మిస్టర్ పర్ఫెక్ట్

3 Apr, 2015 01:50 IST|Sakshi
మిస్టర్ పర్ఫెక్ట్

మీరు నల్లగా ఉండొచ్చు. ఇతరులకు నచ్చకపోవచ్చు. మీకు పిల్లలు లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు! ఎన్ని సమస్యలైనా ఉండనీ... ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ అంటున్నాడు తరుణ్ గిద్వానీ! అందుకోసం ఆయన వీకెండ్స్‌లో... మార్కెట్‌లోనో, బస్టాండ్‌లోనో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఐదు నుంచి ఆరు గంటలు ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ బోర్డ్ పట్టుకుని నిలబడతాడు. 25 ఏళ్ల ఈ హైదరాబాదీ చేస్తున్న ఈ నిస్వార్థ కృత్యం... అనేకమందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

తరుణ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. అరోరా కాలేజీలో బీఎస్‌సీ చదివి, రెండేళ్ల కిందట లెండ్‌హండ్ ఎన్జీవోలో ఉద్యోగం కోసం పుణేకి వెళ్లాడు. అక్కడ సహచరులతోపాటు చాలా మంది సమస్యలను దగ్గరగా చూశాడు. తానూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎంతోమంది చిన్న సమస్యలకే కుంగిపోతున్నారని తెలుసుకున్నాడు. వారి మనసును మార్చేందుకు ‘యూ ఆర్ పర్‌ఫెక్ట్’ ప్లకార్డుకు అంకురార్పణ చేశాడు. పుణేలోని కొరేగావ్ పార్క్‌లో ‘యూ ఆర్ పర్‌ఫెక్ట్’ ప్లకార్డు పట్టుకొని నిలుచున్నప్పుడు చూసిన కొందరు... గర్ల్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ఇలా చేస్తున్నాడని అపోహపడ్డారు. కొందరు తను చేస్తున్న పనిని పొగిడారు. తనవల్ల కొంతమంది ముఖాల్లోనైనా చిరునవ్వు కనిపిస్తే చాలనుకున్నాడు. రెండు నెలల కిందట హైదరాబాద్‌కు బయలుదేరినప్పుడు.. తనకు వీడ్కోలు పలకడానికి వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు తరుణ్.

అయితే సిటీకి వచ్చాక ఖాళీగా ఉండలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, సికింద్రాబాద్ స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్... ఇలా వివిధ ప్రాంతాల్లో ‘యూ ఆర్ పర్‌ఫెక్ట్’ బోర్డుతో అందరినీ ఆలోచింపజేశాడు. ఆ బోర్డును చూసిన ఒకావిడ ‘ఓ మై గాడ్... ఇంతకుముందు నాకెవ్వరూ ఇలా చెప్పలేదు’ అని సంతోషిస్తుంటే ఆనందం కలిగిందంటాడు తరుణ్. జీవితం మీద నిరాసక్తతతో ఉన్న కొందరిలో ఆశలు చిగురింపజేసినా... తను చేస్తున్న పనికి ఫలితం దక్కినట్టేనని చెబుతున్నాడు. పుణేలో ఉద్యోగానికి మళ్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణ్ గిద్వాని... ఈ మంచి పనిని కొనసాగిస్తాడని ఆశిద్దాం.  
 ..:: వాంకె శ్రీనివాస్
 

మరిన్ని వార్తలు