నా పయనంలో జంటస్వరాలు

19 Mar, 2015 23:59 IST|Sakshi

ప్రవాహం నా జీవన విధానం. పయనం నా జీవిత పాఠం. ప్రయాణం నా ప్రాణం. ఈ ప్రవాహంలో నాకు నచ్చనివి ఒడ్డున వదిలేస్తూ.. నచ్చినవి నాలో అంతర్భాగం చేసుకుంటూ.. నా జీవితాన్ని మరింత సారవంతం చేసుకుంటున్నా. గమ్యాన్ని కాదు గమనాన్ని ప్రేమించు అన్న వాస్తవాన్ని గ్రహిస్తూ ప్రవహిస్తున్నా. నా ఈ చిన్ని జీవితంలో, నేను చేసిన కొన్ని ప్రయాణాల్లో.. ఎందరో వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వస్తువులు, ప్రదేశాలు, సన్నివేశాలు నన్ను ప్రభావితం చేశాయి.
 
ఇటీవల చేసిన ప్రయాణంలో కర్ణాటకలోని ఓ చిరుగ్రామం కెరతణ్ణూరు నుంచి బెంగళూరు వరకూ ఎన్నో జ్ఞాపకాలను భద్రంగా మూటగట్టుకున్నా. అందులో పదిలంగా దాచుకునే పరిచయం ఒకటుంది. పరిచయం పాతదే కానీ ఈసారి చూసిన కోణం కొత్తది.
 
చిరునవ్వుల హృదయాలు..
బెంగళూరులో మిలటరీ ఆఫీసర్ల క్వార్టర్లు. చుట్టూ దట్టంగా తరువులు, వాటి మధ్య పాత రాతి కట్టడాల కాటేజీల్లో ఓ అందమైన తెలుగు పొదరింటికి చుట్టపు చూపుగా వెళ్లాను. ఆ పొదరింట్లో ఏడేళ్ల ఓ తుంటరి ప్రశ్నల పుట్ట, వాడి అల్లరిని చిరునవ్వుతో ఆస్వాదిస్తూ, నిండు కుండలా తొణకని వ్యక్తిత్వంతో ఆ ఇంటికి, ఇల్లాలికి కొండంత అండలా ఓ ధీర గంభీరుడు, అతని చిరునవ్వే తన ఆనందంలా స్వచ్ఛంగా ఉబ్బితబ్బిబ్బైపోతున్న ముద్దబంతి ఆ ఇంటి ఇంతి. ముచ్చటగా ముగ్గురున్న ఆ ఇంటిని చూసి ఎంత ముచ్చటేసిందో.

అక్కడ ప్రేమ ప్రవహిస్తోంది. ఆ ముద్దబంతి మీ అందరికీ తెలిసిన నా సహనటి, యాంకర్ గాయత్రీ భార్గవి. వారింట గడిపిన ప్రతిక్షణం అపురూపంగా దాచుకునే అందమైన ఫ్రేములే. లెఫ్టినెంట్ కల్నల్ విక్రమ్, భార్గవిల భాగస్వామ్యం మరింత అపురూపమైన అనుబంధంగా మారాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేశాను. సమకాలీన సాహచర్యానికి నిజమైన అర్థంలా కనిపించిన ఆ ఇద్దరినీ చూస్తూ నా ప్రయాణంలో నన్ను ప్రభావితం చేసిన మరికొందరి జీవన భాగస్వామ్యాలు తలుచుకున్నాను.
 
భళా తందతానా
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది సత్యం కాదని నిరూపించిన జంటని బోస్టన్‌లో కలిశాను. ఆమె మాట పదును తేలిన కత్తి, ఆయన మాటని అరుదుగా ఉపయోగించే మేటి. ఆమెకు మౌనం ఎప్పుడు ప్రయోగించాలో తెలుసు, ఆయనకు మాటని అస్త్రంగా ఉపయోగించడం తెలుసు. అదే వారి బలం. వారే అమెరికాలో ‘తానా’ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, ఆయన సతీమణి శ్యామా. ఇద్దరూ కార్యదక్షులు, సమఉజ్జీలు, శక్తివంతులు.. ఇద్దరూ కలసి అమెరికాలో ఏడెకరాల సువిశాల ప్రాంగణంలో రాజమహల్ లాంటి ఇంటిని నిర్మించుకునేంత సంపన్నులుగా ఎదిగారు. ఐశ్వర్యం కంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది వారి భాగస్వామ్యం గురించి. వారిద్దరి మధ్య ఉన్నది పరస్పర గౌరవం, అందుకే రెండు కత్తులూ ఒకే ఒరలో ఒదిగిపోయాయి.
 
