ప్లేట్స్ అండ్ ఫిల్లోస్.. వడ్డించిన హిస్టరీ

1 Aug, 2014 00:28 IST|Sakshi
ప్లేట్స్ అండ్ ఫిల్లోస్.. వడ్డించిన హిస్టరీ

 ‘ఆ రాణి ప్రేమ పురాణం. ఆ ముట్టడికైన ఖర్చులు ..  ఇవి కాదోయ్ చరిత్ర సారం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ.  కానీ అసలు ఏ చరిత్రా పట్టని నేటి తరానికి ప్రేమాయణాలైనా చెప్పాల్సిందే. అందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుందీ గృహోపకరణాల షోరూమ్. అక్కడ దొరికే ఒక్కో వస్తువు ఒక్కో చరిత్రను చెబుతుంది. ఇవన్నీ డిజైనర్ పీస్‌లు. ఇక్కడ దొరికిన ప్రొడక్ట్‌ను పోలింది మరెక్కడా దొరకదు. ఆ యూనిక్‌నెస్ మీ సొంతం కావాలంటే  బంజారాహిల్స్‌లోని ‘గుడ్ ఎర్త్’కు వెళ్లాల్సిందే!
 
 దేశ చరిత్ర...
 కర్ణాటకలోని బీదర్‌లో వందల ఏళ్ల నాటి శిల మీద ఒక ఆకృతి ఉంటుంది. దాని స్ఫూర్తితో రూపొందిన బిద్రీ కలెక్షన్‌ను కృష్ణ మెహతా డిజైన్ చేశారు. ఇక కాశ్మీర్‌లోని ప్రసిద్ధ గార్డెన్ నిశాత్‌బాగ్‌ను స్ఫురింపజేస్తూ మరో సెట్ అబ్బుర పరుస్తుంది. ఒంటెలను  మేపేవారి కోసం ఎడారిలో నీడనిచ్చే ‘పల్మనేరియా’  చెట్టు మరో కలెక్షన్‌లో కనిపిస్తుంది.
 
 హోమ్‌నీడ్స్
 ఒక్క క్రాకరీనే కాదు, కర్టైన్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, సోఫా కుషన్స్.. అన్ని రకాల హోమ్‌నీడ్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఇక్కడ లభించే పిల్లో కవర్స్‌పై ఉండే చార్మినార్ చరిత్ర, నిజాం విశేషాలు, తాజ్‌మహల్ వింతలు.. మిమ్మల్ని హాయిగా నిద్రపుచ్చుతాయి. ‘రత్నాకార’ పేరుతో శ్రీలంక, భారత్‌కు మధ్య సముద్రం అడుగున రత్నాలు లభించే దారిని సూచించే మ్యాప్ మరో పిల్లోపై కొలువుదీరింది. ఆశా మదన్ వీటిని డిజైన్ చేశారు.
 
 బారాదరి...
 ఆఖరి కులీ కుతుబ్ షా అబ్దుల్ పాదుషా. ఆయన  ఆస్థానంలో నృత్యం చేసే కళాకారిణి ప్రేమావతిని ఆయన విపరీతంగా అభిమానించేవాడు. ఆమె మరణం తరువాత  1662లో గుర్తుగా ‘బారాదరి’ (12 దారుల కోట)ను కట్టించాడు. ఈ కథ మొత్తం ఒక క్రాకరీ సెట్ వివరిస్తుంది. ఒక ప్లేట్‌పైన నిజాం రాజు బొమ్మ ఉంటుంది అలా మొదలై 12 ప్లేట్లు మొత్తం కథను చెప్పేస్తాయి. ఈ బారాదరి సెట్‌ను పవిత్రా రాజారాం డిజైన్ చేశారు. ఒక్క హైదరాబాద్ చరిత్ర మాత్రమే కాదు.. కాశ్మీర్, కర్ణాటక ప్రాంతాల్లోని  సాంస్కృతిక కట్టడాల చరిత్రలను చెప్పే సెట్స్ ఉన్నాయిక్కడ.
 -  శిరీష చల్లపల్లి

మరిన్ని వార్తలు