'అరగంట చేజింగ్ తర్వాత దొరికాడు'

10 May, 2015 02:46 IST|Sakshi
'అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు'

ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు.  అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే...
 
‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అరగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ.

విసుక్కునేది కాదు..

నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్‌లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది.
 
పూర్తి శాకాహారి..

మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్‌వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్‌తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి.
 
ఇప్పుడు 84 ఏళ్లు..

 నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’.   
 

>
మరిన్ని వార్తలు