హరి.. ఏదీ దారి?

22 Aug, 2013 21:34 IST|Sakshi
హరి.. ఏదీ దారి?

సమైక్యాంధ్రకు మద్దతుగా అందరికంటే ముందుగా రాజీనామాను ఆమోదింపజేసుకున్న ఎన్టీఆర్ తనయుడు, తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాన్ని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న నందమూరి వారసుడి తర్వాతి స్టెప్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. నారా, నందమూరి కుటుంబాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో హరికృష్ణ రాజీనామా సంచలనం రేపింది.

చంద్రబాబు నాయుడు, హరికృష్ణ మధ్య రాజుకున్న చిచ్చుకు రాష్ట్ర విభజన అంశం ఆజ్యం పోసింది. రాష్ట్ర విభజనకు తన బావ ఓకే చెప్పడంతో అగ్గిమీద గుగ్గిలమయిన హరికృష్ణ పార్టీ కట్టబెట్టిన ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారు. తనను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఒంటరిని చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుతంత్రాలు గమనించిన హరికృష్ణ కొద్ది రోజులుగా పార్టీతో అంటిముట్టనట్టు ఉంటున్నారు. అటు చంద్రబాబు కూడా హరికి పొమ్మనకుండా పొగబెట్టారు. దీంతో నిన్న జరిగిన సోదరుడు నంమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహానికి కూడా హరికృష్ణ హాజరు కాలేదు. ఈ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్కు అసలు ఆహ్వానమే అందలేదన్న ప్రచారమూ జరుగుతోంది. చంద్రబాబు గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగిందని హరి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

ఇక ఎంపీ పదవిని వదులుకున్న హరికృష్ణ- టీడీపీలో కొనసాగుతారా, అన్న తెలుగుదేశం పార్టీని పునరుద్దరిస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌లా మారింది. అయితే ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందు ఆయన భాగస్వామి అవుతారని హరి సన్నిహితులు అంటున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి చైతన్యరథ యాత్రను ప్రారంభించే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాల సమాచారం. 

హైదరాబాద్‌లోని  తన తండ్రి సమాధి ఎన్‌టీఆర్ ఘాట్‌లో దీక్షచేస్తారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత హరికృష్ణ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. కాగా, చంద్రబాబు ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై టీడీపీలోని పలువురు ముఖ్యనేతలే హర్షం వ్యక్తం చేస్తుండడం విశేషం.

మరిన్ని వార్తలు