చందురుని మించు..
మరో జంట అమెరికాలోనే డల్లాస్‌లోని కవి మిత్రుడు, రచయిత కన్నెగంటి చంద్ర. ఆయన బెటర్ హాఫ్ మంజులత. మాటల మాంత్రికుడుగా కథాగమనాన్ని నడిపించే చంద్రగారు మట్లాడటంలో మహా పొదుపరి. ఉద్యోగంతో పాటు ‘తానా’లో పలు బాధ్యతలు నిర్వహించే మంజుగారు చమత్కారి. అమెరికా పెరట్లో అపురూపంగా పెంచుకున్న మల్లెతీగకు విచ్చుకున్న మల్లెలను చూసి పసిపిల్లలా మురిసిపోయే ఆవిడ భావుకతని, తన కళ్లలోని చిరునవ్వుతో అర్థం చేసుకునే తాత్వికుడు ఆయన. ఆమె ఆప్యాయంగా చంద్రమా అని పిలిస్తే, నిండు చందమామలా పరవశిస్తాడాయన. ఉరకలేసే కుందేలుని తనలోనే అంతర్భాగం చేసుకున్న చందమామ లాంటిది వారిద్దరి భాగస్వామ్యం. మల్లెలను చూసినా వారే గుర్తొచ్చేంత అపురూపమైనది వారి సాహచర్యం.
 
పరుగులు తీసే మనసులు..
ఇక నా ఆప్తమిత్రులు, ఆత్మబంధువులు అయిన లక్ష్మీ, వెంకట్‌ల గురించి ప్రస్తావించకుండా ఎలా ఉండగలను. ఇద్దరూ విలక్షణంగా మల్టీ టాస్కర్లు. ఇద్దరూ స్వచ్ఛమైన  పర్‌ఫెక్షనిస్టులు. ఇద్దరి తత్వం ఒకటే.. సరికొత్త రంగంలో ఉన్నతంగా నిలవడం. కానీ తమాషాగా ఒకరికొకరు పోటీ. ఎవరు గెలుస్తారనే బెంగే లేదు, అయినా పరుగుపందెంలా ఉంటుంది వారి సాహచర్యం. గమ్మత్తేంటంటే పందెంలో పరుగెడుతూ కూడా ఒకరి చేయి మరొకరు విడువరు. ఒకరితో మరొకరు తోడుగా పక్కనే పరుగులో ఉంటారు. కానీ పందెం మాత్రం ఉంటుంది, పంతం కాదు. ఒకరు గెలిస్తే మరొకరు గెలిచినట్టే ఒకరు ఓడితే మరొకరు ఓడినట్టే. అందమైన పోటీతత్వంలో ఒదిగిపోయిన ప్రేమ తత్వం వారిద్దరిదీ.

ప్రయాణమే లేకపోతే ఇంతటి అందమైన భాగస్వామ్యం అర్థమయ్యే అవకాశం కోల్పోయి ఉండేదాన్ని. నగర జీవితంలో ఉరుకులు, వృత్తి జీవితంలో ఒడిదుడుకులు.. ఎన్ని ఉన్నా జీవనయానం యాంత్రికం కాకుండా కాపాడుకునేందుకు ప్రేరణ ఈ అందమైన జంటలు. ప్రేమించే హృదయాలు పోటీతత్వంతో ముడిపడి ఒకరి శక్తిని మరొకరు అర ్థం చేసుకుని ఒకే ఒరలో ఇమిడే కత్తులై, చందమామలోని కుందేలులా విడదీయలేని అనుబంధమై సాగిపోవాలనే స్ఫూర్తినిస్తున్న ఈ జంటల్లో మన ని మనం వెతుక్కోవచ్చు. ఆనందాన్ని పెంచుకోవచ్చు. హ్యాపీ ఫ్యామిలీస్ అంటే హ్యాపీ సిటీస్.

మరిన్ని వార్తలు