రాక్ స్క్రిప్ట్

17 Oct, 2014 00:37 IST|Sakshi
రాక్ స్క్రిప్ట్

మనకు రాక్ బ్యాండ్స్ కొత్త కాదు. టీనేజ్ స్పీడ్‌తో రాక్ గ్రూప్‌ను తయారు చేసుకోవడం, ఉద్యోగంతోనో.. బిజినెస్‌తోనో కెరీర్ ముడిపడ్డాక బ్యాండ్‌కు శుభం కార్డు వేయడం సిటీలోని మ్యూజిక్ లవర్స్‌కు తెలిసిన రాక్ బృందాల రాత. అయితే దీన్ని తిరగరాస్తోంది ‘స్క్రిప్ట్’. ఎనిమిదేళ్లుగా అంతకంతకూ పుంజుకుంటున్న ఈ రాక్ టీమ్.. త్వరలోనే రెండో ఆల్బమ్ విడుదలకు సిద్ధమవుతోంది.
 
 సిటీలో ఏళ్ల తరబడి ఒక బ్యాండ్ బజాయించడం విశేషమే. ‘మాది థ్రాష్ మెటల్ బ్యాండ్’ అని చెప్పాడు అబ్బాస్ రజ్వీ. థ్రాష్ మెటల్‌ను మెలొడీస్‌తో మేళవించిన ఒక వైవిధ్యభరిత సంగీత సంరంభమే తమ బృంద విశిష్టత. ఎనిమిదేళ్ల క్రితం తనతో పాటుగా రాజీవ్ (డ్రమ్స్), అఖిల్ (ఎక్స్-గిటారిస్ట్), రమ్య (ఎక్స్-గిటారిస్ట్), సినిక్(వోకలిస్ట్)లు కలసి రూపకల్పన చేసిన ‘స్క్రిప్ట్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా మ్యూజిక్ మస్తీ చేస్తోంది. ‘నిజానికి మేం ఎంటరైన టైమ్‌లో మెటల్ స్టైల్ ఆల్‌మోస్ట్ డెత్ స్టేజ్‌లో ఉంది. అయితే కొన్ని మార్పు చేర్పులతో మేం తిరిగి దానికి సిటీలో లైఫ్ ఇచ్చాం’ అని అంటారు అబ్బాస్. తొలిదశలో పాంటెరా, డెత్ వంటి బ్యాండ్స్‌కు చెందిన ఆల్బమ్స్‌ను ప్లే చేసిన స్క్రిప్ట్.. ఆ తర్వాత తమకంటూ స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకుంది.
 
 2010లో ఫస్ట్ సీడీ..
 సిటీలో తమ బ్యాండ్‌కి ఒక క్రేజ్ ఏర్పడిన తర్వాత దాన్ని కంట్రీవైజ్‌గా తీసుకెళ్లడానికి ఈ బ్యాండ్ నాలుగేళ్ల కిందట ఫస్ట్ సీడీ రిలీజ్ చేసింది. ‘డిస్కార్డ్’ పేరుతో రిలీజ్ చేసిన ఈ సీడీకి మ్యూజిక్ సర్కిల్‌లో మంచి పేరు రావడంతో.. స్క్రిప్ట్ బ్యాండ్ వెనుదిరిగి చూసుకోలేదు. డిస్కార్డ్ టూర్ పేరుతో ఈ బ్యాండ్ జంటనగరాల్లోనూ ముంబైని చుట్టేసింది. దుబాయ్‌లో ‘ప్రీచింగ్ వెనమ్ టూర్’, నార్వేలో పబ్ రాక్ ఫెస్ట్, చెన్నైలో మెటలై జ్డ్ ఫెస్ట్, పుణేలో మెటాక్లిస్మ్, ఫ్రాన్స్‌లో డెక్కన్ రాక్, ఢిల్లీలోని డబ్ల్యూఆర్‌ఎమ్‌ఈ ఫెస్టివల్.. ఇలా దేశవిదేశాల్లో షోస్ నిర్వహిస్తూ హైదరాబాద్ రాక్‌కు ఓ ఐడెంటిటీని తీసుకొస్తోంది.
 
 రాక్‌సీన్‌కు ఫ్యూచర్ సూపర్బ్..
 ఓ ఫైనాన్షియల్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి రాక్ సీన్‌లో డ్రమ్స్ మోగిస్తున్న సుజుకి నాయుడు, డెల్‌లో జాబ్‌లకు గుడ్‌బై చెప్పి గిటారిస్ట్స్‌గా మారిన కూకట్‌పల్లి వాసి రవి, సైనిక్‌పురి నివాసి జోయెల్, ముంబైలో ఉంటూ షోస్ ఉన్నప్పుడు మాత్రం గొంతు సవరించుకునే టీసీఈ ఉద్యోగి సినిక్, బేస్ గిటారిస్ట్, సౌండ్ ఇంజనీర్‌గా వ్యవహరించే అబ్బాస్ రజ్వీలు స్క్రిప్ట్ వేదికగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు సిటీలో రాక్ బ్యాండ్స్ పెర్ఫార్మెన్స్‌కు సరైన వేదిక ఉండేది కాదని, ఇప్పుడు కేవలం రాక్ ప్రదర్శనల కోసమే ‘హార్డ్ రాక్ కేఫ్’, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్, కెఫె డే లెట్టె వంటివి ఏర్పాటవడం, దాదాపు ప్రతి రెస్టారెంట్, క్లబ్‌లలో రాక్ మ్యూజిక్ కంపల్సరీగా మారడం సిటీ రాక్‌కు ఇస్తున్న ఇంపార్టెన్స్‌కు నిదర్శనమంటోందీ టీమ్. ఈ ఏడాది చివర్లో తమ రెండో ఆల్బమ్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ఈ రాక్ గ్రూప్‌కి ఆల్ ద బెస్ట్.
 - ఎస్.సత్యబాబు

మరిన్ని వార్తలు