలిలో ఎర్రలైటు పడగానే ప్రత్యక్షమవుతారు. వారి వల విడిపించుకోలేనిది. డబ్బివ్వకపోతే  అపరాధ భావన కు గురవుతాం! ప్రార ్థన స్థలాల్లో భగవంతుడేమో కాని అడుక్కునేవారు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. ‘దైవాన్ని రహస్యంగా అడుక్కున్నదాంట్లో కొంచెమేగా మేము ఆశిస్తున్నది, మాకు చిల్లర విదిలించకపోతే మీకు టోకు లభిస్తుందా?’ అన్నట్లుగా కళ్లల్లోకి సూటిగా సంభాషిస్తారు.  రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించిన తర్వాత మీ స్థాయిని అంచనా వేస్తారు కొందరు బేరర్స్. మీరు అతిథి కావచ్చు, ఆతిథ్యం ఇచ్చిన వారు కావచ్చు, ఆత్మశోధనకు గురిచేస్తారు. తగిన మొత్తం ఘరానాగా చదివించి ఒక తలపంకింపును స్వీకరిస్తేగాని మీ మనస్సు తేలికపడదు.

చోర్ మచాకే..
దొంగిలించడం అనే కళలోనూ రిస్క్ ఉంది. మీరు ఉద్యోగులా? అయితే పెట్టిన ఖర్చుకంటే అదనంగా చట్ట ప్రకారం దొంగిలించవచ్చు. టీఏ డీఏలను అదనంగా చూపవచ్చు. రాని వ్యక్తులను అతిథులుగా, తినని పదార్థాలను, ద్రవాలను సేవించినట్లు రికార్డులను చూపవచ్చు! అప్పు చేయడం ద్వారానూ కొందరు డబ్బు సంపాదిస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరి అంత్యక్రియలకో వెళ్లాలనడం, అయిన వారిని తక్షణం దవాఖానాలో చేర్పించాలనే నెపం అభినయించి అప్పిచ్చే వారిలో మానవత్వాన్ని  తట్టిలేపాలి. తిరిగి చెల్లించకపోయినా ఫర్వాలేదనుకునే అమౌంట్‌కు ఎర్త్ పెట్టాలి.  జ్ఞాపకశక్తి లోపించిన వారి దగ్గర, అడిగేందుకు మొహమాటపడే వారి దగ్గర అప్పు చేయడం శ్రేయస్కరం. దురదృష్టం ఏంటంటే అంతంత మాత్రం జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లు కూడా అప్పిచ్చిన వైనాల్లో చురుగ్గా ఉంటారు!

ఆమ్యామ్యా..
డబ్బు సంపాదనలో లంచం కూడా ఒక మార్గమే!  ఇందుకు ఒక కొలువు తప్పనిసరి. కొలువు ఏదైనా లంచానికి కాదేదీ అన ర్హం! లంచం తీసుకున్నందుకు చట్టం శిక్షించదు, తీసుకున్నట్లు పట్టుబడితేనే సుమా!  లంచం ఆశించేవారు తెలివిగా ఉండాలి. మరీ దురాశకు పోరాదు. ఈ ఆశ లేనివాళ్లు ఏదైనా రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా వెళ్లవచ్చు.
 - ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి,
 ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత.
 సెల్ నెం : 7680950863

మరిన్ని వార్తలు