నాన్‌ వెజ్‌పై ఢిల్లీ కార్పొరేషన్‌ సంచలన ఉత్తర్వులు

28 Dec, 2017 10:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నాన్‌ వెజ్‌ వంటకాలపై బీజేపీ పాలిత దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ వివాదాస్పద ఉత్తర్వులు జారీచేయనుంది. నాన్‌ వెజ్‌ వంటకాలను దుకాణాల ముందు డిస్‌ప్లే చేయరాదని ఆహార అవుట్‌లెట్లను కార్పొరేషన్‌ ఆదేశించనుంది. ఇటీవల జరిగిన సమావేశం‍లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డీఎంసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సభా నాయకుడు షికా రాయ్‌ చెప్పారు. పరిశుభ్రత, మాంసాన్ని చూడటం ద్వారా కొం‍దరి సెంటిమెంట్‌ దెబ్బతినడం వంటి కారణాలతో మాంసాహార వంటకాల డిస్‌ప్లేను నిషేధిస్తున్నట్టు చెప్పారు.

వండిన, ముడి మాంసం ఏదైనా షాపు ఓనర్లు షాపు ముందు డిస్‌ప్లే చేయడంపై నిషేధం విధించనున్నట్టు ఆయన తెలిపారు. నజఫ్‌గర్‌ జోన్‌ నుంచి ఓ కౌన్సిలర్‌ హెల్త్‌ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావించగా, దీన్ని ఎస్‌డీఎంసీ దృష్టికి తీసుకువెళ్లగా సభ ఆమోదించిందని కార్పొరేషన్‌ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలించి మున్సిపల్‌ కమిషనర్‌ దీనికి ఆమోదం తెలపవచ్చని లేదా తిరస్కరించవచ్చని చెప్పారు.

సౌత్‌ ఢిల్లీలో హజ్‌ ఖాస్‌, న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ, సఫ్దర్‌జంగ్‌ గ్రీన్‌ పార్క్‌, కమల్‌ సినిమా, అమర్‌ కాలనీ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో మాంసాహారాన్ని విక్రయించే పలు ఈటరీలు, రెస్టారెంట్లున్నాయి. మాంసాన్ని విక్రయించే పలు ప్రాంతాల్లో కబాబ్‌లు, షావర్మాలను ప్రదర్శించడం అతి సాధారణం. అయితే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయంపై పలు రాజకీయ పార్టీలు, వైద్య వర్గాల నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు